ఫోన్ ట్యాపింగ్​తో.. ప్రాథమిక హక్కులు హరించిన ప్రబుద్ధులు : జస్జిస్ ఈశ్వరయ్య

తెలంగాణలో  ఇప్పుడు  ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం  పెనుసంచలనం సృష్టిస్తోంది.  ఇటీవల  హైకోర్టు ఈ కేసును  సుమోటోగా  విచారణకు స్వీకరించింది.  బీఆర్ఎస్  ప్రభుత్వం అధికారంలో  ఉన్నప్పుడు  రాజకీయ  ప్రత్యర్థుల ఫోన్లను మాత్రమే కాదు న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని పత్రికల్లో వార్తా కథనాలు రావడంతో హైకోర్టు సుమోటోగా  స్పందించడం అత్యంత హర్షదాయకం.  

తెలంగాణలో  గత  ప్రభుత్వ హయాంలో ఒక పథకం ప్రకారం చట్టవిరుద్ధంగా  ఫోన్ ట్యాపింగ్ జరిగేదని, నియమ నిబంధనలకు వ్యతిరేకంగా, చట్టవిరుద్ధంగా  ఫోన్ ట్యాపింగ్ చేశారన్న రకరకాల కథనాలు మీడియాలో చర్చకు వచ్చాయి.  కానీ, అసలు ఫోన్ ట్యాపింగ్ ఏమిటో,  ఎంత తీవ్రమైన  నేరమో, ఒక ప్రజాస్వామ్య  దేశంలో  ఎంత అనైతికమైన అపరాధమో ప్రజలు గుర్తించడం అవసరం. 

నిజానికి ఫోన్ ట్యాపింగ్ చరిత్ర చాలా పాతది. 1972లోనే  ఫోన్ ట్యాపింగ్​కు సంబంధించి ఒక పెద్ద వివాదం అమెరికాలో చర్చకు వచ్చింది.  అది వాటర్ గేట్ స్కాండల్​గా  చరిత్రకెక్కింది.  ఆ తర్వాత నుంచి  ప్రతి అవినీతి కాండకు ‘గేట్’ అని నామకరణం చేయడం మనం చూస్తూ వచ్చాం.   వాటర్  గేట్  స్కాండల్ 1972 నుంచి 1974 వరకు కొనసాగింది. చివరకు  నిక్సన్  అమెరికా అధ్యక్ష  పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది.  

అమెరికా  అధ్యక్షుడు రాజీనామా చేయవలసి వచ్చిన స్థాయి తీవ్రమైన నేరం ఇది.  ఇందులో 69 మంది నిందితులు ఉంటే 48 మంది ఉన్నతాధికారులకు శిక్షలు పడ్డాయి.  రాజకీయ  ప్రత్యర్థుల ఫోన్లను బగ్గింగ్ చేయడం,  ట్యాపింగ్ చేయడం,  అనధికారిక విచారణలు చేయించడం,  ప్రభుత్వ సంస్థలను, ఏజెన్సీలను  రాజకీయ  ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడం వాటర్ గేట్ స్కాండల్​లో  స్పష్టంగా  కనిపించే  చట్టవిరుద్ధ కార్యకలాపాలు.  ఇరవయ్యో శతాబ్దంలో  అత్యంత  హీనమైన రాజకీయ  అపరాధంగా పేరుమోసింది.  ఇప్పుడు జరిగింది  అంతకంటే  ఘోరమైన నేరం.

రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన

రాజ్యాంగం మనందరికి  ప్రాథమిక హక్కులు ఇచ్చింది.  మాట్లాడే స్వేచ్ఛ,  భావప్రకటనాస్వేచ్ఛ 19(ఎ),   వ్యక్తిగత స్వేచ్ఛ,  జీవించే హక్కు వంటివి  ప్రజలందరికీ రాజ్యాంగం ద్వారా లభించిన హక్కులు. అయితే,  ఈ హక్కులను  దుర్వినియోగం  చేసిన  పరిస్థితుల్లో  చట్టంద్వారా  కొన్ని పరిమితులు విధించవచ్చు.  చట్టంప్రకారం కొన్ని  ప్రత్యేక  సందర్భాల్లో  ఈ హక్కులను నియంత్రించే అవకాశం ఉంది.  సాధారణ  పరిస్థితుల్లో అయితే  టెలిఫోనులో మాట్లాడడం వ్యక్తిగత స్వేచ్ఛ.  ఒక భర్త  కూడా తన భార్యకు ఉన్న ఈ స్వేచ్ఛను  అతిక్రమించే అధికారం లేదు.  

