శ్రీనగర్: ఎగ్జిట్ పోల్స్‌ను తలకిందులు చేస్తూ జమ్మూ కాశ్మీర్‌అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్‌కాన్ఫరెన్స్ పార్టీ ఘన విజయం సాధించింది. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకున్న ఈ పార్టీ మ్యాజిక్‌ఫిగర్‌ను దాటేసింది. దీంతో కాబోయే సీఎం ఎవరనేది ఆసక్తిగా మారింది. ఈ సస్పెన్స్‌కు ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా తెరదించారు. తన కుమారుడు ఒమర్అబ్దుల్లానే జమ్మూ కాశ్మీర్సీఎంగా బాధ్యతలు చేపడతారని ప్రకటించారు. ‘‘పదేండ్ల తర్వాత ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. వారి అంచనాలను అందుకోవాలని ఆ అల్లాను ప్రార్థిస్తున్నా. ఇక్కడ ఇక పోలీస్‌రాజ్ ఉండదు.. పబ్లిక్రాజే ఉంటుంది. జైల్లో ఉన్న అమాయకులను రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తాం. మీడియాకు స్వేచ్ఛనిస్తాం. హిందూ, ముస్లింల మధ్య విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి” అని ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.
ఓడిన ప్రతిసారీ బలంగా తిరిగొస్తున్న ఒమర్
ఫరూక్ అబ్దుల్లా వారసత్వాన్ని అందుకున్న ఒమర్ అబ్దుల్లా 2009 నుంచి 2015వరకు జమ్మూకాశ్మీర్ సీఎంగా పనిచేశారు. ఆయన తాత షేక్ అబ్దుల్లా స్థాపించిన నేషనల్ కాన్ఫరెన్స్‌లో ఒమర్ అబ్దుల్లా కార్యకర్తగా చేరారు. 1990లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1998లో శ్రీనగర్ నియోజకవర్గంనుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2001లో వాజపేయి నేతృత్వంలోని ఎన్డీయే సర్కారులో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2009లో 38 ఏండ్ల వయస్సులోనే జమ్మూ కాశ్మీర్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. జమ్మూ కాశ్మీర్ సీఎంలుగా పనిచేసినవారిలో అత్యంత చిన్నవయస్కుడిగా రికార్డు సాధించారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలోనే ఆయన రాజకీయ జీవితంలో కఠిన పరీక్షలు ఎదురయ్యాయి.