1969 తెలంగాణ ఉద్యమకారులకు... న్యాయం చేయండి

దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా మన తెలంగాణ ప్రజలు నిరంకుశ నైజాం నవాబు పాలనలో బానిసలుగా ఉండేవారు. 1947 నుంచే  తెలంగాణ ఉద్యమకారులు నియంత  నైజాంకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడారు. నాడు నైజాం  రజాకార్ల ద్వారా  తెలంగాణ ప్రజలపై దౌర్జన్యం చేసి చంపటం మొదలుపెట్టాడు.  వరంగల్ జిల్లా పరకాల దగ్గర ఉన్న బైరానుపల్లి ఇప్పటికీ రజాకార్ల హింసకు  సాక్షిగా నిలిచింది. తెలంగాణలో జరుగుతున్న దౌర్జన్యకాండకు కేంద్ర హోం శాఖ స్పందించి 1948లో  సర్దార్ వల్లాబాయి పటేల్ ఆధ్వర్యంలో ఆర్మీని పంపించింది.  తెలంగాణ ప్రజలు ఆ ఆర్మీకి ఘన స్వాగతం పలికి మద్దతు తెలపడంతో పటేల్ ముందు నైజాం నవాబు లొంగిపోయాడు.  తెలంగాణ  ప్రజలకు  సెప్టెంబర్ 17న  విమోచన కలిగి స్వాతంత్ర్య భారతదేశంలో విలీనం అవడంతో స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు.  అయితే, 20 ఫిబ్రవరి 1956లో ఆంధ్ర రాష్ర్టంలో కలిపి  జెంటిల్ మెన్ అగ్రిమెంట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేశారు.  ఈనేపథ్యంలో 1956 నుంచే  ప్రత్యేక తెలంగాణ  రాష్ర్టం కావాలని ప్రజలు పోరాటం చేశారు. 1968 లో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఏపీకి చెందిన డీఎస్ రెడ్డిని నియమించటంతో ఆంధ్ర విద్యార్థులు రాగా తెలంగాణ విద్యార్థులు ముల్కి రూల్ అమలు చేయాలని కోరారు. 1969లో మర్రి చెన్నారెడ్డి ఉద్యమంలోకి ప్రవేశించిన తరువాత  మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే గొప్ప ఉద్యమంగా పేరు ప్రఖ్యాతలు పొందింది. 

హామీలను తుంగలో తొక్కిన కేసీఆర్ 

2014 జూన్ 2న  తెలంగాణ ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకొని స్వయం పాలన  ఏర్పాటు చేసుకున్నాం.  అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధాలకు అధిపతి అయిన కేసీఆర్ మాయ మాటలు చెప్పి మాయల ఫకీరును మరిపించే విధంగా హామీలు ఇచ్చాడు.  చావు నోట్లో తల పెట్టి,  నా ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ తెచ్చానని, ఉద్యమ సంస్థ తెలంగాణ రాష్ర్ట సమితికి అధిపతిని అని,  దళితుడిని తెలంగాణ  రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రిని  చేస్తానని చెప్పాడు. అంతేకాకుండా, దళితులకు 3 ఎకరాల భూమిని ఇస్తానని హామీ ఇచ్చాడు. తెలంగాణ ఉద్యమంలో,  సకల జనుల సమ్మెలోనూ యువకులు కీలక పాత్ర పోషించారని తాము అధికారంలోకి రాగానే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని, నిరుద్యోగ భృతి ఇస్తానని ఎన్నో హామీలు ఇచ్చి అందంలం ఎక్కిన తరువాత మాటతప్పి హామీలను తుంగలో తొక్కాడు. అధికార గర్వంతో టీఆర్ఎస్​ను  బీఆర్ఎస్​గా మార్చిన  కేసీఆర్ ను ఉద్యమకారులు ఇటీవల జరిగిన ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారు.  కాగా,  తెలంగాణ ఏర్పడ్డాక 1948 , 1969 తెలంగాణ ఉద్యమంలో చనిపోయినవారిని తెలంగాణ సాధకులుగా గుర్తించాలని కోరాం. ఉద్యమ కారుల చరిత్రను భవిష్యత్ తరాలకు తెలిసేవిధంగా  100 ఎకరాల్లో స్మృతి వనం నిర్మించాలని,  ఏపీ వాళ్లు దోచుకున్న నీళ్లు, నిధులు నియామకాలు మనకు దక్కాలని  సమగ్ర వివరాలతో 15 లేఖలు కేసీఆర్ కు రాసినా స్పందించలేదు.