అలాగే భార్యకు కూడా భర్తకున్న ఈ స్వేచ్ఛను  కాదనే  అధికారం లేదు.  భార్య ఫోనులో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను  భర్త  రికార్డు చేసి ఉపయోగిస్తే  అది  ప్రాథమిక హక్కులను భంగపరచడమే అని కోర్టు తీర్పులున్నాయి.   ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు అందరూ పబ్లిక్ సర్వెంట్స్ అంటే  ప్రజాసేవకులు.   ముఖ్యమంత్రి,  మంత్రులు,  ఎమ్మెల్యేలు,  ప్రభుత్వ ఉద్యోగులు,  పోలీసులు కూడా  ప్రజాసేవకులే.   ప్రజాసేవకులైన వాళ్ళు  ఎవరి ఫోనునైనా ట్యాపింగ్ చేయడం, అది మొబైల్  సర్వీస్  ప్రొవైడర్ల ద్వారా చేయించినా  లేక  అవసరమైన పరికరాలను,  ఎక్విప్​మెంట్​ను  ఉపయోగించి  ట్యాపింగ్ చేయించినా,  సంబంధిత వ్యక్తికి తెలియకుండా అతని మాటలను రికార్డు చేయడం చట్టవిరుద్ధం.

ఫోన్​ ట్యాపింగ్​కు షరతులు

కొన్ని  ప్రత్యేక పరిస్థితుల్లో  ఎవరిదైనా  ఫోను ట్యాప్ చేయాలనుకుంటే దానికి కొన్ని షరతులున్నాయి . ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు  చట్టం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో  విచారణ సంస్థలకు ఈ అనుమతి ఇస్తుంది. ఇలా ఫోన్లు ట్యాప్ చేసే అనుమతి కేవలం పది ఏజెన్సీలకు మాత్రమే ఇస్తారు. ఆ ఏజెన్సీలు ఇంటెలిజెన్స్ బ్యూరో,  సీబీఐ, ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్,  నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో,  సెంట్రల్ బోర్డ్ ఆఫ్  డైరెక్ట్ టాక్సెస్ విభాగం,  డైరెక్టర్ ఆఫ్​ రెవెన్యూ ఇంటెలిజెన్స్,  నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజన్సీ,  రా,   డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్  ఇంటెలిజెన్స్,  ఢిల్లీ పోలీసు కమిషనర్ ఈ అనుమతి తీసుకుని పోన్లు ట్యాపింగ్ చేయవచ్చు.  

ప్రత్యేక పరిస్థితుల్లో తగిన అనుమతులతోనే ఈ విచారణ చేయవలసి ఉంటుంది.  ఆ పరిస్థితులు ఏమిటంటే,  ప్రజల భద్రత,  దేశసమగ్రత,  ఇతర దేశాలతో సంబంధాలు,  శాంతిభద్రతల సమస్య వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు  పబ్లిక్ సేఫ్టీకి భంగం కలుగుతున్నప్పుడు  లేదా ఒక  తీవ్రమైన నేరం  అంటే  తీవ్రవాద కార్యకలాపాలు వగైరా జరక్కుండా నిరోధించడానికి,  అవసరమైతే ఈ విధమైన విచారణ చేసే వీలు కల్పిస్తూ ఇండియన్ టెలిగ్రాఫిక్ ఎమెండ్​మెంట్​ రూల్స్ తీసుకువచ్చారు. 

సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే..

 రాజ్యాంగంలోని  అధికరణ 21 వ్యక్తి  స్వేచ్ఛకు హామీ ఇస్తోంది.  కాబట్టి,  ఈ ప్రొసీజరుకు విరుద్ధంగా,  చట్టబద్ధమైన  పద్ధతుల్లో  కాకుండా,  మరోవిధంగా ఫోన్లు ట్యాపింగ్ చేయడానికి వీల్లేదు.  సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా  ఏ సందర్భాల్లో  ఫోన్ ట్యాపింగ్ చట్టవిరుద్ధమో  ప్రకటించింది. ఒక కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సీబీఐ కూడా ఇష్టమొచ్చినట్లు ట్యాప్ చేయడానికి వీల్లేదు. ఈ తీర్పు ఎలాంటి ఏ కేసులో అయినా అవసరమైతే వర్తిస్తుంది. కాబట్టి ఏ కేసులో అవసరమో ఆ కేసులోనే,  ఎవరి ఫోను ట్యాప్ చేయాలో వారి ఫోను మాత్రమే తగిన అనుమతులతో ట్యాప్ చేయాలి.  ప్రైవసీకి  భంగం కలిగిస్తూ  ఇష్టమొచ్చినట్లు  వ్యక్తిగత  జీవితాల్లోకి  తొంగిచూసే అనుమతి ఎవరికీ లేదు.
 
