బీసీ రిజర్వేషన్లు పెంచేందుకే సమగ్ర కులగణన : జాజుల శ్రీనివాస్ గౌడ్

కరీంనగర్, వెలుగు : బీసీ రిజర్వేషన్లను పెంచేందుకే  రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కులగణన సర్వే చేస్తోందని, ఎలాంటి అపోహలు, సందేహాలు పెట్టుకోకుండా బీసీ ప్రజలు సహకరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. బీసీ కులాల లెక్కలు తెలియకుండా కొందరు నేతలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బీసీలు అప్రమత్తతో ఉండి తమ కులం తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని సూచించారు.  కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో బుధవారం నిర్వహించిన ‘కుల గణన చైతన్య సదస్సులో ఆయన మాట్లాడారు.  

ప్రభుత్వ ఉద్యోగులను  కులగణన వ్యతిరేకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అలాంటివారిని గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.  సర్వేలో ఆర్థిక అంశాలు చెబితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు దక్కవనే అబద్దపు ప్రచారం చేస్తూ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. సర్వేలో కులాన్ని కచ్చితంగా చెప్పాలని కోరారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు20 రోజులు నిర్వహించే సదస్సుల్లో బీసీలను చైతన్యం చేస్తున్నామని తెలిపారు.

 కులగణనపై సందేహాలు తీర్చడానికి టోల్ ఫ్రీ నంబర్ ప్రారంభించాలని, సీఎం ఒక రోజు తప్పించి ఒకరోజు ఉన్నతస్థాయి సమీక్ష చేయాలని కోరారు. సర్వే కోసం గ్రామాల్లో దండోరా వేయించాలని పేర్కొన్నారు.  బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్ అధ్యక్షతన నిర్వహించగా.. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, రాష్ట్ర సహాయ ప్రధాన కార్యదర్శి రంగు సంపత్ గౌడ్, నేతలు జీఎస్ ఆనంద్,  వరికుప్పల మధు,  రాచమల్ల రాజు పాల్గొన్నారు.