- ఢిల్లీ హైకోర్టులో వీడ్కోలు సమావేశం
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సురేశ్ కుమార్ కైత్ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా జడ్జిగా విధులు నిర్వహించిన ఢిల్లీ హైకోర్టుకు ఆయన వీడ్కోలు పలికారు. మంగళవారం ఢిల్లీ హైకోర్టు సిబ్బంది నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో జస్టిస్ సురేశ్ కుమార్ కైత్ మాట్లాడారు. తన తల్లిదండ్రులను, తోడబుట్టినవారిని తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు.
మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన తాను న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించడానికి, తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడానికి చాలా కష్టపడినట్లు చెప్పారు. ఢిల్లీ హైకోర్టులో పనిచేసిన ఇన్ని సంవత్సరాలలో తానకు ఎవరితోనూ ఎటువంటి వివాదం లేదన్నారు. విచారణల సమయంలో కొంత కఠినంగా ప్రవర్తించి ఉంటే..అది వ్యక్తిగతంగా మాత్రం కాదని వెల్లడించారు.
ఇన్ని రోజులు తనకు మద్దతు ఇచ్చినందుకు ఢిల్లీ హైకోర్టు సిబ్బందికి జస్టిస్ సురేశ్ కుమార్ కైత్ థ్యాంక్స్ చెప్పారు. కాగా.. మధ్యప్రదేశ్ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సురేశ్ కుమార్ కైత్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో గవర్నర్ మంగూభాయ్ పటేల్ ప్రమాణం చేయించారు.కార్యక్రమంలో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఆయన మంత్రివర్గ సహచరులు తదితరులు పాల్గొన్నారు.