 2023లో ఏం జరిగింది? 

అసెంబ్లీ  ఎన్నికల్లో  పాలకపక్షం ఎన్నికల కోడ్  రాక ముందే  డబ్బులు నియోజకవర్గాలకు సరఫరా చేసేసిందన్న వార్తలు గుప్పుమన్నాయి. ఆ  తర్వాత  ప్రతిపక్షాల ఫోన్లు ట్యాపింగ్ చేసి వారి డబ్బులు పట్టుకుని వారిని అణగదొక్కి గెలిచే  ప్రయత్నాలు చేశారు. కానీ,  ప్రజలు అన్నీ అర్థం చేసుకుంటారు.  అందరికీ  ఓటుహక్కు ఉంది.  దేశంలో  ముఖ్యమంత్రికైనా,  సాధారణ కూలీకి అయినా ఒకటే ఓటు ఉంటుంది.  

అందరి ఓటు విలువ సమానమే.  తెలంగాణలో  ప్రజలు అవినీతిని అర్థం చేసుకుని,  మనస్సాక్షి  ప్రకారం  ఓటు వేసి ప్రభు త్వాన్ని పడగొట్టారు.  గత పాలకులు చేసిన ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు వారి మెడకే  చుట్టుకుంది.  వాటర్ గేట్  గురించి  చెప్పుకున్నాం,  ఈ మధ్య  పెగాసస్ కూడా వచ్చింది. ఈ ఫోన్ ట్యాపింగ్లు  ఏదో  మావోయిస్టులవి,  తీవ్రవాదులవి కావు.  ఎమ్మెల్యేలు,  వ్యాపారస్తులు,  పారిశ్రామికవేత్తలు,  చివరకు  న్యాయమూర్తుల  ఫోన్లు ట్యాప్ అయ్యాయి. అధికారులు కూడా ఇష్టారాజ్యంగా చేశారు.  ఇందులో బ్లాక్ మెయిలింగ్, వసూళ్లు కూడా జరిగాయి.

చంద్రబాబు మీద కేసీఆర్ ఓటుకు నోటు కేసు

ఎమ్మెల్సీ  ఎన్నికల్లో  చంద్రబాబునాయుడు ఒక ఎమ్మెల్సీ స్థానం కోసం చట్ట వ్యతిరేక ప్రయత్నం చేశారు.  నోట్లు ఇచ్చి ఓట్లు కొనుక్కోవాలనుకున్నారు.  కానీ,  ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఈ విషయాన్ని కనిపెట్టి పట్టుకున్నారు. ఇదేదో దేశభద్రతకు సంబంధించిన నేరం  కాదు,  దేశసమగ్రతకు  సంబంధించిన నేరమూ కాదు.  ఇది అవినీతికి సంబంధించింది.  ఇలాంటి  కేసులో  అవినీతి నిరోధక చర్యలు చట్టబద్ధంగా తీసుకోవాలి. 

అంతేకానీ, అధికారాన్ని దుర్వినియోగపరచి,  అనధికారికంగా,  అనుమతులు లేకుండా  ఫోన్ ట్యాప్  చేసి  రెడ్ హ్యాండెడ్ గా  పట్టుకోవడమంటే అది నేరమే అవుతుంది.  ఆ కేసులో చంద్రబాబునాయుడు  కూడా  ఫోన్ ట్యాపింగ్  కేసు పెడతానన్నాడు.  కానీ పెట్టలేదు.  అయితే,  చంద్రబాబు మీద  కేసీఆర్  ఓటుకు నోటు కేసు పెట్టాడు. 

