జమ్మికుంట ఆసుపత్రిలో ఆరు నెలల తర్వాత ప్రసవాలు

  • కలెక్టర్ ప్రత్యేక చొరవ
  • ఆరు నెలల తర్వాత ఆసుపత్రిలో  మొదటి డెలివరీ  

జమ్మికుంట, వెలుగు: జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరు నెలల తర్వాత గర్భిణులకు  ప్రసవాలను చేయడం ప్రారంభించారు.  ఆరు నెలలుగా  గైనకాలజిస్ట్  లేక పోవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు చేయకుండా హుజురాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపించే వారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి పై ప్రత్యేక దృష్టి సారించి చుట్టూ ఉన్న 100 గ్రామాల్లోని ప్రజలకు సేవలు అందించడంతోపాటు గర్భిణీ లకు డెలివరీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇక్కడి ఆసుపత్రికి గైనకాలజిస్టు, సర్జన్ ను ఏర్పాటు చేశారు.  గురువారం ప్రభుత్వ ఆసుపత్రిలో మొదటి ప్రసవం చేశారు.  కరీంనగర్ డీసీహెచ్ఎస్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో  మొదటి డెలివరీ కేసు నమోదు చేశారు.  జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి సోమవారం గురువారం ప్రసవాలు జరుగుతాయని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్  శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.