మూవీ ఇండస్ట్రీకి రావాలని చాలామందికి ఆశ ఉంటుంది. కానీ, కొందరికే ఆ అదృష్టం లభిస్తుంది. అయితే మరికొందరి విషయంలో విధి వెరైటీగా పనిచేస్తుంది. ఒకటి కావాలని వస్తే మరొకటి ఇస్తుంది. అదే లైఫ్‌గా మారుస్తుంది. దాన్నే డెస్టినీ అంటారు. ఈ నటుడి విషయంలో కూడా డెస్టినీ అలానే పనిచేసింది.
అసిస్టెంట్ డైరెక్టర్ కావాలని ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు జిమ్మి షెర్గిల్. అనుకున్నది కాలేదు కానీ... యాక్టర్ అయ్యాడు. అంతేనా తన పెండ్లికే గెస్ట్‌లా వెళ్లేంత బిజీ అయిపోయాడు. వచ్చిన అవకాశాన్ని యాక్సెప్ట్ చేసి మరో మెట్టు ఎదగాలనుకున్నాడు. అందుకే సినిమాల్లో చేసేందుకు తీసుకున్న అడ్వాన్స్‌లు తిరిగిచ్చేసి మరో రూట్లో కెరీర్ స్టార్ట్ చేశాడు. అయితేనేం తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. 30 ఏండ్లు ఇండస్ట్రీలో ఉన్న ఆయన ఈ మధ్యనే ‘రణ్ నీతి : బాలాకోట్ అండ్ బియాండ్’ సిరీస్‌లో మెయిన్ లీడ్‌గా చేశాడు. తన ముప్ఫై ఏండ్ల సినీ జర్నీ, పర్సనల్ లైఫ్ గురించి ఆయన మాటల్లోనే...
‘‘ఆ లోచించడం మంచిదే. అయితే అందులో ఏం జరగబోతుందని ఆలోచించడం వేరు. ఎందుకంటే ఏం జరగబోతుంది అనేది మన చేతుల్లో ఉండదు. ఏం జరిగినా నీ వరకు ఏది వస్తుందో అందులో బెస్ట్ తీసుకోవాలి. నిజాయితీ, నిబద్ధతతో పనిచేస్తూ ముందుకుపోవాలి. నా విషయంలో అదే జరిగింది. ఆ విషయం చెప్పుకునేకంటే ముందు మా ఫ్యామిలీ గురించి చెప్పాలి. మాది పంజాబీ సిక్ ఫ్యామిలీ. మా మేనత్త అమృత ఇండియాలో ఫేమస్ పెయింటర్. అంతేతప్ప ఆర్ట్స్ వైపు మా ఇంట్లో ఎవరూ లేరు. సినిమాల గురించి అయితే ఎవరికీ అవగాహన లేదు.
అందరిలానే నాక్కూడా చదువు మీదే ధ్యాస ఉండేది. లక్నోలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో చదివా. కొన్నేండ్ల తర్వాత1985లో పంజాబ్‌లో మా పూర్వీకుల ఇంటికి వెళ్లా. అక్కడే గ్రాడ్యుయేషన్ చేశా. అప్పుడే సినిమా ఇండస్ట్రీకి వెళ్లాలనే కోరిక నాలో మొదలైంది. డైరెక్టర్ కావాలని ఉండేదే తప్ప నటించాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇండస్ట్రీకి వెళ్తానంటే ఇంట్లో ఒప్పుకోరని తెలిసినా ధైర్యం చేసి అడిగా. ముందునుంచీ అనుకున్నదే ‘నో’ అన్నారు.
దాంతో నా బుర్రలోంచి ఇండస్ట్రీకి వెళ్లాలనే ఆలోచన తీసేశా. కానీ మా కజిన్ నన్ను ఒప్పించి ‘లక్ పరీక్షించుకో’ అని ముంబయి పంపాడు. అలా ముంబయిలో అడుగుపెట్టా. రోషన్ తనేజా యాక్టింగ్ క్లాస్‌లకు వెళ్లేవాడిని. ఫిల్మ్ స్టడీస్ అయిపోగానే ఇంటికి వెళ్లకుండా ఛాన్స్‌ల కోసం వెతకడం మొదలుపెట్టా.
డెస్టినీ చేసిన నటుడ్ని
‘మాచిస్’ అనే సినిమాలో డైరెక్టర్ గుల్జార్‌ని కలిశా. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయడం కోసం అడిగా. ‘నువ్వు యాక్టర్‌గా పనికొస్తావు. డైరెక్షన్లోకి ఎందుకు రావాలనుకుంటున్నావ్?’ అని అడిగారాయన. ఇక్కడ ఐదారేండ్లు పనిచేసినా బ్రేక్ రాదు. కానీ నాకు ఇంటికి వెళ్లాలని లేదని చెప్పా. అందుకు ఆయన నాకు స్రిప్ట్ ఇచ్చి ‘ఇది చదివి ఇందులో నీకు నచ్చిన పాత్ర ఏంటి? నువ్వు చేస్తే ఇందులో ఏ పాత్ర చేయాలనుకుంటావో చెప్పు’ అన్నారు. అది చదివి నేను జిమ్మీ క్యారెక్టర్ చేయగలను. అది నా ముద్దు పేరు కూడా అని చెప్పా. గుల్జార్‌కి నా ఒరిజినల్ పేరు మాత్రమే తెలుసు. అలా ‘మాచిస్’ సినిమా నన్ను నటుడిగా మార్చింది. అదే డెస్టినీ!
