జోరుగా పీడీఎస్ రైస్ దందా

  • జగిత్యాల నుంచి మహారాష్ట్ర కు రవాణా
  • ప్రతి నెలా  రాష్ట్రం దాటుతున్న 
  • రూ. 8 కోట్ల విలువ చేసే రైస్

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాలో ప్రభుత్వం పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి.  కొందరు ఊరూరా తిరిగి  వినియోగదారుల నుంచి తీసుకుంటే,  మరికొందరు రేషన్ డీలర్ల నుంచి సేకరిస్తున్నారు.  ఇలా  సేకరించిన బియ్యాన్ని  మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.  జిల్లాలోని కోరుట్ల డివిజన్లో కేవలం మూడు రోజుల్లో నాలుగు ప్రాంతాల్లో ఒక టన్నుకు పైగా పీడీఎస్ రైస్ను పట్టుకుని సీజ్ చేసి పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లు కేసులు నమోదు చేశారు. 

రైస్ మిల్లర్లు, డీలర్స్ యూనియన్ లీడర్లదే కీలకం

పీడీఎస్ రైస్ అక్రమ దందాలో  రైస్ మిల్లర్లు, డీలర్స్ యూనియన్లోని కొందరు లీడర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు.  ఇప్పటికే పలు కేసులను ఎదుర్కొంటున్న రైస్ మిల్లర్లు కూడా    ‌‌నేరుగా లబ్ధిదారుల నుంచి కిలో సుమారు రూ. 12, - రూ. 14 చొప్పున సేకరిస్తూ ఆటోల ద్వారా మిల్లర్​కు తరలిస్తున్నారు. కొందరు రేషన్ డీలర్లు లబ్ధిదారుల నుంచి వేలి ముద్ర తీసుకుంటూ కిలో దాదాపు రూ. 14 చొప్పున బియ్యానికి బదులు నగదు ఇస్తున్నారు. కొందరు కీలక లీడర్లు మిల్లర్లతో ముందుగానే చేసుకున్న ఒప్పందం మేరకు బహిరంగంగానే ఆటోలు, ట్రాన్స్ పోర్ట్ వెహికిల్స్ ద్వారా మిల్లులకు చేరవేస్తున్నారు. 

3300 టన్నుల రైస్..

జిల్లా లో 3,07,101 రేషన్ కార్డులు ఉన్నాయి.  రేషన్ పంపిణీ కోసం 592 రేషన్ డీలర్ల ను ఏర్పాటు చేశారు. వీటిలో దాదాపు 8,81,737 లబ్ధిదారులకు 5,500 టన్నుల పీడీఎస్ రైస్ సరఫరా అవుతోంది. ఇందులో 60 శాతం 3300 టన్నులకు పైగా అక్రమ దందా జోరుగా సాగుతోంది. కేజీ రూ. 12 చొప్పున సేకరించిన బియ్యాన్ని రూ. 35 నుంచి రూ. 40 లకు పైగా డిమాండ్ ఉన్న మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు లారీల ద్వారా తరలిస్తున్నారు. టన్నుకు రూ. పది వేలు తీసుకుంటూ రూ. 36 వేల కు పైగా విక్రయిస్తూ అదనంగా రూ. రూ. 26 వేలు సంపాదిస్తున్నారు.  పక్కదారి పడుతున్న 3300 టన్నుల పీడీఎస్ బియ్యం విలువ సుమారు రూ. 8 కోట్ల పై ఉంటుందని తెలుస్తోంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించడంతో ఈ దందాకు చెక్ పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.  


పీడీఎస్ రైస్ అక్రమంగా 

తరలిస్తే చర్యలు: పీడీఎస్ రైస్ అక్రమ తరలింపు, నిల్వల పై నిఘా పెట్టాం. నిరంతరం తనిఖీలు నిర్వహిస్తాం. ఇప్పటికే సమాచారం మేరకు పోలీస్ శాఖ తో కలిసి దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నాం. పీడీఎస్ అక్రమాల పై కఠినచర్యలు తీసుకుంటున్నాం.–  ఎస్. జితేందర్, సివిల్ సప్లై ఆఫీసర్, జగిత్యాల జిల్లా