- హమాస్ లక్ష్యంగా భూ, గగనతల దాడులు
- బాంబుల మోతతో దద్దరిల్లిన జబాలియా నార్త్ఎన్క్లేవ్
కైరో: హమాస్ మిలిటెంట్ సంస్థను తుడిచిపెట్టడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ మిలిటరీ(ఐడీఎఫ్) భూ, గగనతలం నుంచి విరుచుకుపడగా బాంబుల మోతతో గాజా మరోసారి దద్దరిల్లింది. ఉత్తర గాజాలోని జబాలియా నార్త్ఎన్క్లేవ్ను మంగళవారం ఐడీఎఫ్ చుట్టుముట్టి జరిపిన దాడిలో గాజా స్ట్రిప్‌లో 50 మంది చనిపోయారు. ఆల్ఫలౌజియా శరణార్థ శిబిరంలో 17 మంది మరణించినట్టు పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. ఖాన్యూనిస్కు ఉత్తరాన ఉన్న బనీ సుహైలాలోని 10 మంది మృతి చెందినట్టు వివరించింది.
పది రోజులనుంచి జబాలియాలో బాంబుల మోత
జబాలియాపై ఇజ్రాయెల్ ఆర్మీ పది రోజులుగా విరుచుకుపడుతోంది. యుద్ధ ప్రారంభ సమయంలో బాంబుల మోతతో దద్దరిల్లిన ఈ ప్రాంతంపై ఐడీఎఫ్ మళ్లీ గురిపెట్టింది. ఇప్పటివరకూ డజన్ల కొద్దీ ఇండ్లను ధ్వంసం చేసినట్టు స్థానికులు తెలిపారు. 10 రోజుల కిందటే ఈ ప్రాంతంలో ఆపరేషన్ ప్రారంభమైందని, హమాస్ బలపడకుండా చూడడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. కాగా, ఉత్తర ఎన్‌క్లేవ్‌లోని ప్రజలను ఇక్కడి నుంచి పంపించేందుకే ఇజ్రాయెల్ దాడి చేస్తోందని పాలస్తీనా ఆరోపిస్తున్నది. వెళ్లిపోయిన వాళ్లను తిరిగి రానివ్వరని హెచ్చరించింది. కాగా, గాజా స్ట్రిప్ నుంచి ఉత్తర గాజాను పూర్తిగా తుడిచిపెట్టేందుకు ఇజ్రాయెల్ కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తున్నదని యూఎన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చిన్నారులను తరిమేసిన యుద్ధం
హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులతో లెబనాన్‌లో నెత్తురు పారుతున్నది. దాదాపు ఏడాదినుంచి యుద్ధం కొనసాగుతుండగా.. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెలుతున్నారు. ఇప్పటివరకూ సుమారు 12 లక్షల మంది బీరుట్ సరిహద్దుల్లోని ప్రాంతాలకు వెళ్లారు. 3 వారాల్లోనే లెబనాన్‌నుంచి 4 లక్షలకు పైగా చిన్నారులు వెళ్లారని యూఎన్ తెలిపింది.