ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి : సునీత కుంచాల

  • అవగాహన సదస్సులో జిల్లా జడ్జి, కలెక్టర్, సీ.పీ పిలుపు     

నిజామాబాద్ క్రైమ్ వెలుగు: నిజామాబాద్ ను ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్ధేందుకు ప్రతీ ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని జిల్లా జడ్జి సునీత కుంచాల, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగెనవార్ పిలుపునిచ్చారు. నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంగా వాహనాలను నడుపుతూ ఎంతో మంది రోడ్డు ప్రమాదాల్లో నిండు ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పోలీస్ శాఖ, న్యాయ సేవాధికార సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం 

పోలీస్ పరేడ్ మైదానంలో ట్రాఫిక్ నిబంధనలు, ప్రత్యేకించి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్​ ధరించాల్సిన ఆవశ్యకతపై హైస్కూల్, కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. పరేడ్ గ్రౌండ్ నుండి కోర్టు కాంప్లెక్ చౌరస్తా వరకు ప్లకార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీ జరిపారు. జిల్లా జడ్జి, కలెక్టర్, సీ.పీ సైతం హెల్మెట్లు ధరించి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల కలిగే నష్టాల గురించి పోలీస్ కళాజాత బృందం సభ్యులు పాటలు, ప్రదర్శనల ద్వారా అవగాహన కలిపించారు.

 ఈ సందర్భంగా జిల్లా జడ్జి సునీత కుంచాల మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా అతివేగంగా వాహనాలు నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటివి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతున్నాయని అన్నారు.  18 సంవత్సరాల లోపు వయస్సు వారు వాహనాలు నడుపుతూ ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులు కూడా నేరస్తులుగా పరిగణించబడతారని హెచ్చరించారు.   కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతూ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా ద్విచక్రవాహనదారులు  ప్రాణాలు కోల్పోతున్నారని, మరికొంత క్షతగాత్రులుగా మారుతున్నారన్నారు. 

ALSO READ : ఓరుగల్లు ఆలయాలు అద్భుతం : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

 పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ దేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతీ గంటకు 19 మంది మృత్యువాత పడుతున్నారన్నారు. నిజామాబాద్ జిల్లాలో గతేడాది 337 మంది, ఈ ఏడాది ఇప్పటికే 218 మంది ప్రాణాలు కోల్పోయారని, వీరిలో ద్విచక్రవాహనదారులే అధికంగా ఉన్నారని గణాంకాలతో సహా వెల్లడించారు.  కార్యక్రమంలో అదనపు జిల్లా సెషన్స్ జడ్జీలు కనకదుర్గ, టి.శ్రీనివాస్, ఆశాలత, సీనియర్ సివిల్ జడ్జీలు ఎం.శ్రీకాంత్ బాబు, పి.పద్మావతి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె.గోపికృష్ణ, అదనపు జూనియర్ సివిల్ జడ్జీలు కుష్బూ ఉపాధ్యాయ్, పి.శ్రీనివాస్ రావు, మేజిస్ట్రేట్లు వి.హరికుమార్, చైతన్య, అదనపు డీసీపీ కోటేశ్వర్ రావు, ట్రాఫిక్ ఏ.సీ.పీ నారాయణ, ఎంవీఐ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.