ట్రంప్​ విజయంలో మస్క్... టెక్నాలజీతో క్యాంపెయిన్ చేసిన బిలియనీర్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం వెనక స్పేస్ ఎక్స్ అండ్ టెస్లా సీఈవో, బిలియనీర్ ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషించారు. టెక్నాలజీని ఉపయోగించి ట్రంప్ ప్రచారానికి వెయ్యి ఏనుగుల బలాన్ని తీసుకువచ్చారు. మస్క్ అఫీషియల్ క్యాంపెయినర్ కానప్పటికీ.. ఎక్స్(ట్విట్టర్) ద్వారా ట్రంప్ ఉద్దేశాలను ప్రజలకు చేరవేయడంలో సక్సెస్ అయ్యారు. గత ఎన్నికల్లో ఓడిన తర్వాత నుంచి ట్రంప్, ఎలాన్ మస్క్ బంధం బలపడింది. అప్పట్లో ట్విట్టర్ ట్రంప్ ను బ్యాన్ చేసింది. ఆ తర్వాత దాన్ని ఎలాన్ మస్క్ కొనుగోలు చేసి.. ఫ్రీడం ఆఫ్ స్పీచ్ అనే నినాదంతో  ఎక్స్ గా పేరుమార్చారు.

క్రమక్రమంగా ట్రంప్​కు అనుకూలంగా మారిపోయాడు. ట్రంప్ కోసమే మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేశారనే ప్రచారం కూడా జరిగింది. దీనికి కారణం లేకపోలేదు. అమెరికాలో టాప్ 10 న్యూస్ ఛానెల్స్ ఉంటే.. అందులో ఒక్క న్యూస్ ఛానెల్ మాత్రమే ట్రంప్ కు అనుకూలంగా ఉంది. మిగతా అన్ని న్యూస్ అండ్ ప్రింట్ మీడియా డెమోక్రటిక్ పార్టీకి మద్దతుగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ట్రంప్ ప్రచారానికి ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను ఉపయోగించారు.

ఇంటర్వ్యూలే జో రోగన్ అస్త్రాలు 

ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించిన మరొక వ్యక్తి జో రోగన్. మాజీ నటుడిగా.. టీవీ హోస్ట్ గా సుపరిచితుడైన ఆయన.. పాడ్ కాస్ట్ ద్వారా అమెరికా ప్రజలకు బాగా దగ్గరయ్యారు. ట్రంప్, ఎలాన్ మస్క్ తోపాటు పలువురిని ఇంటర్వ్యూలు చేశారు.  గ్రేట్ అమెరికా నినాదంతోపాటు అక్రమ వలసలు, పడిపోయిన ఆర్థిక వ్యవస్థ, ధరల పెరుగుదల, ఉద్యోగాల కోత, తగ్గిన ఉపాధి అవకాశాలు వంటి అనేక అంశాలపై పలు ఇంటర్వ్యూలు చేశారు. 

వీరిద్దరితో పాటు తులసి గబ్బార్డ్( మాజీ డెమొక్రాట్),  వివేక్ రామస్వామి(అమెరికన్ కాన్ఫిడెంట్ దేశీ), రాబర్ట్ ఎఫ్.కెన్నెడీ జూనియర్( ది రెబెల్లియస్ ఐకానోక్లాస్ట్), జేడీ వాన్స్( ది హిల్‌బిల్లీ ఇంటెలెక్చువల్), టక్కర్ కార్ల్సన్ కూడా ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించారు. వీరి సపోర్ట్, వ్యూహాలు లేకపోతే ట్రంప్ మళ్లీ గెలిచి నిలిచేవాడు కాదని సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది.