- పెద్దాపూర్ గురుకులంలో పర్యటించిన సీనియర్ సివిల్ కోర్టు జడ్జి
మెట్‌పల్లి/కోరుట్ల, వెలుగు: పెద్దపూర్ గురుకులంలో అనుకోని సంఘటనలు ఇటీవల జరిగాయని, వాటిని చూసి విద్యార్థులు భయపడవద్దని, పరీక్షలు వస్తున్నాయని చదువుపై శ్రద్ధ పెట్టాలని లీగల్ సర్వీసెస్ మండల కమిటీ చైర్మన్, సీనియర్ సివిల్ కోర్టు జడ్జి డి. నాగేశ్వరరావు సూచించారు. పెద్దపూర్ గురుకులాన్ని జడ్జి శనివారం సందర్శించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకులంలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
అస్వస్థతకు గురైన 8వ తరగతి విద్యార్థుల రూమును పరిశీలించారు. స్కూల్ పరిసరాలు, కిచెన్, రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ గురుకులంలో ఇటీవల జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. మూడు నెలల్లో టెన్త్, ఇంటర్ పరీక్షలు సమీపిస్తున్నాయని, ఇలాంటి టైంలో స్కూల్‌లో ఇలాంటి ఘటనలతో విద్యార్థుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందన్నారు.
తల్లిదండ్రులు భయాందోళనలకు గురికాకుండా పిల్లలను వెంటనే గురుకులంలో చేర్పించాలని కోరారు. అనంతరం ఇటీవల గురుకులంలో అస్వస్థతకు గురై కోరుట్ల హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న స్టూడెంట్ అఖిల్‌ను పరామర్శించారు. కార్యక్రమంలో మెట్‌పల్లి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పుప్పాల లింబాద్రి, ఉపాధ్యక్షుడు రాంబాబు, సెక్రటరీ వేణు, ఏజీపీ అబ్దుల్ హఫీజ్, అడ్వకేట్లు పాల్గొన్నారు.