ఉద్యమ ద్రోహులకు పెద్దపీట

తెలంగాణ ఉద్యమకారులను హింసించిన ఉద్యమ ద్రోహులను కేసీఆర్​ తన  కేబినెట్ లో  చేర్చుకున్నాడు.  ఉద్యమకారులను కలవకుండా నైజాం నవాబుకు మించిన నిరంకుశ, నియంత పాలనను కేసీఆర్ కొనసాగించాడు.  అవసరం లేకున్నా పాత సెక్రటేరియెట్ ను కూలగొట్టి  ప్రజాధనం వృథా చేసి కొత్త సెక్రటేరియెట్ ను నిర్మించాడు.  కోట్లు ఖర్చు చేసి తాను ఉండటానికి ఫాం హౌస్​తో పాటు  ప్రగతి భవన్ ను నిర్మించుకున్నాడు.  ప్రభుత్వ ఆస్తులను తన సొంత ఆస్తులుగా, తన సొంత జాగీరులా భావించాడు. తెలంగాణ ప్రాంతం దక్కన్  పీఠభూమి. దీనికి గోదావరి వర ప్రసాదం లాంటిది.  కావున, 1999లో బీజేపీ నన్ను గోదావరి వాటర్ యుటిలైజేషన్ సెల్ కు కన్వీనర్ గా నియమించింది.16 ఫిబ్రవరి  1999 నాడు ఎల్లంపల్లి నుంచి 300 కిలోమీటర్ల  పాదయాత్ర ద్వారా  గ్రామీణ ప్రజలకు గోదావరి జల వినియోగాన్ని వివరిస్తూ  హైదరాబాద్ కు చేరుకున్నాను. ఈ పాదయాత్రతో అప్పటి ప్రభుత్వం గోదావరి వాటర్  యుటిలైజేషన్ అథారిటీ, జీవో ఎంఎస్ 55ను 12 ఏప్రిల్ 1999న విడుదల చేసింది.  నేను, 12 మంది నిపుణులైన ఇంజినీర్లతో కమిటీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇంజినీర్ హనుమంతరావు, రిటైర్డ్ ఇంజినీర్ శ్రీనివాసరావుతో  వేసిన రిపోర్టును అమరవీరుల స్థూపం గన్ పార్క్  దగ్గర  తెలంగాణ  ప్రజలకు అంకితమిచ్చాం.  ఆ రిపోర్టు ప్రకారం ఇచ్చంపల్లిలో  సున్నంతో  నిర్మించిన  బ్రిడ్జి కొన్ని వందల ఏండ్లు అయినా చెక్కు చెదరలేదు.  

నిపుణుల సూచనలు కేసీఆర్  బేఖాతర్​

చిన్న చిన్న డ్యాముల గురించి వర్క్ షాప్ ను 2000 మే 7న జూబ్లిహిల్స్ లో ఏర్పాటు చేశాం.  ఈ వర్క్ షాప్ కు అప్పటి కేంద్ర జలవనరులశాఖ మంత్రి సీపీ ఠాకూర్,  విద్యుత్ శాఖ మంత్రి కుమార మంగళం హాజరయ్యారు. ఆ వర్క్ షాప్ లో వందలాది మంది నిపుణులతో చర్చలు జరిపి అంతిమంగా గోదావరి వర్షాకాలంలో ఉధృతికి మెగా ప్రాజెక్టులు తట్టుకోలేవని తేల్చారు.  వర్షాకాలంలో వివిధ సమయాల్లో నీటిని లెక్కించి అందుకు చిన్న చిన్న డ్యాములను నిర్మించి, తెలంగాణ మొత్తం జిల్లాల్లో ఉన్న 35 వేల చెరువులను నింపటానికి కావల్సిన రిజర్వాయర్లను ఏర్పాటు చేసుకొని,  కాలువల ద్వారా తెలంగాణ మొత్తానికి తాగునీరు, సాగునీరు అందించాలని తీర్మానించారు. ఈ విషయాన్ని కేసీఆర్ తో  మా ఇంట్లో జరిగిన చర్చల్లో  వివరించాను.  కానీ, నా మాటలు, నిపుణుల సలహాలు, సూచనలు అమలు చేయకుండా.. ఎవరితో కూడా చర్చించకుండా, 80 వేల పుస్తకాలు చదివిన నాకు అన్నీ తెలుసని ఏకపక్షంగా  మెగా ప్రాజెక్టును నిర్మించాడు.  తెలంగాణను ముంచాడు. 

