జపాన్ లో భూత్ బంగ్లాలు.. టెక్నాలజీ ఎంత ఉంటే ఏంటీ.. లక్షల ఇళ్లు ఖాళీ

టెక్నాలజీలో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన జపాన్ను ఓ సమస్య వేధిస్తోంది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనేకాదు... పెద్ద పెద్ద పట్టణాల్లో కూడా భూత్ బంగ్లాల సంఖ్య పెరిగిపోతోంది. ఈ సమస్యను పరిష్కరించడం కోసం ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

జనాభా పెరుగుదల ... ప్రపంచంలోని చాలాదేశాలను ఒకప్పుడు పట్టిపీడించిన సమస్య. దీంతో జనాభాను తగ్గించేందుకు ఎన్నోరకాల ఆంక్షలను అమలు చేశాయి  కూడా. ఇప్పటికీ ఇండియా, చైనా జనాభాను నియంత్రించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.  జనాభా కొరత ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. జపాన్ వంటి దేశాలకు ఈ సమస్య ఓ శాపంలా మారింది. మనుషులు చేసే పనులను రోబోలతో చేయిస్తున్నా.. మానవ వనరుల కొరత ఆ దేశంలోని అన్నిరంగాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. జననాల నమోదును ప్రారంభించిన తర్వాత 2018లో చాలా తక్కువ మంది పుట్టినట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి. అదే సమయంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో మరణాల సంఖ్య కూడా పెరిగిపోవడంతో ఓ విచిత్ర సమస్య జపాన్ ను వేధిస్తోంది. 

జనాభా తగ్గిపోతున్న జపాన్లో ఉన్న ఆ కొద్దిపాటి జనం కూడా ఆఫీసుల్లోనే గడిపేస్తున్నారు. మిగతావారు సొంతంగా, ఇండిపెండెంట్గా ఇల్లు కట్టుకొని ఉండడానికి ఇష్టపడడంలేదు. సెక్యూరిటీని సాకుగా చూపుతూ అపార్ట్ మెంట్లలో ఉండడానికి మొగ్గు చూపుతున్నారు. పైగా వందలాది పాట్లతో నిర్మిస్తున్న అపార్ట్ మెంట్లన్నీ ఆఫీసులకు దగ్గరగానే ఉండడంతో అందులో ఉండడానికి ఇష్టపడుతున్నారు. జనాభా లేకపోవడం ఉన్న జనాభా ఒకేచోట గుమిగూడినట్లు ఉండడంతో ఇన్నిరోజులపాటు ఉన్న ఇళ్లపై ఖాళీగా బోసిపోతున్నాయి. రోజుల తరబడి ఖాళీగా ఉండడంతో అవి 
భూత్బంగ్లాలను తలపిస్తున్నాయి. 

వారసులెవరూ లేక.. ఉన్నవారు చనిపోవడంతో ఖాళీగా మిగిలిపోయే ఇళ్లను జపాన్ 'అకియా' పేరుతో పిలుస్తారు.  అపార్ట్ మెంట్ కల్చర్ పెరిగిపోవడంతో 'అకియా'ల్లో అద్దెకు దిగేందుకు ఎవరూ రావడంలేదు. దీంతో అవన్నీ భూత్ బంగ్లాలుగా మిగిలిపోతున్నాయి. జపాన్ అంతటా ఇలాంటి 'అకియా'లు భారీగా పేరుకుపోతున్నాయి. అకియాలను అమ్మాలంటే జపాన్ ప్రజలు నరకయాతన పడుతున్నారు. రానున్న రోజుల్లో అకియా సమస్య మరింత పెరుగుతుందని.. అంచనా వేస్తున్నారు. మరణించినవారి ఇళ్లను బంధువులు కూడా తీసుకోవడానికి ముందుకు రావడం లేదు.. కారణం .. జపాన్లో రెండో ఇల్లు కలిగి ఉంటే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 'ఆకియా'ల సంఖ్య పెరగడానికి ఇది కూడా ఓ కారణంగా చెబుతున్నారు.

 జపాన్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. యువత ఉపాధి కోసం గ్రామాలను వీడి నగరాలకు వస్తుండడంతో గ్రామాల్లోని ఇళ్లన్నీ ఖాళీగా మిగిలిపోతున్నాయి. మామూలుగానే గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకు డిమాండ్ తక్కువగా ఉంటుంది. పైగా యువత పెద్దవాళ్లను కూడా తీసుకోని నగరాలకు వెళ్లిపోవడంతో ఆ ఇళ్లల్లో ఉండేవారే కరువయ్యారు. 

కొన్ని ఊళ్లు 'అకియా విలేజ్'లుగా మారుతున్నాయి. ఖాళీగా ఉన్న ఇళ్లను కూల్చేద్దామన్నా ..అవసరాలకు అనుగుణంగా రినోవేషన్ చేద్దామన్నా..వాటి యజమానులు లేకపోవడంతో చేయలేకపోతున్నారు. కారణం.. ఇంటి యజమాని అనుమతి ఉంటేనే ఒక ఇంటిని కూల్చడం, రినోవేషన్ చేయడం సాధ్యమవుతుంది. లేదంటే ఆ ఇల్లు అలా శిథిలమైపోవాల్సిందే తప్ప... అక్కడి ప్రభుత్వం కూడా దాన్ని ముట్టుకునేందుకు వీలులేకుండా చట్టాలు అడ్డుకుంటున్నాయి. శిధిలాలుగా మారి.. లేదా తుపానులు, సునామీలు, భూకంపాల వంటి ప్రకృతి విపత్తుల వల్ల ఆ ఇళ్లు కూలిపోతేనే ఈ భూత్ బంగాల సమస్య పరిష్కారమవుతుందంటున్నారు అక్కడి అధికారులు. 

ఇటీవల కొన్ని ప్రాంతాల్లో చట్టాలను మార్చి, అకియాలను కొన్ని ప్రైవేటు కంపెనీలకు అప్పగించారు. టోక్యో నుంచి వాయువ్య దిశలో రెండు గంటలు ప్రయాణిస్తే ఆ ప్రాంతమంతా ఇలాంటి అకియాలతో నిండిపోయి కనిపిస్తుంది.. ఇలాంటి ఆకియాలను తీసుకొని, వాటిని ప్రజలు నివసించేందుకు అనుకూలంగా ఉండేలా ఎన్నో మార్పులు చేసింది. అందులో ఉన్నవాళ్లకు మరెన్నో ఆఫర్లను కూడా ప్రకటించింది.  కాని చాలా కొద్ది అకియాలను మాత్రమే అభివృద్ది చేసింది.  ఎక్కువశాతం అకియాలు. భూత్ బంగాళాలుగానే మిగిలిపోయాయి. 

జపాన్ లోని పెద్ద పెద్ద నగరాల్లో రానున్న రోజుల్లో ఈ సమస్య మరింతగా పెరిగే అవకాశముందని టయోయో విశ్వవిద్యాలయంలోని సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ నొజావా అభిప్రాయపడ్డారు. ప్రజలు ఇలాంటి ఆకియాలను  తీసుకుని అందులో నివసించడాని కంటే శివారుల్లో కొత్త ఇళ్లు కట్టుకోవడానికి మొగ్గుచూపిస్తున్నారని చెప్పారు. దీంతో అకియాల సమస్యకు ఆ దేవుడే పరిష్కారం చూపాలంటూ చమత్కరించారు.

-వెలుగు, లైఫ్-