కాకతీయ కోటలకు బీటలు..ఆనవాళ్లు కోల్పోతున్న మట్టికోట

  • ఓరుగల్లు రక్షణకు 800 ఏండ్ల కింద ఏడు ప్రాకారాల నిర్మాణం
  • గతంలోనే కనుమరుగైన ఐదు కోటలు
  • పట్టించుకోని బీఆర్ ‌‌‌‌‌‌‌‌ఎస్ ‌‌‌‌‌‌‌‌సర్కార్‌
  • కాంగ్రెస్ ‌‌‌‌‌‌‌‌ప్రభుత్వమైనా రక్షణ చర్యలు చేపట్టాలంటున్న ప్రజలు

వరంగల్, వెలుగు : కాకతీయ రాజులు 800 ఏండ్ల కింద ఓరుగల్లులో నిర్మించిన కోట శిథిలావస్థకు చేరుకుంటోంది. శత్రుదుర్బేధ్యంగా నిర్మించిన మట్టికోట ఇప్పటికే ఆనవాళ్లు కోల్పోగా, రాతికోట రోజురోజుకు ధ్వంసం అవుతోంది. ఫిరంగులతో శత్రువులను ఎదుర్కొనే విధంగా నిర్మించిన సాయుధ దళాల బురుజులు సైతం కూలిపోతున్నాయి. వరద నీరు పోయేందుకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో కాకతీయుల కట్టడాలు ఎప్పుడు చూసినా నీరు, బురదలోనే కనిపిస్తున్నాయి.

రాజధాని చుట్టూరా 7 కోటలు.. 

వరంగల్ ‌‌‌‌‌‌‌‌ రైల్వే స్టేషన్ ‌‌‌‌‌‌‌‌కు కిలోమీటర్ ‌‌‌‌‌‌‌‌ దూరంలో ఉన్న ఖిలా వరంగల్ ‌‌‌‌‌‌‌‌ను రాజధానిగా చేసుకొని కాకతీయ రాజులు పాలన సాగించారు. వరంగల్ ‌‌‌‌‌‌‌‌ కోట నిర్మాణాన్ని 1199లో గణపతి దేవుడు ప్రారంభించగా, ఆయన వారసురాలు రాణీ రుద్రమ పనులను పూర్తి చేసినట్లు చరిత్ర చెబుతోంది. తమ రాజధానిని కాపాడుకునేందుకు కాకతీయ రాజులు 19 కిలోమీటర్ల విస్తీర్ణంలో వృత్తాకారంలో 7 కోటలు నిర్మించారు. వీటి వద్ద సాయుధ దళాలు బందోబస్తు నిర్వహిస్తుండగా, రాజవీధులు, ఇతరత్రా చోట్ల రథ, అశ్వక దళాలు, ఏనుగుల మీద భటులు నిరంతరం గస్తీ కాసేవారు. 

మాయమైన మొసళ్ల జలకందకం, పుట్టకోట

కాకతీయ రాజులు ఏడు కోటల నిర్మాణంలో భాగంగా నాలుగైదు ప్రాకారాలుగా జల కందకం, పుట్ట కోట నిర్మించారు. 18 అడుగుల వెడల్పుతో తవ్విన కందకంలో నీటిని నింపి మొసళ్లను వదిలేవారు. తర్వాతి ప్రాకారంలో విషసర్పాలు వదిలారు. దీంతో కాకతీయ రాజ్యం మీద యుద్ధానికి వచ్చే శత్రువులు మొదటి మూడు కోటలు దాటినప్పటికీ ఈ నాలుగైదు ప్రాకారాలు దాటడం ప్రాణాంతకంగా ఉండేది. ప్రస్తుతం ఈ ప్రాకారాల పరిధిలో ఎక్కడో ఒక చోట చిన్నపాటి మడుగులు, పుట్టల ఆనవాళ్లు తప్ప మిగతా మొత్తం కనిపించకుండా పోయింది.