పదేండ్లు అపాయింట్ మెంట్ ఇవ్వలే

తెలంగాణ  ప్రత్యేక రాష్ర్టం కోసం ఎన్నో పోరాటాలు చేసి జీవితాలు త్యాగం చేసిన ఉద్యమకారులను గత 10 ఏండ్ల పాలనలో  కేసీఆర్ పట్టించుకోలేదు. కనీసం మా సమస్యలు చెప్పుకునేందుకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. తెలంగాణ రాకముందు... తెలంగాణ ఉద్యమకారులం అయిన మా దగ్గరకు  కేసీఆర్ ఎన్నోసార్లు వచ్చాడు.  ఇరిగేషన్,  కరెంట్,  నీళ్లు,  నిధులు,  నియామకాల  గురించి ఎన్నో వివరాలు తెలుసుకున్నాడు.  రోజులపాటు ఉద్యమకారులు,  మేధావులతో  చర్చలు జరిపాడు. ఎప్పుడైతే  రాష్ర్టం ఏర్పడి సీఎం అయ్యాడో  అప్పటి నుంచి ఉద్యమకారులను, మేధావులను దగ్గరకు కూడా రానివ్వలేదు.  అందుకే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించాలని ఉద్యమకారులుగా  డిమాండ్ చేసినం. అయన చేసిన తప్పులే ఆయన్ని ప్రతిపక్షంలో కూర్చొబెట్టినాయి.

1969 తెలంగాణ ఉద్యమకారులగా మా డిమాండ్లు

 గన్ పార్క్​లో అమరవీరుల స్థూపానికి ఈ రోజు వరకు కూడా శిలాఫలకం లేకుండా అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నం. కావున,  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,  సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని శిలాఫలకం ఏర్పాటు చేసి ఉత్సవం జరిపి స్థూపం శిల్పి పద్మశ్రీ ఆచార్య ఎక్కా యాదగిరిని సన్మానించాలి. 1948లో  తెలంగాణ  ప్రాంత విమోచన కోసం పోరాటం చేసిన  స్వాతంత్ర్య సమరయోధులకు, తెలంగాణ రాష్ర్ట  స్వపరిపాలనకు పోరాటం చేసిన  1969 ఉద్యమకారుల చరిత్రను భావితరాలకు 
స్ఫూర్తినిచ్చే విధంగా 100 ఎకరాల్లో స్మృతివనంను  కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి.  తెలంగాణ విమోచన దినం 
సెప్టెంబర్ 17ను కర్నాటక, మహారాష్ర్ట ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తున్నాయి. అదేవిధంగా తెలంగాణలోనూ విమోచన దినంను రాష్ర్ట ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతున్నాం. 1969 తెలంగాణ ఉద్యమకారులనను ‘తెలంగాణ రాష్ర్ట సాధకులు’గా గుర్తించి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి. 1969 తెలంగాణ ఉద్యమకారులను గుర్తించటానికి ప్రభుత్వం చట్టబద్ధమైన కమిటీ ఏర్పాటు చేయాలి. తెలంగాణ రాష్ర్టం కోసం పోరాటాలు చేసిన ఉద్యమకారులపై కేసులు కొట్టివేయాలి.  మలి దశ ఉద్య
మంలో బలిదానాలు చేసుకున్న ఉద్యమకారుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 3 ఎకరాల వ్యవసాయ భూమి కేటాయించాలి.

- మేచినేని 
కిషన్ రావు,మాజీ మంత్రి,ప్రెసిడెంట్

- దుశ్చర్ల
సుదర్శన్ రావుసెక్రటరీ జనరల్,  1969 ఉద్యమకారుల సమితి