కులగణనతో 42 శాతం రిజర్వేషన్లు సాధించుకుందాం : జాజుల శ్రీనివాస్ గౌడ్

మెట్ పల్లి, వెలుగు: బీసీ లీడర్లు.. రాజకీయ దొరలకు తలవంచి బానిసలుగా బతకొద్దని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం జగిత్యాల జిల్లా మెట్‌‌‌‌పల్లి పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో  బీసీ కులగణనపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల హక్కుల సాధనకు అన్ని కులాలు ఏకమై పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. మూడు శాతం జనాభా ఉన్నవారు పాలకులుగా మారుతున్నారని,  60 శాతానికి పైగా ఉన్న బీసీల నుంచి కేవలం 19 మంది ఎమ్మెల్యేలే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఏ సర్కార్‌‌‌‌‌‌‌‌ స్పందించడం లేదని వాపోయారు.  కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్  పెంచుకునే దాకా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. జ్యోతిరావుపూలే, కుమురంభీం, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, సర్వాయి పాపన్న పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలన్నారు. కాంగ్రెస్ సర్కారు కుల గణన చేశాకనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడం సంతోషకరమన్నారు.

కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ, రాష్ట్ర కార్యదర్శి బొమ్మెర శంకర్, జిల్లా అధ్యక్షుడు బ్రాహ్మణ బేరి నరేశ్‌‌‌‌, జగిత్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, కరీంనగర్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజు, విద్యా విభాగ అధ్యక్షుడు నారోజు రాకేశ్‌‌‌‌, రాష్ట్ర ప్రచార ప్రధాన కార్యదర్శి సంపత్, జిల్లా పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.