ఈజీ మనీ ఆశతో  యువత అడ్డదారులు... సర్వం కోల్పోయి అప్పుల్లో కూరుకుపోతున్న వైనం

  • సర్వం కోల్పోయి అప్పుల్లో కూరుకుపోతున్న వైనం 
  • ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న బెట్టింగ్​ ట్రాప్స్‌‌ 
  • తల్లిదండ్రులు తమ పిల్లలను కనిపెట్టుకొని ఉండాలని నిపుణుల హెచ్చరిక

‘కొడిమ్యాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన డిగ్రీ చదువుతున్న యువకుడు ఆన్‌‌లైన్‌‌ గేమ్స్‌‌ ఆడుతుండేవాడు. వాటికి అలవాటు పడిన అతను.. తన తండ్రి తండ్రికి చెందిన ఫోన్ పే ద్వారా విడతల వారీగా పెట్టుబడి పెట్టి సుమారు రూ.పది లక్షల పైగా పోగొట్టాడు. ఇంట్లో చెబితే ఏమంటారో అని భయపడి ముంబాయి పారిపోయాడు. తర్వాత విషయం తెలుసుకున్న పేరెంట్స్ ఏమి అనమని ఫోన్ చేసి చెప్పడంతో ఇంటికి వచ్చాడు.’

‘జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డు కృష్ణానగర్ కు చెందిన యువకుడు ఆన్‌‌లైన్‌‌ గేమ్స్‌‌కు బానిసగా మారాడు. తెలిసినవాళ్లు, బంధుమిత్రుల దగ్గర అప్పులు చేస్తూ వాటిని గేమ్స్ లో పెట్టుబడిగా పెట్టాడు. సుమారు రూ.కోటి వరకు నష్టపోయిన యువకుడు గత రెండు నెలలుగా అజ్ఞాతంలోకి వెళ్లాడు. దీంతో అప్పులు ఇచ్చినవాళ్లు ఇంటి చుట్టూ తిరుగుతున్నారు.’ 

జగిత్యాల, వెలుగు: ఈజీగా మనీ సంపాదించాలన్న అత్యాశతో యువత అడ్డదారులు తొక్కుతున్నారు. తక్కువ టైంలో ఒకేసారి రూ.లక్షలు, రూ.కోట్లు సంపాదించాలని ఆశతో పెట్టుబడులు పెట్టి సర్వం కోల్పోతున్నారు. ఆన్‌‌లైన్‌‌ గేమ్స్, బెట్టింగ్స్ ట్రాప్ లో పడి చదువు, కెరీర్‌‌‌‌ను నాశనం చేసుకుంటున్నారు. ఓ వైపు చేసిన అప్పులతోపాటు పరువు పోతుందన్న భయంతో ప్రాణాలు తీసుకుంటున్నారు.

ఇలాంటి ఘటనలు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇటీవల ఎక్కువయ్యాయి. సాధారణంగా ఇలాంటి గేమ్స్ లో వచ్చేదాని కన్నా పోగొట్టుకునేదే ఎక్కువగా ఉంటోంది. కాగా రాష్ట్రంలో కొన్ని ఆన్‌‌లైన్ బెట్టింగ్స్‌‌, గేమింగ్ యాప్స్‌‌పై నిషేధం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఎలాంటి రెస్ట్రిక్షన్ లేకపోవడంతో కొందరు యువత ఫేక్ వీపీఎన్ ద్వారా లొకేషన్ మార్చి పెట్టుబడులు పెడుతున్నారు. ఇలాంటి వాటిపై తల్లిదండ్రులు తమ పిల్లలను కనిపెట్టుకొని ఉండాలని నిపుణలు హెచ్చరిస్తున్నారు. 

ఆకర్షిస్తున్న ఆన్‌‌లైన్‌‌ గేమ్స్‌‌ 

నేటి యువతకు టెక్నాలజీ అరచేతిలోకి వచ్చేసింది. చదువును పక్కన పెట్టిమరీ స్మార్ట్‌‌ ఫోన్‌‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఆన్‌‌లైన్‌‌ గేమ్స్‌‌, బెట్టింగ్‌‌ యాప్స్‌‌ ఊరించే ప్రకటనలకు ఆకర్షితులవుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయన్న ఆశతో అప్పులు తెచ్చి మరీ పెట్టుబడులు పెడుతున్నారు. మొదట ఫ్రీ గేమ్స్ తో వల వేస్తున్న యాప్స్‌‌ నిర్వాహకులు.. వాటికి అలవాటు పడ్డాక ప్రీమియం పేరిట రేట్ ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారు. వీటిల్లో గెలిస్తే రూ.లక్షలు, కోట్లు సంపాదించొచ్చని ఆశ పెడుతున్నారు.

నమ్మిన కొందరు యువత వలలో చిక్కుకుపోయి ఆర్థికంగా చితికి పోతున్నారు. కన్నవారికి,  కుటుంబ సభ్యులకు తెలియకుండా డబ్బులు దొంగిలించి మరీ పెట్టుబడులు పెడుతున్నారు. మరికొందరు బయట అప్పులు చేసి మరీ ఆడుతున్నారు. ఆన్‌‌లైన్ గేమ్స్‌‌, బెట్టింగ్‌‌ల్లో సంపాదించక అప్పులు చెల్లించవచ్చని, ఆడుతూ పీకల్లోతు కూరుకుపోతున్నారు. అంతా కోల్పోయాక ఏమి చేయాలో తెలియక కొందరు ప్రాణం తీసుకుంటున్నారు. మరికొందరు కన్న వారికి చెప్పి ఆస్తులు అమ్మి కడుతున్నారు. 

అవగాహన కల్పిస్తున్నాం

ఆన్ లైన్ గేమ్స్, బెట్టింగ్‌‌ యాప్‌‌లపై పోలీస్​ శాఖ ఆధ్వర్యంలో యువతకు అవగాహన కల్పిస్తున్నాం. యువత ఆన్ లైన్ గేమ్స్ కు బానిస కావడం వారి భవిష్యత్‌‌కు ప్రమాదకరం. పిల్లలపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలి. ఎప్పటికప్పుడు వారిని పర్యవేక్షించాలి.- సీఐ వేణుగోపాల్, జగిత్యాల టౌన్