అణగారిన వర్గాలకు న్యాయం జరిగింది

  •     సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నం: దామోదర రాజనర్సింహ
  •     గాంధీ భవన్ లో ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో సంబురాలు

హైదరాబాద్, వెలుగు : ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. అణగారిన వర్గాలకు న్యాయం జరిగిందని, ధర్మం గెలిచిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. గురువారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో చిట్​చాట్ చేశారు. 30 ఏండ్ల సుదీర్ఘ పోరాటం గెలిచిందని, ఇన్నేండ్ల ఉద్యమ కాలంలో ఎంతోమంది అమరులయ్యారని మంత్రి గుర్తు చేశారు. 

వర్గీకరణ అంశానికి శాశ్వత పరిష్కారం చూపాలనే ఆలోచనతో గతంలో కాంగ్రెస్ పార్టీ ఉషా మెహ్రా కమిషన్ ఏర్పాటు చేసిందని మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ అన్నారు. మాదిగల స్థితిగతులపై స్టడీ చేసి కేంద్రానికి రిపోర్టు సబ్మిట్ చేసిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల వర్గీకరణ అనేది రాష్ట్రాల పరిధిలోనే ఏర్పాటు చేసుకోవాలన్న సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. 

కాగా, సుప్రీం కోర్టు తీర్పు సందర్భంగా గాంధీభవన్​లో ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం మాట్లాడారు. 30 ఏండ్ల తర్వాత ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అమలు కావడం సంతోషకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఉషా మెహ్రా కమిషన్ నివేదిక ఆధారంగానే సుప్రీం తీర్పు ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించాలని పిడమర్తి రవి డిమాండ్ చేశారు.