నెలకు సరిపడా ఫుడ్​ రెడీ

జపాన్​కు చెందిన ఒక భార్య తన భర్త కోసం నెల రోజులకు కావాల్సిన ఫుడ్​ వండి ఫ్రిజ్​లో పెట్టిందట! అదేంటి... నెల రోజులకు అవసరమైన ఫుడ్ ఒకేసారి ఎందుకు తయారుచేసింది? అంటే.. ఆ విషయంలోకి వెళ్లాలి. ప్రెగ్నెంట్​ అయిన ఆ భార్య తొమ్మిదో నెల వచ్చేవరకు ఎలాగోలా భర్తకు కావాల్సిన పనులన్నీ చేసిపెట్టింది. అయితే డెలివరీకి వెళ్లాల్సిన టైం రావడంతో తను డెలివరీకి వెళ్తే వండుకు తినడానికి భర్త కష్టపడతాడు. ఆయనకు కష్టం కలగకుండా తనేం చేయొచ్చు అని ఆలోచించిందట. తను డెలివరీకి వెళ్తే వండి పెట్టడం కుదరదు కాబట్టి నెలరోజులకి సరిపడా ఫుడ్​ ఒకేసారి వండి భద్రంగా ఫ్రిజ్​లో దాచింది.

ఇంతలా చేయాల్సిన అవసరం ఉందా అంటున్నారా? అయితే ఒక్క క్షణం ఆగి ఇది​ చదవండి... ‘‘నేను వండకపోతే మా ఆయన సరిగా తినడు. అందుకే నెలకు సరిపడా వండి పెట్టా”  అని తన ఎక్స్​ (ట్విట్టర్​) అకౌంట్​లో  ట్వీట్​ చేసింది. ఆ ట్వీట్​ చదివిన వాళ్లు  సోషల్ మీడియాలో రకరకాలుగా స్పందిస్తున్నారు. అందులో ఎక్కువమంది ‘కనీసం వంట కూడా చేసుకోలేడా? తనకోసం’ అన్నారు. మరికొందరేమో ‘చిన్నపిల్లాడిలా చూసుకుంటోంది’ అన్నారు.

‘అతను ఏ పనీ చేయడా? అతన్ని చెడగొడుతున్నావ్​’ అని కొందరంటే, ‘ఏదేమైనా భార్యకు భర్త మీద ఉన్న ప్రేమ, కేరింగ్ చూస్తుంటే ప్రశంసించాల్సిందే’ అన్నారు మరికొందరు. ఇంకొందరైతే ‘భార్యాభర్తలిద్దరూ సమానంగా పనులు పంచుకోవాలి. ముఖ్యంగా ఆసియా దేశాల్లో ఈ కల్చర్​ తక్కువ’ అని అభిప్రాయపడ్డారు.