ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం: మంత్రి శ్రీధర్​బాబు

గోదావరిఖని, వెలుగు: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్​ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం రామగుండం ఎమ్మెల్యే రాజ్​ఠాకూర్‌‌‌‌తో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్ట్​ను సందర్శించారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, ఔట్​ఫ్లోను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఎగువ నుంచి ఎల్లంపల్లికి భారీగా వరద రావడంతో 32 గేట్లు ఓపెన్​ చేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారని, నదీ పరివాహక ప్రాంత ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ అప్రమత్తం చేయాలన్నారు. 

రామగుండం నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని, రెండు నెలల్లో బండలవాగు ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి ఎత్తిపోతలను సత్వరమే పూర్తి చేసి 27 ఎల్​, 17 ఎల్​ కాలువలను అనుసంధానిస్తామన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఎల్లంపల్లి పూర్తయినా ప్రారంభించలేదన్నారు. 

త్వరలో సీఎం రేవంత్‌‌రెడ్డి ప్రాజెక్టును ప్రారంభిస్తారన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే రాజ్​ఠాకూర్​ ప్రాజెక్టు వద్ద గోదావరిలో  చీరెసారె, గాజులు, పూలు వేసి గోదావరికి మొక్కులు చెల్లించారు. కార్యక్రమంలో కలెక్టర్​ కోయ శ్రీహర్ష, సీపీ ఎం.శ్రీనివాస్​, ఇరిగేషన్​ సీఈ సుధాకర్​ రెడ్డి, ఏసీపీ ఎం.రమేశ్‌‌, మేయర్​అనిల్‌‌కుమార్‌‌‌‌, రాజలింగం, మహేశ్‌‌, సుధాకర్, మహాంకాళి స్వామి, రాజేందర్​, బాలరాజు, శ్రీనివాస్​గౌడ్​, తిరుపతి, కార్పొరేటర్లు, లీడర్లు పాల్గొన్నారు.