- జగిత్యాల టౌన్ హాల్ నుంచి ఎంపీడీవో ఆఫీసు వద్దకు మార్పు
- ఎక్కడ ఉందో తెలియక బస్టాండ్లు, చౌరస్తాల్లోనే ఉంటున్నరు
- మూడేండ్లుగా పట్టించుకోకుండా అధికారుల నిర్లక్ష్యం
- చలిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న వృద్ధులు, దివ్యాంగులు
జగిత్యాల, వెలుగు : టౌన్ హాల్ జాగాలో ఏర్పాటైన షెల్టర్ హోమ్ ను మూడేండ్ల కింద ఎంపీడీవో ఆఫీస్ ఎదుట మున్సిపల్ బిల్డింగ్ పైకి తరలించడంతో నిరాశ్రయుల పాలిట శాపంగా మారింది. ఎక్కడ ఏర్పాటు చేశారో.. ఎవరికి సేవలందిస్తారనే వాటిపై అవగాహన కల్పించలేదు. దీంతో వృథాగా మిగిలింది. వృద్ధులు, దివ్యాంగు లకు ఉపయోగ పడకపోవడంతో నిరాశ్రయులు రాత్రి పూట బస్టాండ్లు, చౌరస్తాల్లో తలదాచుకునే పరిస్థితి నెలకొంది. సర్వేలు నిర్వహించి అభాగ్యులను గుర్తించాల్సిన ఆఫీసర్లు నిర్లక్ష్యంగా ఉండడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరో చోటుకు తరలింపు.. పట్టించుకోని అధికారులు
జగిత్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ టౌన్ హాల్ జాగాలో మెప్మా ఆధ్వర్యం లో 2016 లో రెండు గదులతో షెల్టర్ హోమ్ నిర్మించి నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించారు. 2021లో టౌన్ హాల్ ను ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇవ్వగా అందులో ఫంక్షన్ హాల్, రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. టౌన్ హాల్ పక్కన ఉన్న రెండు గదులను కూల్చి వేశారు. నిరాశ్రయుల సెంటర్ ను మాత్రం ఎంపీడీవో ఆఫీస్ ఎదుట ఉన్న మున్సిపల్ బిల్డింగ్ లోకి తరలించారు. దీనిపై అవగాహన కల్పించలేదు.
ఎప్పటికప్పుడు వీధుల్లో, బస్టాండ్, చౌరస్తా వంటి ప్రాంతాల్లో సర్వేలు చేస్తూ నిరాశ్రయులను గుర్తించాలి. వారు ఏదైనా జీవనోపాధి చేసుకునేలా ప్రోత్సహించాలి. అలాగే జనాలకు, ఫంక్షన్ హాల్స్ నిర్వాహకులకు అవగాహన కల్పిస్తూ భాగస్వామ్యం చేసుకుని, మిగిలిన ఫుడ్ ను షెల్టర్ హోమ్ కు తరలించేలా చూస్తుండాలి. హెల్త్ సెంటర్ నుంచి మెడిసిన్ కూడా అందించాలి. రోజూ వారి అటెండెంట్స్, నెలకోసారి మెప్మా ఆఫీసర్లు విజిట్ చేస్తుండాలి. కానీ ఇలాంటివేవీ అధికారులు పట్టించుకోవడంలేదు.
ALSO READ : ఎన్నారై ఖాతా నుంచి రూ.6.5 కోట్లు చోరీ.. బ్యాంక్ ఆఫీసర్లే సిబ్బందితో కుమ్మక్కై కొట్టేశారు..!
బస్టాండ్లు, చౌరస్తాలే దిక్కు..
షెల్టర్ హోమ్‌పై ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నిరాశ్రయులు రావడం లేదు. టౌన్ లోని బస్టాండ్లు, చౌరస్తాలే దిక్కయ్యాయి. దాదాపు యాభై మందికి అక్కడ ఆశ్రయం కల్పించే అవకాశం ఉంది. కానీ, ఒక వృద్ధుడు మాత్రమే షెల్టర్ పొందుతున్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే అధికారుల పనితీరు ఎలా ఉందో తెలుస్తుంది. ఇప్పటికైనా వృద్ధులకు, దివ్యాంగులకు అందుబాటులో ఉండే బిల్డింగ్ లోకి మార్చాలని నిరాశ్రయులు వేడుకుంటున్నారు. ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి సర్వే నిర్వహించి ఆశ్రయం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.