- 7 జిల్లాల్లోని 24 సెగ్మెంట్‌లకు ఎన్నికలు
- ఓటు వేయనున్న 23 లక్షల మంది
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పదేండ్ల తర్వాత మొదటి సారి అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం మూడు విడతల్లో ఎలక్షన్స్ జరపాలని నిర్ణయించగా..బుధవారమే ఫస్ట్ ఫేజ్ పోలింగ్ చేపట్టనున్నారు. తొలి విడతలో భాగంగా మొత్తం ఏడు జిల్లాలో పోలింగ్ జరగనుంది. 24 అసెంబ్లీ సెగ్మెంట్‌లకు 219 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 23 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఫేజ్ 1లో 11,76,462 మంది పురుషులు, 11,51,058 మంది మహిళలు, 60 మంది థర్డ్ జెండర్లు ఓటు వేయనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.18 నుంచి 19 ఏండ్ల మధ్య వయస్సు గల 1.23 లక్షల మంది యువకులు, 28,309 మంది వికలాంగులు (పీడబ్ల్యూడీలు), 85 ఏండ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న 15,774 మంది వృద్ధ ఓటర్లు కూడా మొదటి దశలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని వివరించింది.
3,276 పోలింగ్ స్టేషన్లలో మొత్తం 14 వేల మంది పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తారని తెలిపింది. భద్రతా ఏర్పాట్లలో సెంట్రల్ ఆర్మ్‌డ్ పారామిలిటరీ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), జమ్మూ కాశ్మీర్ ఆర్మ్‌డ్ పోలీసులు, జేకే పోలీసుల నుంచి బలగాలు భాగం అవుతాయని తెలిపింది.