కరిగిపోతున్న మట్టికోట 

కాకతీయులు నిర్మించిన ఏడు  ప్రాకారాల్లో ఐదు ఆనవాళ్లు లేకుండా పోయాయి. ప్రస్తుతం మట్టికోట, రాతికోట మాత్రమే కనిపిస్తున్నాయి. ధరణి కోటగా పిలిచే ఆరో ప్రాకారమైన మట్టి కోటను రాజధాని చుట్టూరా ఎనిమిది కిలోమీటర్ల మేర నిర్మించారు. 150 అడుగుల వెడల్పు, 40 అడుగుల ఎత్తుతో ఉండే మట్టి కోట గత 10, 20 ఏండ్ల నుంచి ఆనవాళ్లు కోల్పోతుంది. మట్టికోట ప్రస్తుతం కొన్ని చోట్ల దారిగా మారిపోగా, మరికొన్ని చోట్ల ఐదు నుంచి 12 మీటర్ల ఎత్తులో వారసత్వ గుర్తుగా కనిపిస్తోంది.

ధ్వంసమవుతున్న రాతికోట, బురుజులు

కాకతీయుల రాజధానికి అతి దగ్గరగా, సైనిక దళాలు పహారా కాసేలా 15 మీటర్ల ఎత్తుతో నాలుగు కిలోమీటర్ల మేర గ్రానైట్ ‌‌‌‌‌‌‌‌ రాళ్ల కోట నిర్మించారు. కనీస పర్యవేక్షణ చర్యలు లేకపోవడంతో కట్టడాలు ధ్వంసం అవుతున్నాయి. సాయుధ దళాలు ఫిరంగులతో పహారా కాసే బురుజులు చాలా చోట్ల కూలిపోతున్నాయి. ఈ ప్రాంతంలో వరద నీరు వెళ్లేందుకు సరైన చర్యలు లేకపోవడంతో వానాకాలంలో నెలల తరబడి నీరు నిల్వ ఉంటోంది. రాతి కోటను ఆనుకొని ఉండే అశ్వక దళాలు, ఏనుగుల కొట్టాలు, మడి సంత, మైల సంత  ప్రాంతాలు ప్రస్తుతం చెరువును తలపిస్తున్నాయి. ఖిలా వరంగల్ ‌‌‌‌‌‌‌‌ సెంటర్ ‌‌‌‌‌‌‌‌గా ఉండే శిల్ప సంపద సైతం ఆకతాయిల కారణంగా కళ తప్పుతోంది.

పదేండ్లు పట్టించుకోని బీఆర్ ‌‌‌‌‌‌‌‌ఎస్ ‌‌‌‌‌‌‌‌

పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ ‌‌‌‌‌‌‌‌ఎస్ ‌‌‌‌‌‌‌‌ కాకతీయుల వారసత్వ, కళా సంపదను రక్షించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. 2022 జులై 7న అప్పటి బీఆర్ ‌‌‌‌‌‌‌‌ఎస్ ‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం కాకతీయుల వారసుడు కమల్ ‌‌‌‌‌‌‌‌ చంద్ర భంజ్ ‌‌‌‌‌‌‌‌దేవ్ ‌‌‌‌‌‌‌‌ను ఖిలా వరంగల్ ‌‌‌‌‌‌‌‌కు ఆహ్వానించింది. అశ్వరథాలపై కోట మొత్తం తిప్పింది. అదే రోజు సాయంత్రం అప్పటి మంత్రి కేటీఆర్ ‌‌‌‌‌‌‌‌, కాకతీయ వారసుడు కమల్ ‌‌‌‌‌‌‌‌ చంద్ర భంజ్ ‌‌‌‌‌‌‌‌దేవ్ ‌‌‌‌‌‌‌‌  కలిసి హైదరాబాద్ ‌‌‌‌‌‌‌‌ మాదాపూర్ ‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేటీఆర్ ‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా కాకతీయుల వారసత్వాన్ని కాపాడే ప్రయత్నం చేయలేదన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా తమ ప్రభుత్వం కాకతీయుల శిల్ప కళా సంపద, మట్టి, రాతి కోటల రక్షణకు చర్యలు తీసుకోకపోవడం పట్ల సిగ్గు పడుతున్నామని చెప్పారు. కాగా ప్రస్తుత కాంగ్రెస్ ‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వమైనా స్పందించి 800 ఏండ్ల నాటి కాకతీయ వారసత్వ సంపదను రక్షించాలని ప్రజలు, చరిత్రకారులు కోరుతున్నారు.