శరణు కల్పించిన పాలస్తీనాకే ఎసరు పెడుతున్న ఇజ్రాయిల్​

 ఇజ్రాయిల్‌‌‌‌ ఏర్చడి ఇప్పటికి డెబ్బై ఆరు సంవత్సరాలు మాత్రమే. ఈ దేశం పేరు వినపడని రోజు ఉండదు. ఒకరోజు ఇజ్రాయిల్‌‌‌‌ దౌర్జన్యం,  రెండవ రోజు పాలస్తీనా తిరుగుబాటు, ఆ మరుసటి  రోజున ఐక్యరాజ్యసమితిలో అసెంబ్లీ ఖండన,  తదనంతర  రోజున సెక్యూరిటీ కౌన్సిల్లో అమెరికా వీటో చేయడం, చివరగా అలీన దేశాలు గుమిగూడి సంతాపం.  నెల తిరగదు, అదే కథ మళ్లీ మొదలవుతుంది. ఎప్పటిలా పాలస్తీనా ప్రజలపై దాడులు, మారణకాండ కొనసాగుతూనే ఉంటుంది. 

రెండు వేల సంవత్సరాల క్రితం ఇజ్రాయిల్‌‌‌‌ అన్నది ఒక దేశంగాగానీ,  జాతిగా కానీ లేదు. ఒకరోజు క్రైస్తవ దేవుడైన యెహోవా అబ్రహంకు కలలో కనిపించి పాలస్తీనా ప్రాంతాన్ని యూదులకు  దత్తత  చేస్తాననే  మాట ఇచ్చి, అదే వాక్కును ప్రచారం చేశారు. అందుకని పాలస్తీనా భూభాగాన్ని తామే సాధించుకోవాలని యూదులు 
తీర్మానించుకున్నారు. అప్పటికే కొన్ని వందల సంవత్సరాలుగా, ఎన్నో సమూహాలుగా జీవిస్తున్న పాలస్తీనా మూలవాసులైన అరబ్బు సమాజానికి ఈ ప్రయత్నంలో ఎంత ప్రాణ నష్టం జరిగినా యూదు సమాజం పట్టించుకోలేదు. 

తమలక్ష్యం నెరవేరే వరకు మనం చూసేది  ‘ప్రజలు లేని దేశాన్ని దేశం లేని ప్రజలకు అప్పజెప్పడంగా’ జ్యూస్‌‌‌‌ అభివర్ణించుకున్నారు. యూదుల 'జుడాయిజం’ ముందుగానే పుట్టింది. కాబట్టి  కైస్త్రవం పుట్టుకతో యూదుల మతమైన జూడాయిజం బలహీనపడలేదు. అందుకే అరబ్బులు, యూదులు దగ్గరి పోలికలే కాదు,  బంధుత్వాలు  కూడా కొనసాగించారు. ఇద్దరూ సంచార జీవులే. వ్యవసాయం, వ్యాపారం, అతి చిన్న వ్యవసాయ కమతాలు వీరి జీవనాధారం. వీటిని ఇద్దరూబాగా కలిసి పని చేసుకుని జీవనం సాగించేవారు.  

నోబెల్​ గ్రహీతలు 

జ్యూస్‌‌‌‌ కమ్యూనిటీని రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అడాల్ఫ్‌‌‌‌  హిట్లర్‌‌‌‌ దాదాపుగా యాభై లక్షల మందిని హతమార్చిన విషయం అందరికీ తెలుసు. ఈ సంఘటనతో ప్రపంచంలోనే అత్యధిక శక్తిమంతులుగా ఎదగాలనే పట్టుదల, కోరికతో  టెక్నాలజీ రంగంలో జ్యూస్​ కమ్యూనిటీ చాలా ముందుకు వెళ్లిపోయింది.  భారతదేశంలో ఆధునిక వ్యవసాయ సాగు పద్ధతులకు  కావలసినంత  శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, యాంత్రీకరణను పరిచయం చేసింది.  ఇటీవల వెలుగులోకి వచ్చిన తెలంగాణ ఫోన్‌‌‌‌ టాపింగ్‌‌‌‌ టెక్నాలజీ కూడా ఇజ్రాయిలీలదే. ప్రపంచంలో మెజారిటీ  నోబెల్‌‌‌‌ బహుమతి  పొందినవారు ఈ  జ్యూస్‌‌‌‌ కమ్యూనిటీకి చెందినవారే.

యూదులు సాంకేతిక నిపుణులు

డబ్బుతో పాటు శాస్త్ర సాంకేతిక రంగం పశ్చిమ దేశాల నుంచి పుట్టిన  యూదుల జాబితా చాలా పెద్దది.  ఇందులో  యావత్తు ప్రపంచానికి తెలిసిన కార్ల్‌‌‌‌ మార్క్స్​, సిగ్మెండ్‌‌‌‌ ఫ్రాయిడ్‌‌‌‌,  ఆల్బర్ట్‌‌‌‌ ఐన్​స్టీన్,  నావోమ్‌‌‌‌ చోమ్‌‌‌‌ స్కీ వంటి వారు ఉన్నారు.  ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు  జో బైడెన్‌‌‌‌ యూదుల మూలాలు ఉన్న వ్యక్తి.  అంతేకాదు అమెరికాలోని  ఆయుధాల తయారీ సంస్థలు, అమెరికా స్టాక్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ చాలావరకు యూదుల చేతుల్లోనే ఉన్నాయి. పాలస్తీనాకు  యూదుల రాకను  అరబ్బులు ఏనాడూ కాదనలేదు. యూదులు సాంకేతిక నిపుణులు, ఎన్నో మానవ సౌకర్యాలను మోసుకొచ్చారు.  అరబ్బులు మానవీయ విలువలతో సాటి మనుషులుగానే  చేరదీశారు. ఈ వలస యూదులపై అంతటి ఉదార వైఖరి వారి మానవీయ మనుగడకే ప్రాణాంతకంగా మారింది. 

