దేశాన్ని అభివృద్ధి చేసే వారిని అందించేది టీచర్లే.. ఆచార్య దేవోభవ

ఏ దేశమైనా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో ఆర్థికరంగ నిపుణులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, వ్యవసాయరంగ నిపుణులు, నీటిపారుదల రంగం, రక్షణశాఖ, డాక్టర్లు, ఇంజినీర్లు,  రాజకీయ నాయకులు, ఇలా ప్రతి రంగంలోని వ్యక్తులందరూ విద్యావంతులు కావల్సిందే.  వీరందరినీ విద్యావంతులుగా తీర్చిదిద్దేది కేవలం ఉపాధ్యాయుడే. అంటే, దేశ అభివృద్ధికి బాటలు వేసేది ఉపాధ్యాయులు మాత్రమే. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా  జరుపుకొనేదే ఉపాధ్యాయ దినోత్సవం. 

ఆయన  40 ఏండ్లపాటు ఉపాధ్యాయ వృత్తి చేపట్టి ఎన్నో సన్మానాలు, అవార్డులు పొందారు. 27 సార్లు నోబెల్ పురస్కారానికి నామినేట్ అయ్యారు.  దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న పొందారు. దేశ ప్రథమ ఉప రాష్ట్రపతిగా, బాబూ రాజేంద్రప్రసాద్ తర్వాత రెండవ రాష్ట్రపతిగా ఎన్నుకోవడానికి ఆయన సాధించిన అవార్డులు పేరు ప్రఖ్యాతులే ప్రధాన కారణం.  

Also Read :- విపత్తులోనూ.. వికృత రాజకీయ క్రీడేనా?

ఒక టీచర్ నవ సమాజ నిర్మాతగా.. విద్యార్థులందరినీ కుల, మత భేదం లేకుండా ముందుకు నడిపించే గురువుగా ఉండాలని బోధించారు. అందుకే భగవద్గీతను చదివినంత శ్రద్ధాసక్తులతో బైబిల్‌‌ చదివారు సర్వేపల్లి. ఖురాన్​ను అలవోకగా నేర్చుకున్నారు,  సూఫీ తత్వాన్నీ మథించారు, విశ్వ గురువుగా పేరొందిన సర్వేపల్లికి  కొందరు విద్యార్థులు ఆయనకు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపితే, జన్మదినంగా కాకుండా ఉపాధ్యాయ దినంగా మలిచిన గొప్ప వ్యక్తి సర్వేపల్లి. కాగా, చరిత్ర మరవని గొప్ప పండితుడిగా ఆయనను గుర్తు చేసుకోవాల్సిన అవసరం కేవలం ఉపాధ్యాయులదే కాదు, జ్ఞానాన్ని పొందిన ప్రతి పౌరునిది.గురు బ్రహ్మ, గురువిష్ణు, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః అని దైవంతో సమానంగా కొలుస్తారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని సమాజంలో తల్లి తండ్రుల తర్వాత స్థానం గురువుదే.

జబీ సయీద్​