జాబ్ పోయింది..లీఫ్​తో లైఫ్​ టర్న్​ అయింది!

జపాన్​లోని కనగవకు చెందిన ఆర్టిస్ట్​ లిటో.. ఆకు మీద చెక్కిన చిత్రాలు అబ్బురపరుస్తాయి. ఒకప్పుడు కార్పొరేట్​ జాబ్​ చేశాడు. కానీ, ఏ పని చేసినా అందులో తప్పులు ఉండేవి. దాంతో ఎప్పుడూ తిట్టించుకునేవాడు. తను పనిని ఎందుకు సరిగా చేయలేకపోతున్నాడో తనకే అర్థమయ్యేది కాదట. ఆ విషయం గురించి బాగా ఆలోచించాక ఒకసారి డాక్టర్​ దగ్గరకి వెళ్లాడు. అక్కడ తనకు ఏడీహెడీ  (అటెన్షన్ డెఫిసిట్​ హైపరాక్టివిటీ డిజార్డర్) సమస్య ఉందని తెలిసింది. దీంతో కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం మానేశాడు. అప్పటికి తన వయసు 30 ఏండ్లే. ఆ తర్వాత తన బలహీనతను బలంగా మార్చుకునే ఉద్యోగం కోసం చాలా వెతికాడు. అప్పుడే ఈ లీఫ్ ఆర్ట్​ తన లైఫ్​లోకి వచ్చింది. 

 “లీఫ్​ ఆర్ట్​ గురించి నాకు పెద్దగా ఏమీ తెలియదు. నా ఆలోచనలు, ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్లడం, చిన్నప్పుడు ఫ్రెండ్స్​తో కలిసి ఆడుకోవడం, విన్న వాటి నుంచి ఇన్​స్పైర్​ అవుతాను. కొన్నిసార్లు నేను ఫ్యామిలీతో కలిసి భోజనం చేసేటప్పుడు, టీవీ చూసేటప్పుడు కూడా కొత్త ఆలోచనలు వస్తుంటాయి. నాకు చిన్నప్పటి నుంచి హయావో మియాజాకి యానిమేషన్​లు ఇష్టం. మొదట్లో నా ఆర్ట్స్​ అన్నీ వీడియోగేమ్, యానిమే క్యారెక్టర్స్​తోపాటు అంతరించిపోతున్న జాతుల వంటి జీవులపై ఆధారపడి ఉండేవి. అయితే వాటికి సోషల్ మీడియా నుంచి అనుకున్నంతగా రెస్పాన్స్ రాలేదు. 

అప్పుడు నేను థీమ్​ కోసం వెతకడం మొదలుపెట్టా. దీంతో రకరకాల థీమ్​లను బేస్ చేసుకుని కళాకృతులను తయారుచేయడం స్టార్ట్ చేశా. అప్పటి నుంచి సోషల్ మీడియా ద్వారా చాలా కంపెనీల నుంచి వర్క్ ఆపర్చునిటీలు వచ్చాయి. ఆ తర్వాత నా కలెక్షన్స్ అన్నింటినీ ప్రచురిస్తామని పబ్లిషర్ నుంచి ఆఫర్ వచ్చింది. సోషల్​ మీడియా లేకపోతే నాకు ఈ పనిని సంపాదనగా మార్చుకోవడం సాధ్యమయ్యేది కాదు. నేను పడుకునే ముందు నా పనిని చూసుకుంటే రిలాక్స్​గా అనిపిస్తుంది. పొద్దున్నే చూస్తే మళ్లీ వర్క్ స్టార్ట్ చేయాలని ప్రేరణ కలుగుతుంది. 

నా పని చాలామంది జీవితాల్లో భాగమైనందుకు సంతోషంగా ఉన్నాను. ఇది ఇలాగే కొనసా గాలని ఆశిస్తున్నా. ప్రస్తుతం జపాన్​ అంతటా ప్రదర్శనలిస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్లినా అక్కడ నా పని గురించి తెలిసి నా కోసం వెయిట్ చేస్తున్నవాళ్లని చూసి ఆశ్చర్యమేస్తోంది. నేను నా మొదటి పిక్చర్ బుక్ ‘ఎ గ్రేట్​ ఇమిటేటర్ కామెలియాన్’ అనే పేరుతో పబ్లిష్​ చేశా.  అది లక్షల కాపీలు అమ్ముడయింది. మనసుల్ని సంతోషంగా లేదా మానసికంగా కదిలించే పని క్రియేట్ చేయడం ఇంపార్టెంట్​ అని నేను భావిస్తా. ప్రపంచవ్యాప్తంగా నా ఆర్ట్​ని ప్రదర్శించాలనుకుంటున్నా”అంటున్నాడు లిటో.