కోదాడ, వెలుగు : ఇంజినీరింగ్ విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకుని ఉన్నత స్థానాలను అధిరోహించాలని జేఎన్టీయూ ప్రొఫెసర్ డాక్టర్ కేపీ సుప్రీతి ఆకాంక్షించారు. శనివారం కోదాడ కిట్స్ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన 2024 స్నాతకోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సాంకేతిక విద్యలో నూతన ఆవిష్కరణలకు విద్యార్థులు నాంది పలకాలని సూచించారు.
కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుంచి ఇంజినీరింగ్ లో గ్రాడ్యుయేట్లుగా పట్టాలు పొందడం గర్వకారణమన్నారు. ఇదే స్ఫూర్తితో ఉన్నత ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రుల కలలు సాకారం చేయాలని సూచించారు. అనంతరం సాంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ సీహెచ్ నాగార్జున్ రావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.గాంధీ, రామారాజు, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.