దుబాయ్‌లో జగిత్యాల జిల్లా కార్మికుడు సూసైడ్

మల్లాపూర్ , వెలుగు : ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లిన కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామానికి చెందిన దండ్ల శ్రీనివాస్(35) కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేక మూడేండ్ల కింద గల్ఫ్ కు  వెళ్లాడు. అక్కడ చాలీచాలని జీతానికి పనిచేస్తున్న శ్రీనివాస్ కు చేసిన అప్పులు పెరగడంతో పాటు ఆర్థిక సమస్యలు ఎక్కువకావడంతో మనస్తాపంతో దుబాయ్ లో గురువారం ఉరేసుకుని చనిపోయాడు. 

శ్రీనివాస్ మృతిపై తోటి కార్మికులుసమాచారం అందించడంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతుడికి భార్య అనిత, ముగ్గురు కుమార్తెలు కావ్య(13), అశ్విత(11), వైష్ణవి(8)లు ఉన్నారు. నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.