జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు..మోదీ పాలనకు రెఫరెండం

ఆర్టికల్ 370 రద్దు జమ్మూ కాశ్మీర్​ రాష్ట్రవాసులకు రక్షగా నిలిచిందా అనే అంశంపై తీర్పునిచ్చేవిధంగా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.  ఒక రకంగా చెప్పాలంటే 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు  కావడం వల్ల  మోదీ పాలనకు రెఫరెండంగా మారింది.  కేంద్రంలోని మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక అడుగుకు జమ్మూ కాశ్మీర్​ ఎన్నికల ఫలితాలు రెఫరెండం అవుతాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యాని స్తున్నారు. కాంగ్రెస్ రాజకీయ కారణంగా ఆర్టికల్ 370కి మద్దతు ఇచ్చినప్పటికీ, దాని మిత్రపక్షం నేషనల్ కాన్ఫరెన్స్ జమ్మూ కాశ్మీర్​ స్వయంప్రతిపత్తి రద్దును పూర్తిగా వ్యతిరేకించింది. మరో  ప్రధాన ప్రాంతీయ పార్టీ పీడీపీ కూడా దాని మునుపటి వైఖరి నుంచి వెనక్కి తగ్గలేదు. ప్రస్తుతం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) నాయకురాలు మెహబూబా ముఫ్తీతో సహా అన్ని రాజకీయ పార్టీలు కేంద్రంలోని అధికార బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి.  

ప్రస్తుతం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌, నేషనల్‌‌‌‌‌‌‌‌ కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌లు కలిసి ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీకి గట్టి పోటీ ఇవ్వనున్నాయి.  నేషనల్‌‌‌‌‌‌‌‌ కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌ 51 స్థానాల్లో పోటీ చేయనుండగా, జమ్మూ ప్రాంతంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ బీజేపీతో తలపడనుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, రాజకీయ మాస్టర్‌‌‌‌‌‌‌‌స్ట్రోక్‌‌‌‌‌‌‌‌గా హిందువులు మెజారిటీగా ఉన్న జమ్మూలో  సీట్ల సంఖ్యను  ప్రధాని మోదీ సర్కారు 37 నుంచి 43 సీట్లకు పెంచింది.  డీలిమిటేషన్ కసరత్తులో భాగంగా లోయలో  ఒక సీటు మాత్రమే జోడించడమైంది. దీంతో ఇక్కడ స్థానాల సంఖ్య 46 నుంచి47 సీట్లకు పెరిగింది. జమ్మూ కాశ్మీర్​ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం రాజకీయపరంగా ఏ పార్టీకైనా ప్రతిష్టాత్మకం. ఒకవేళ విజయం సాధిస్తే జమ్మూ కాశ్మీర్​ రాష్ట్ర హోదా కల్పించడంలో  బీజేపీ ఎటువంటి సమయం తీసుకోదు. అయితే, కమలం పార్టీ ఓడిపోతే మాత్రం కేంద్ర పాలిత ప్రాంతం లెఫ్టినెంట్- గవర్నర్ ద్వారా నేరుగా కేంద్రం పరిపాలనలో కొనసాగే అవకాశం ఉంది. జమ్మూ  కాశ్మీర్ లెఫ్టినెంట్-గవర్నర్‌‌‌‌‌‌‌‌కు మరిన్ని అధికారాలు ఇచ్చేందుకు  కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇటీవల పలు నిబంధనలను సవరించింది. జమ్మూ కాశ్మీర్​ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం రాజకీయపరంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకం. ఒకవేళ విజయం సాధిస్తే బీజేపీ జమ్మూకాశ్మీర్​లో బలోపేతానికి మార్గం సుగమం అవుతుంది. 

గులాం నబీ ఆజాద్ డీపీఏపీపై బీజేపీ ఆశలు

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో అత్యంత సీనియర్ నాయకుడు, ప్రముఖ రాజకీయ నేత  గులాం నబీ ఆజాద్ హస్తం పార్టీని వీడి సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) పేరుతో ఆయన తన రాజకీయ పార్టీని స్థాపించారు. కాగా, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి అయిన గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిష్క్రమించడంతో  ఒకవిధంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లుగా భావించవచ్చు.  అయితే, ఆజాద్ తన అనారోగ్యం కారణంగా ప్రచారానికి విముఖత చూపినప్పటి నుంచి ఆయన పార్టీ డీపీఏపీ అభ్యర్థులు నిరాశజనకంగా మారిపోయారు.  వీరిలో చాలామంది ఎన్నికల్లో పోటీ చేయకుండా ముందుగానే  పోటీ నుంచి వైదొలిగారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. జమ్మూ కాశ్మీర్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఆజాద్ డీపీఏపీ అద్భుతమైన ఫలితాలు సాధిస్తే ఆయన పార్టీకి బీజేపీ మద్దతు ఇచ్చి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కానీ,  లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికలలో తమ అభ్యర్థులందరూ ఓడిపోవడంతో ఆజాద్ పార్టీ ఇప్పటివరకు టేకాఫ్‌‌‌‌‌‌‌‌లో విఫలమైంది. మరోవైపు నేషనల్ కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌తో పొత్తు పెట్టుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ త్వరలో జరగనున్న జమ్మూ కాశ్మీర్​ ఎన్నికల్లో తమ విజయావకాశాలను మరింతగా పెంచుకుంది.  

కాంగ్రెస్​ గెలిస్తే మోదీ బలహీనతకు సంకేతం

లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీకి 19.3 శాతం ఓట్లు రాగా, నేషనల్‌‌‌‌‌‌‌‌ కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌కు 22.2 శాతం ఓట్లు వచ్చాయి. పార్లమెంట్​ఎన్నికల్లో నేషనల్​ కాన్ఫరెన్స్,  పీపుల్స్ డెమోక్రటిక్​ పార్టీ, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీలు కలిసి మొత్తం 90 అసెంబ్లీ సెగ్మెంట్లలో 46 స్థానాల్లో ఆధిక్యంలో నిలిచాయి. బీజేపీ, దాని మిత్రపక్షం పీపుల్స్ కాన్ఫరెన్స్ 30 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో నిలిచాయి. జమ్మూ కాశ్మీర్ పీసీసీ అధ్యక్షుడిగా పీడీపీ మాజీ నేత తారిఖ్ హమీద్ కర్రాను కాంగ్రెస్ ఇటీవల నియమించింది. ఈక్రమంలో  జమ్మూ ప్రాంతంలోని 43 స్థానాల్లో గెలుపు అవకాశాలపై కన్నువేసి ఇద్దరు హిందువులు తారా చంద్, రామన్ భల్లాలను జమ్మూ కాశ్మీర్​ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌లుగా హస్తం పార్టీ ఎంపిక చేసింది. లోయలో నేషనల్ కాన్ఫరెన్స్ బాగా రాణిస్తుందని అంచనా వేసినప్పటికీ,  సీట్ల సంఖ్యను పెంచుకోవడంతోపాటు జమ్మూలో  బీజేపీ ఓటు బ్యాంకును దెబ్బతీయడం కాంగ్రెస్ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్​లో పార్టీ కోసం ఎన్నికల  ప్రచారాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీకి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్​లో జరిగే  ఏ ఎన్నికల్లోనైనా గెలవడం ఆపార్టీకి నైతిక స్థైర్యాన్ని నింపుతుంది.  జమ్మూకాశ్మీర్​ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ కూటమి గెలిస్తే అది కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం బలహీన పడుతున్నదనే సంకేతంగా మారవచ్చు.

- అనితా సలూజా,
సీనియర్​ జర్నలిస్ట్​ (ఢిల్లీ)