ఈ వర్సిటీలో సీటు వస్తే జాబు గ్యారంటీ

  • స్కిల్స్  యూనివర్సిటీని అలా తీర్చిదిద్దుతం: సీఎం రేవంత్
  • వర్సిటీ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన

రంగారెడ్డి, వెలుగు : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మరో అద్భుత నగరంగా మారుతుందని సీఎం రేవంత్  రెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు యువతకు ఉపాధి కల్పించాలన్న ఆశయంతో యంగ్  ఇండియా స్కిల్స్  యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నామని ఆయన తెలిపారు. అభివృద్ధిలో భాగంగా ఇక్కడ మరో నగరాన్ని నిర్మించాలని నిర్ణయించామని చెప్పారు.

 గురువారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేట్ లో యంగ్ ఇండియా స్కిల్స్  యూనివర్సిటీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, ప్రైమరీ హెల్త్  సెంటర్, మోడర్న్  స్కూల్, కమ్యూనిటీ సెంటర్  నిర్మాణం కోసం సీఎం భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ యంగ్  ఇండియా స్కిల్స్  యూనివర్సిటీని 57 ఎకరాల్లో నిర్మించడానికి  రూ.156 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. 

ఈ యూనివర్సిటీ ద్వారా లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పిస్తామన్నారు. స్కిల్స్  వర్సిటీలో అడ్మిషన్  వచ్చిందంటే ఉద్యోగం గ్యారంటీ అనేలా చేస్తామన్నారు. మహేశ్వరం ప్రాంతంలో హెల్త్  టూరిజం హబ్, స్పోర్ట్స్ హబ్ ను అభివృద్ధి చేస్తామన్నారు. ఇక్కడి నుంచి ఎయిర్ పోర్టు వరకు 200 ఫీట్ల వెడల్పుగల రోడ్డు నిర్మాణం చేస్తామని, మెట్రోను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. 

ఆనాడు ఔటర్  రింగ్  రోడ్డును దివంగత సీఎం  రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చారని, ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో రీజనల్ రింగ్  రోడ్డు ఏర్పాటు చేయబోతున్నామని, రోడ్డును మూడు నెలల్లో ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల  శ్రీధర్ బాబు, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్  గడ్డం ప్రసాద్  కుమార్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, శాసనసభ్యుడు మల్ రెడ్డి రంగారెడ్డి, ప్రకాశ్ గౌడ్, కె.లక్ష్మారెడ్డి, వీర్లపల్లి శంకర్, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.