ఫిరాయింపులు అవినీతి కేసే అవుతుంది

 కేసీఆర్ 2015 ఎన్నికల్లో  గెలిచినప్పుడు  తలసాని యాదవ్  తెలుగుదేశం నుంచి, ఇంద్రకరణ్ రెడ్డి  బీఎస్పీ నుంచి  మరికొందరు  ఇతర పార్టీల నుంచి గెలిచారు.  కేసీఆర్​ వారిని ప్రలోభపెట్టి,  పార్టీలో చేర్చుకుని,  వాళ్లను  మంత్రులు చేశాడు.   వారిని ప్రలోభపెట్టడం,  పార్టీ మార్పిడి చేయించడం, మంత్రి పదవుల తాయిలాలు  ఇవ్వడం కూడా అవినీతి అవుతుంది.  ఇది స్పష్టంగా క్విడ్ ప్రో కో  వ్యవహారం.  అంటే  పరస్పర ప్రయోజనాల  కోసం పాకులాడిన వ్యవహారం.  కాబట్టి  అవినీతి కేసు  కిందికి వస్తుంది.
(మిగతా రేపు)

హోంశాఖ నుంచి అనుమతి తప్పనిసరి

అయితే ఈ విషయమై ముందస్తుగా జాతీయస్థాయిలో అయితే హోం విభాగం కార్యదర్శి నుంచి అనుమతి తీసుకోవాలి.  రాష్ట్ర ప్రభుత్వమైతే  హోం సెక్రటరీ పర్మిషన్ ఇవ్వాలి. ఈ పర్మిషన్ కోసం కారణాలు చూపి దరఖాస్తు చేయాలి.  ఆ పరిస్థితులు ఉన్నాయని, ఆ కారణాలు సరిగానే ఉన్నాయని జాతీయ స్థాయిలో హోం కార్యదర్శి, లేదా రాష్ట్రస్థాయిలో అయితే ఇక్కడి హోం కార్యదర్శి నమ్మితే ఈ పర్మిషన్ ఆర్డరు ఇస్తారు.  

ఆ తర్వాత  పర్మిషన్ ఆర్డరు ప్రతిని కూడా  ముగ్గురు సభ్యుల సమీక్ష  కమిటీకి పంపుతారు.  ఈ పర్మిషను ఆర్డరు చట్టప్రకారం ఉన్నదా లేదా అని కమిటీ సమీక్షిస్తుంది.  ఇది భారత టెలీగ్రాఫ్ చట్టం, 1885 లోని సెక్షన్ 5(2), భారత టెలీగ్రాఫ్ నిబంధనలు, 1951లోని నిబంధన 419 ఎ ప్రకారం నిర్దేశించినన ప్రొసీజరు.  ప్రజల భద్రత, శాంతిభద్రతలు, దేశసమగ్రత కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి,  ప్రాథమిక హక్కులు ఉన్నప్పటికీ ఎవరైనా చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తే ఈ అనుమతి తీసుకుని ట్యాపింగ్ చేసే అవకాశం ఉంది. 

బ్లాక్​మనీ అంతా ప్రతిపక్షాలదేనా?

ప్రజాస్వామ్యంలో  ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలి.  నిజానికి నేడు ఎన్నికల్లో  ధనబలం చాలా కీలకంగా మారింది.  ఎవరు ఎన్ని ఆద ర్శాలు వల్లించినా అందరూ డబ్బులు వెదజల్లుతున్నారు.  గమనించవలసిందేమిటంటే, డబ్బులు వెదజల్లడమనే అనైతిక ధోరణిలో  కూడా లెవెల్ ప్లేయింగ్  ఫీల్డు లేదు. పాలకపక్షం అధికారాన్ని దుర్వినియోగపరచి, అధికారులను వాడుకుని, రాజకీయ ప్రయో జనాల కోసం ఎన్నికల సమయంలో ఫోన్లు ట్యాపింగ్ చేయించి,  వలవేసి,  ప్రత్యర్థి పక్షాల డబ్బులు పట్టుకోవడం చేస్తే అది అనధికారికంగా ఫోన్లు ట్యాపింగ్ చేయడమే అవుతుంది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిందేమిటి?  ఎన్నికల్లో దొరికిన నల్లడబ్బు అంతా ప్రతిపక్షాలదే. ప్రతిపక్షాల  డబ్బు మాత్రమే పట్టుబడింది. పాలకపక్షం ఒక్క రూపాయి కూడా నల్లడబ్బు ఖర్చు చేయలేదంటే నమ్మగలమా? 

- జస్జిస్ ఈశ్వరయ్య,  
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 
హైకోర్టు పూర్వ  
తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి