హెజ్బొల్లా గ్రూప్​తో కాల్పుల విరమణ షురూ.. 14 నెలల పోరాటానికి ఇజ్రాయెల్ ముగింపు

జెరూసలెం: లెబనాన్ లోని హెజ్బొల్లా మిలిటెంట్లతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ బుధవారం తెల్లవారుజామున ప్రారంభించింది. దాదాపు14 నెలల పోరాటానికి ముగింపు పలికేందుకు మంగళవారం ఆ దేశం ఆమోదం తెలిపింది. 60 రోజులపాటు  కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగించడానికి సమ్మతించింది. కాల్పుల విరమణ సందర్భంగా ఇజ్రాయెల్‌‌ క్రమంగా తన బలగాలను ఉపసంహరించుకోనుంది. హెజ్బొల్లా ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ పేర్కొంది. కాల్పుల విరమణ సందర్భంగా లెబనీస్ బలగాలు, యూఎన్ శాంతిరక్షకులను దక్షిణ లెబనాన్ లో మోహరించనున్నారు.  కాగా, ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య పోరాటంలో లెబనాన్‌‌ లో 3,800 మందికి పైగా మరణించారు. లక్ష ఇండ్లు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్ కు చెందిన 80 మందికి పైగా సైనికులు, 47 మంది పౌరులు చనిపోయారు.