జాబ్‌‌‌‌‌‌‌‌ క్యాలెండర్ ఓ బోగస్

  •     నాలుగు కాగితాల మీద ఏదిపడితే అది రాసుకొచ్చిన్రు: కేటీఆర్​
  •     2 లక్షల ఉద్యోగాలని చెప్పి ఒక్కటీ ఇయ్యలే
  •     కాంగ్రెస్​వాళ్లను ఎక్కడికక్కడ కొట్టాలి అంటూ వ్యాఖ్య
  •     గన్‌‌‌‌‌‌‌‌పార్కు వద్ద బీఆర్​ఎస్​ఎమ్మెల్యేల నిరసన

హైదరాబాద్, వెలుగు :  ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఓ బోగస్ అని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిందని, 8 నెలలు అవుతున్నా ఒక్క పోస్టును కూడా భర్తీ చేయలేదని ఆయన దుయ్యబట్టారు. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై డిస్కషన్ చేయాలని తాము కోరినా ప్రభుత్వం ఒప్పుకోవడం లేదని, తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ కేటీఆర్ సహా బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ఎమ్మెల్యేలు శుక్రవారం సాయంత్ర అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారు. 

గన్‌‌‌‌‌‌‌‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద  నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చి 8 నెలలవుతున్నా ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదని, ఈ అంశంపై రాహుల్ గాంధీ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. క్యాలెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తేదీలు మారుతున్నాయి తప్పితే, జాబ్ నోటిఫికేషన్లు రావడం లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ వాళ్లు బయట కనబడితే వాళ్లను నిరుద్యోగులు తన్ని తరిమే పరిస్థితి ఉందని, అందుకే నాలుగు కాగితాల మీద ఏది పడితే అది రాసుకొచ్చి, దాన్ని జాబ్ క్యాలెండర్ అని ప్రకటించారని ఆయన విమర్శించారు. 

దానం సభ్యత్వాన్ని రద్దు చేయాలి: హరీశ్‌‌‌‌‌‌‌‌ 

శాసనసభ దుశ్శాసన సభగా మారిందని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌‌‌‌‌రావు విమర్శించారు. ‘‘సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి దగ్గరుండి మొన్న మహిళా ఎమ్మెల్యేలను తిట్టించాడు. ఇప్పుడు మహిళా తల్లులను తిట్టించాడు.  దానం నాగేందర్ మాట్లాడే భాష రౌడీ షీటర్ మాట్లాడే భాషలా ఉంది. దానం నాగేందర్ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలి” అని ఆయన డిమాండ్ చేశారు.  

శాడిస్ట్​ పనులు ఎక్కువ కాలం నడువవు : కేటీఆర్

‘‘దమ్ముంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కలిసి సెక్యూరిటీ లేకుండా అశోక్ నగర్ కు రావాలి. మేం కూడా వస్తాం. కాంగ్రెస్ వచ్చాక ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టు నిరూపించినా, నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా” అని కేటీఆర్​ సవాల్​ చేశారు.  ‘‘జాబ్ క్యాలెండర్ పై చర్చిద్దామంటే దానం నాగేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇష్టమొచ్చినట్లు తిట్టించారు. ఆ ఎమ్మెల్యే బజారు భాషలో మాట్లాడిండు.

 తెలంగాణ యువత తరఫున మేం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ఇంత బజారు భాషలో మమ్మల్ని తిట్టిస్తారా? ఇంత దిగజారుడు, దివాలా కోరు ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేదు. కాంగ్రెస్ వాళ్లను ఎక్కడికక్కడ కొట్టాలి. ఈ శాడిస్ట్ ముఖ్యమంత్రి అందరినీ ఉసిగొల్పుతూ బజారు భాష మాట్లాడిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఇలాంటి శాడిస్ట్ పనులు ఎక్కువ కాలం నడవవు. ఇది శాసనసభకు చీకటి రోజు” అని ఆయన వ్యాఖ్యానించారు.