బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు పసుపు బోర్డు ఏర్పాటు పట్టించుకోరా?

  • రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట అన్వేష్​​రెడ్డి

ఆర్మూర్, వెలుగు:  పసుపు బోర్డు ఏర్పాటును ఎంపీ ధర్మపురి అర్వింద్‌‌, ఆర్మూర్​ ఎమ్మెల్యే పైడి రాకేష్​రెడ్డి పట్టించుకోరా?అని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట అన్వేశ్​రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆర్మూర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  పసుపు బోర్డు ప్రకటన పాలాభిషేకానికే పరిమితమైందన్నారు.  పసుపు పంట అంటే బంగారంతో సమానమని భావించే రైతులు పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఉద్యమం చేశారన్నారు.  తాను గెలవగానే పసుపు బోర్డు తెస్తానని 2019 ఎలక్షన్ లో ఎంపీ హామీ ఇచ్చి బాండ్ పేపర్ రాసిచ్చారని గుర్తు చేశారు.  పసుపు బోర్డు ఊసెత్తకుండా స్పైసెస్ బోర్డు ప్రకటన చేయించారని విమర్శించారు. 2024 ఎలక్షన్ల కోసమే అక్టోబర్ 2023 లో ప్రధానమంత్రి తో పసుపు బోర్డు ప్రకటన చేయించారన్నారు.

 ఆగమేఘాల మీద గెజిట్ విడుదల చేశారే తప్ప, ఆ గేజిట్లో ఏ రాష్ట్రంలో పసుపు బోర్డు పెడతారో పేర్కొనలేదన్నారు.  పసుపు బోర్డుకు సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదన కూడా అందులో లేదని ఆరోపించారు. పసుపు పంట చేతికి వస్తుందని ఇప్పుడు రైతుల పరిస్థితి ఏమిటని ఎంపీ, ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కేంద్ర మంత్రికి లెటర్ రాసారన్నారు.  పసుపు బోర్డు ఆఫీస్ నిజామాబాద్ ఏర్పాటుచేయాలని, అందుకు స్థలాన్ని కేటాయిస్తామని, రాష్ట్ర వాటా కూడా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని లెటర్ పేర్కొన్నారన్నారు. 

ఎగుమతులు, దిగుమతులకు సంబంధం లేకుండా పసుపు ధర ప్రకటించాలని, ఇతర పంటలకు ఇచ్చినట్టు పసుపు పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్​ సాయిబాబా గౌడ్, వైస్ చైర్మన్ విట్టం జీవన్, చిన్నారెడ్డి, దేగాం ప్రమోద్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.