త్వరలో డ్రైవర్​లెస్​ వెహికల్​అభివృద్ధి చేస్తున్న ఐఐటీ హైదరాబాద్

  • సుజుకీ కంపెనీ సహకారం
  • ప్రయోగ దశలో ఉన్న వాహనం  
  • క్యాంపస్​లో 2 కిలోమీటర్ల ట్రాక్ పై  ట్రయల్స్​

సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఐఐటీ హైదరాబాద్  స్టూడెంట్లు డ్రైవర్ రహిత వాహనాన్ని రూపొందిస్తున్నారు. ఇది ఇప్పుడు ప్రయోగ దశలో ఉంది. డ్రైవర్  అవసరం లేకుండా వాటంతట అవే నడిచే వాహనాల సాంకేతికతను ఐఐటీ హైదరాబాద్  పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసింది. టిహాన్  (టెక్నాలజీ ఇన్నొవేషన్  ఆన్  అటానమస్  నావిగేషన్) వేదికగా జపాన్ కు చెందిన సుజుకి కంపెనీ సహకారంతో డ్రైవర్ రహిత ఫోర్ వీలర్  వెహికల్స్  రూపొందిస్తున్నారు. ఇందులో ఆధునిక రాడార్లు, త్రీడీ టెక్నాలజీ, అల్గారిథమ్​ ఉపయోగిస్తున్నారు.

 ఈ ప్రాజెక్టులో వర్సిటీ ఎలక్ట్రికల్  ఇంజినీరింగ్, కంప్యూటర్  సైన్స్, మెకానికల్, ఏరో స్పేస్, సివిల్, మ్యాథమేటిక్స్, డిజైన్స్  వంటి వివిధ విభాగాల పరిశోధక స్టూడెంట్లు భాగస్వాములయ్యారు. ప్రస్తుతం ఈ వాహనాలు ప్రయోగ దశలో ఉండడంతో ఐఐటీహెచ్  ప్రాంగణంలో 2 కిలోమీటర్ల పొడవైన స్పెషల్​ట్రాక్  ఏర్పాటు చేసి ట్రయల్స్​ నిర్వహిస్తున్నారు. మన దేశ రోడ్లపై నడిచే  విధంగా టెక్నాలజీని డెవలప్​ చేస్తున్నారు. వాహనానికి ఏది అడ్డం వచ్చినా గుర్తించేలా పటిష్ట సెన్సార్​ వ్యవస్థను ఈ వాహనంలో పొందుపరుస్తున్నారు.  

అభినందించిన మంత్రి శ్రీధర్ బాబు 

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్  బాబు సోమవారం ఐఐటీ క్యాంపస్ ను సందర్శించారు. టిహాన్  వేదికగా జపాన్ కు చెందిన సుజుకి కంపెనీ సంయుక్త సహకారంతో ఐఐటీ హైదరాబాద్​ స్టూడెంట్లు​రూపొందిస్తున్న డ్రైవర్​లెస్  వాహనాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా టీపీసీసీ వర్కింగ్  ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఐఐటీ డైరెక్టర్  మూర్తి, ప్రొఫెసర్ రాజ్యలక్ష్మితో కలిసి మంత్రి.. డ్రైవర్ రహిత వాహనంలో ప్రయాణించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిలికాన్  వ్యాలీలో సీఎం రేవంత్ రెడ్డితో డ్రైవర్ లెస్  వెహికల్ లో ప్రయాణం చేశానన్నారు. 

అక్కడి కన్నా ఇక్కడ అద్భుతమైన అనుభూతి కలిగిందని ప్రశంసించారు. ఈ ప్రయోగం మన దేశానికి గర్వకారణమన్నారు. త్వరలోనే డ్రైవర్​రహిత వాహనాలు అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఐఐటీ హైదరాబాద్  డైరెక్టర్​తో పాటు ఇందుకు కృషి చేసిన పరిశోధకుల బృందాన్ని మంత్రి అభినందించారు. అంతకుముందు డ్రైవర్ లెస్ వెహికల్   తయారీ గురించి ఐఐటీహెచ్ ప్రొఫెసర్, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. జపాన్  సుజుకి మోటార్స్  కంపెనీ ప్రతినిధులు, ఐఐటీహెచ్  ప్రొఫెసర్లు, స్టూడెంట్స్ పాల్గొన్నారు.