రెస్ట్ ఉండేది కాదు
ఒకప్పుడు పగలు ఒక షూటింగ్ చేస్తే రాత్రి మరో షూటింగ్‌కి వెళ్లేవాడిని. కారులోనే నిద్రపోయేవాడిని. ట్రావెలింగ్ చాలా ఎక్కువ చేసేవాడిని. ఇప్పుడు మాత్రం ఒక క్యారెక్టర్ మాత్రమే చేస్తున్నా. ఎందుకంటే ఒక్కో ప్రాజెక్ట్‌కి ఒక్కో లుక్ ఉంటుంది కదా. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా నా షూటింగ్ డేట్స్ ఎప్పుడూ మార్చుకోలేదు. అలాగే సంపాదన గురించి ఆలోచించలేదు. వర్క్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దానిమీదే ధ్యాస ఉండేది. అప్పట్లో కొత్తగా ఏమైనా చేయాలంటే టెన్షన్ ఉండేది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా రిలాక్స్‌గా ఉన్నా.
నా పెండ్లికి నేను గెస్ట్‌లా..
అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ నటించిన ‘మొహబ్బతే’ సినిమాలో నేను కరణ్ చౌధురి అనే పాత్ర చేశా. ఆ సినిమా సక్సెస్ తర్వాత అన్నీ అలాంటి క్యారెక్టర్లే వచ్చాయి. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రోజుల్లో నా పెండ్లి ఫిక్స్ అయింది. నార్త్ ఇండియన్స్ పెండ్లి అంటే పది నుంచి పదిహేను రోజులు పడుతుంది. కానీ, నాకు అన్ని రోజులు సెలవులు దొరకవు. అందుకని ముఖ్యమైన వేడుకలకి మాత్రమే మూడు రోజులు సెలవుపెట్టా. ఆ తర్వాత అన్నింటికీ నేను గెస్ట్‌లా వెళ్లా. ఆ టైంలో ‘ఏ జిందగీ కా సఫర్’ అనే సినిమా చేస్తున్నా.
పంజాబీ సినిమాల్లో కూడా
2005లో పంజాబీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టా. ‘మన్మోహన్ యారాన్ నాల్ బహరన్’ నా మొదటి సినిమా. అది సక్సెస్ కావడంతో చాలా పంజాబీ సినిమాల్లో నటించా. ఆ తరువాత ప్రతి ఏటా ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలి. యాక్టింగ్ చేయాలి అనుకున్నా. అలాగే 2011లో ‘ధర్తీ’ అనే సినిమా ప్రొడ్యూస్ చేశా. అది హిట్ అయింది. దాంతో మరో రెండు సినిమాలు తీశా. పంజాబీ సినిమాల్లో నటిస్తున్నా. కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నా.
మార్పు కోరుకుని...
సోలో హీరోగా, ఇద్దరు హీరోలు ఉండే సినిమాల్లో చేసేటప్పుడు కమర్షియల్‌గా బాగా సక్సెస్ అయ్యాయి. దాదాపు మూడేండ్లు కెరీర్ చాలా బిజీగా ఉంది. అవే క్యారెక్టర్లు చేస్తూ పోతే నా కెరీర్ వెనకపడేది కాదు. కానీ ‘చాకొలెట్ బాయ్ ఇమేజ్ ఇక చాలు’ అనిపించింది. అందుకే ఆలోచించి కొత్తగా, వెరైటీగా చేయాలనుకున్నా. ప్రతి కథకు నా ప్రొఫైల్ వర్సటైల్గా ఉండాలని కోరుకుంటా. అందుకని మొదటి రెండేండ్ల నా సినిమా కెరీర్ తర్వాత తీసుకున్న అమౌంట్ కూడా తిరిగి ఇచ్చేశా. అలా 2003లో ‘హాసిల్’ అనే సినిమాతో కెరీర్లో మార్పు మొదలైంది. ‘యహా’, ‘తను వెడ్స్ మను’, ‘మున్నాభాయి ఎంబీబీఎస్’ వంటి సినిమాల్లో ఛాన్స్ రాగానే అందిపుచ్చుకున్నా.
