జపాన్ ఎయిర్‌లైన్స్‌పై సైబర్‌ దాడి.. విమానాలు ఆలస్యం

జపాన్ ఎయిర్‌లైన్స్ (JAL)పై సైబర్ దాడి జరిగింది. భారత కాలమానం ప్రకారం, గురువారం(డిసెంబర్ 26) ఉదయం 7:24 గంటల సమయంలో ఈ సైబర్ దాడి జరిగినట్లు ఎయిర్‌లైన్స్ నివేదించింది. సైబర్‌టాక్‌ వల్ల కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నట్లు పేర్కొంది. ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరింది.

భారీ సైబర్‌టాక్‌ నేపథ్యంలో వినియోగదారులను కనెక్ట్ చేసే నెట్‌వర్క్ వ్యవస్థలో లోపం ఏర్పడినట్లు జపాన్ ఎయిర్‌లైన్స్ ప్రకటన విడుదల చేసింది. ఇది దేశీయ, అంతర్జాతీయ విమానాలపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. సిబ్బంది.. దీనిపై పనిచేస్తున్నారని..  కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్ధరించిన వెంటనే వినియోగదారులకు తెలియజేస్తామని తెలిపింది.

జపాన్ ఎయిర్‌లైన్స్.. ఆల్ నిప్పన్ ఎయిర్‌వేస్ (ANA) తర్వాత దేశంలో రెండవ అతిపెద్ద విమానయాన సంస్థ. ఈ క్రమంలో సైబర్ దాడి విమాన సేవలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఎక్కడికక్కడ టిక్కెట్‌ విక్రయాలు కూడా ఆగిపోయాయి. ప్రయాణీకులు ఎయిర్ పోర్టుల్లోనే పడిగాపులు కాస్తున్నారు.