సింగరేణిలో ఎల్లో, రెడ్‌‌‌‌ కార్డుల జారీని రద్దు చేయాలి : మడ్డి ఎల్లాగౌడ్

గోదావరిఖని, వెలుగు : సింగరేణిలో కార్మికుల వల్ల అనుకోకుండా జరిగే తప్పులకు ఎల్లో, రెడ్‌‌‌‌ కార్డులు జారీ చేస్తూ వారిని ఇబ్బంది పెట్టడం సరైంది కాదని, ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, బ్రాంచ్‌‌‌‌ కార్యదర్శి ఆరెల్లి పోశం డిమాండ్‌‌‌‌ చేశారు. గోదావరిఖనిలోని భాస్కర్‌‌‌‌రావు భవన్‌‌‌‌లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. 

కార్మికులు ఎలాంటి పొరపాట్లు చేయకున్నా, వారిని తమ చెప్పు చేతల్లో పెట్టుకునేందుకు ఎల్లో, రెడ్‌‌‌‌ కార్డులను జారీ చేస్తున్నారని ఆరోపించారు. కార్మిక సంఘాలతో చర్చించకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కార్డుల జారీ విధానాన్ని ప్రవేశపెట్టడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. 

కార్మికులను మానసికంగా కుంగదీయడం సరికాదని, ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు. లేదంటే యూనియన్‌‌‌‌ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ మీటింగ్‌‌‌‌లో సంకె అశోక్, రంగు శ్రీనివాస్, ఎస్.వెంకట్‌‌‌‌రెడ్డి, గండి ప్రసాద్, మిట్ట శంకర్, రమేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ పాల్గొన్నారు.