ఓ ఏడాది ఫ్యామిలీతో మాటల్లేవు
సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసినందుకు విమర్శలు కూడా వచ్చాయి. చాలామంది నాతో ‘చిన్న క్యారెక్టర్స్ చేయకు. టైం తీసుకో. లెంగ్త్ ఉన్న క్యారెక్టర్ వచ్చేవరకు వెయిట్ చెయ్యి’ అని చెప్పారు. ‘మాచిస్’ సినిమాకి నా రెమ్యునరేషన్ ఇరవై వేలు. ఆ తర్వాత ‘మొహబ్బతే’ సినిమా చేసే వరకు ఫైనాన్షియల్‌గా మా ఫ్యామిలీ నాకు చాలా సపోర్ట్ ఇచ్చింది. మొహబ్బతే తర్వాత నుంచి ఇంట్లో డబ్బులు తీసుకోవడం నెమ్మదిగా తగ్గించేశా. అయితే దానికంటే ముందు పర్సనల్ లైఫ్‌లో కూడా ఒక హార్డ్ ఫేజ్ చూశా. నా అసలు పేరు జస్జిత్ సింగ్ గిల్. పేరు చదవగానే అర్ధమై ఉంటుంది కదా మాది సిక్ కుటుంబం.
పద్దెనిమిదేండ్ల వయసులో జుట్టు కత్తిరించుకున్నా. మా నాన్న బాగా కోప్పడ్డాడు. ఇంట్లో వాళ్లంతా చాలా డిజప్పాయింట్ అయ్యారు. ఒకటిన్నర ఏడాదిపాటు మా ఇంట్లో వాళ్లెవరూ నాతో మాట్లాడలేదు. అయినా ఆ బాధను బయట ఎవరికీ చెప్పుకోలేదు. నిజానికి ఆ వయసులో తుంటరితనం వల్ల చేసిన తప్పు అది కావచ్చు. కానీ డెస్టినీ ఏంటనేది ఎవరికి తెలుసు? ఆ రోజు జుట్టు కత్తిరించుకోకపోతే ఈ రోజు ఇలా ఉండేవాడ్ని కాదేమో!
ఇలాంటివెన్నో చూశా
నేను చేసే పనిని ఎంజాయ్ చేస్తా. ఇప్పుడు చేస్తున్నవి ఎక్కువ నిడివి లేని పాత్రలైనా అవి ఉన్నంత సేపు ప్రేక్షకుల మీద ఇంపాక్ట్ చూపుతాయి. నా రోల్ పవర్‌ఫుల్‌గానే ఉంటుంది. కానీ, రెమ్యూనరేషన్ విషయానికొచ్చేసరికి నాకు తక్కువ ఇస్తున్నారు. నిజానికి వాళ్లు ఇచ్చేదానికంటే ఎక్కువే చేస్తున్నా. అయినా ఎందుకు తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారంటే? అది వాళ్ల లెక్క.
ఎవరికైనా నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే ఉంటుంది కదా. ముప్పై ఏండ్ల కెరీర్లో ఇలాంటివి ఎన్నో చూశా. నేను ఎక్కడి నుంచి వచ్చా? ఈ రోజు ఎక్కడున్నా? ఏం సాధించా? అని ఆలోచిస్తే.. నేనిప్పుడు హ్యాపీగా ఉన్నా. అన్నీ బాగానే జరుగుతున్నాయి. నాకు ఏ లోటు లేదు అనిపిస్తుంది.
రణ్ నీతి గురించి..
ఈ సిరీస్ షూటింగ్ జరిగేటప్పుడు ఒక్కో పాత్ర గురించి తెలుస్తుంటే చాలా సర్ప్రైజ్ అయ్యా. పుల్వామా దాడి ఆధారంగా ఇది తీశారు. ఇందులో కనిపించే పాత్రలు కొన్ని రియల్ లైఫ్‌లో కనిపించవు. వాళ్లు ఎంత పోరాడుతున్నారనేది చాలామందికి తెలియదు. ఆ క్యారెక్టర్లను అద్భుతంగా చూపించిన డైరెక్టర్ సంతోష్‌కి ‘థ్యాంక్స్’ చెప్పాలి. ఇలాంటి యంగ్ డైరెక్టర్స్‌తో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది.
అతని ఆలోచనలు, సామర్థ్యం, క్రియేటివిటీ నాకెంతో నచ్చాయి. నాకు వచ్చిన క్యారెక్టర్ స్క్రిప్ట్ చదువుతా. డైరెక్టర్లతో కూర్చుని డిస్కస్ చేస్తా. ఒక క్యారెక్టర్ చేస్తున్నానంటే... తెర మీద ఆ క్యారెక్టర్ మాత్రమే కనిపించేలా నటించాలనేది నా ఆలోచన.
- ఓటీటీ వల్ల బాక్సాఫీస్ నెంబర్స్ అనే ఒత్తిడి ఉండదు. ఎక్కువమంది ఆడియెన్స్‌కి రీచ్ అవుతుంది. కాన్సెప్ట్ పరంగా కొత్త కథలు చేయొచ్చు.
- ఒక సినిమా లేదా వెబ్‌సిరీస్ చూసేటప్పుడు అందులోని క్యారెక్టర్స్‌కి ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వాలంటే అలా కనెక్ట్ చేసేలా క్యారెక్టర్స్ ఉండాలి. అలా కనెక్ట్ అయినప్పుడు కథకు ఆటోమెటిక్‌గా కనెక్ట్ అవుతారు.
- నటించడం ఒక్కటే నా పని కాదు. నేను చేసిన సినిమాను ప్రమోట్ చేయడం కూడా నా రెస్పాన్సిబిలిటీనే.