శరణార్థులుగా అరబ్బులు

1919లో  పాలస్తీనా జనాభా ఆరు లక్షలు. అందులో అరబ్బుల జనాభా ఐదు లక్షల ఇరవై వేలు.  యూదులంతా వివిధ దేశాలలో స్థిరపడి జీవిస్తున్నారు.  అయినప్పటికీ యూదుల గమ్యస్థానం పాలస్తీనాగా నిర్ధారించుకున్నారు.  అమెరికా, ఇంగ్లాండ్‌‌‌‌, ప్రాన్స్‌‌‌‌ దేశాల్లో కోట్లు గడించిన  జియోనిస్టులు పాలస్తీనాలో పాతుకుపోతున్న ఇజ్రాయిలీలకు డబ్బులు పంపిణీ చేసి పాలస్తీనా భూములను కొనుగోలు చేశారు. 

కొనుగోలు చేసిన భూమిలో కూలి పనులు చేస్తున్న స్థానిక అరబ్బులను తొలగించేశారు.  చివరికి అరబ్బులకు నివాస స్ధలం, కనీసం తలదాచుకునేందుకు, నిలువ నీడ కూడా లేకుండా చేశారు  జ్యూస్‌‌‌‌ లు.  ఐక్యరాజ్యసమితి నిర్ణయాలను పట్టించుకోకుండా సామ్రాజ్యవాద శక్తి, యుక్తి,  ధనం వగైరా ప్రయోగాలతో 1948లో ఇజ్రాయిల్‌‌‌‌ గా  ప్రకటించుకున్నారు.  వీరి బాధలను తట్టుకోలేక అరబ్బులు చుట్టుపక్కల  దేశాలైన  జోర్డాన్‌‌‌‌, సిరియా,  ఈజిప్టు  దేశాలకు  శరణార్థులుగా వెళ్లి గత 60 సంవత్సరాలుగా ఆ శిబిరాలలోనే జీవిస్తున్నారు.  

మాతృభూమి వాత్సల్యం వదులుకోలేక యాసర్‌‌‌‌ అరాఫత్‌‌‌‌ లాంటి మహా నాయకుడు లేకపోయినా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎన్ని అరాచకాలైనా  తట్టుకొని యుద్ధం చేస్తున్న అరబ్బులు, పక్క దేశంలో తల దాచుకొని పోరాటం చేయటం అన్నది చరిత్రలో పాలస్తీనా ప్రజలతోనే  వచ్చింది. కాళ్ల కింద నేల ఉంటే నిలదొక్కుకొని పోరాటం చేయవచ్చునని చైనా,  వియత్నాం  ప్రజలు నిరూపించారు. కానీ, కాళ్ల కింద నేల కోసమే పోరాటమైతే దిక్కేది?

భారత్​ తటస్థ వైఖరి మారాలి

ఐక్యరాజ్యసమితి ఒక రివాజుగా కూర్చోవడం అమెరికా “వీటో చేయడం జరుగుతూనే ఉంది. ప్రపంచ దేశాలన్నీ ఎన్నిసార్లు  వ్యతిరేకించినా ఇజ్రాయిల్‌‌‌‌ తగ్గడం లేదు. ఇజ్రాయిల్‌‌‌‌ చేస్తున్న ఈ మారణ హోమాన్ని చూస్తూ  భారత్​తటస్థంగా ఉండటం సరైనది కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా, మనుషుల ప్రాణాలను, మానవత్వాన్ని , మానవీయ విలువలను  ప్రేమించేవారిగా.. మానవ హననాన్ని ఆపు చేసేలా భారత్​ నిర్ణయం తీసుకోవాలి.

దశాబ్దాలుగా హింస

కొన్ని దశాబ్దాలుగా హింసను ఎదుర్కొంటున్న అరబ్బులు ఓ పథకం ప్రకారం ‘హామాస్‌‌‌‌ రూపంలో 2023 అక్టోబర్‌‌‌‌ 7న  ఇజ్రాయిల్‌‌‌‌ పై  దాడిచేసి కొందరిని హతమార్చారు. మరికొందరిని కిడ్నాప్‌‌‌‌ చేసి బందీలుగా యూదు జాతీయులను తమ దగ్గర ఉంచుకున్నారు. అందుకు ప్రతిగా ఇజ్రాయిలీలు చేస్తున్న  మానవ హననం ,  గాజా నగరంలోని రెండు మిలియన్ల ప్రజలలో ఇప్పటికే 35800 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎనబైవేల మంది తీవ్రమైన గాయాలతో  కుదేలవుతున్నారు.  మారణ హోమం ఇంకా కొనసాగుతూనే ఉంది. 

- వి. బాలరాజు,
తహశీల్దారు (రిటైర్డు)