భారత్​కు జమిలి, బ్యాలెట్ సాధ్యమేనా?

దేశంలో  కొన్నాళ్లుగా జమిలి ఎన్నికలు, ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్)ల  చుట్టే  ప్రధానంగా  రాజకీయ చర్చలు నడుస్తున్నాయి.  భారత  రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏండ్లు  పూర్తయిన  సందర్భంగా నవంబర్ 26న రాజ్యాంగ  దినోత్సవ  వేడుకలు  దేశవ్యాప్తంగా  ఘనంగా జరిగాయి.  ఇదే రోజూ  జమిలి,  బ్యాలెట్  ద్వారా  ఎన్నికల అంశాలు  మరోసారి  ప్రస్తావనకు వచ్చాయి. పార్లమెంట్  సమావేశాల్లోనూ,  సుప్రీంకోర్టులోనూ  విస్తృత చర్చకు దారితీశాయి.  ఇలా కొంతకాలంగా  జమిలి,  బ్యాలెట్ ద్వారా ఎన్నికలపై   అధికార, విపక్ష రాజకీయ పార్టీల మధ్య వాడీవేడిగా  చర్చలైతే  నడుస్తున్నా యి.  గత 20 ఏండ్లుగా  లోక్ సభ సార్వత్రిక,  రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ  ఈవీఎంల   ద్వారానే  ప్రజలు   ఓటుహక్కును  వినియోగించుకుంటున్నది  తెలిసిందే. 

కేంద్రంలో  పదేండ్ల కింద బీజేపీ పాలన పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ  ‘ఒకే దేశం. ఒకే ఎన్నికలు’  తెరపైకి  వచ్చాయి.  దేశ రాజకీయాల్లో  సందర్భానుసారం చర్చకు వస్తున్నాయి.  గత జూన్​లో  మూడోసారి  కేంద్రంలో  బీజేపీ సారథ్యంలోని  ఎన్డీయే  సంకీర్ణ  ప్రభుత్వం  ఏర్పాటైనా కానీ..  ప్రధాని మోదీ  జమిలి ఎన్నికలపై  ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. 2014,  2019లో  రెండుసార్లు  కేంద్రంలో  బీజేపీ  పూర్తి మెజారిటీతో   కేంద్ర ప్రభుత్వంలో ఉన్నా.. ప్రస్తుతం  సంకీర్ణ  కూటమి  ప్రభుత్వాన్ని  నడుపుతున్నా,  జమిలిపై  ధీమాతోనే  దూకుడుగా  ముందుకెళ్తున్నారు. తాజాగా  మహారాష్ట్ర  అసెంబ్లీ ఫలితాలతోనూ బీజేపీ అధిష్టానంలో జోష్  పెరిగింది. దీంతో,  జమిలికి  ఇదే సరైన సమయమని కూడా ఎన్డీయే  సర్కార్  భావిస్తోంది. ఇప్పుడు కాకుంటే  ఇంకెప్పుడూ నిర్వహించలేమనే  భావన కనిపిస్తోంది. ఇలా జమిలిపై  బీజేపీ మరింత స్పీడ్ పెంచుతుందా?  ఒకవేళ  జమిలికి వెళ్లి  నాలుగోసారి  కేంద్రంలో అధికారం  చేపట్టే  కల నెరవేర్చుకుంటుందా?  వంటి  ప్రశ్నలు ఉన్నాయి.  మరోవైపు వరుస ఓటములతో  బీజేపీని ఎదుర్కొలేకపోతున్న  కాంగ్రెస్  పరిస్థితి ఏంటి?  జమిలిపై ఆ పార్టీ కూటమిలో వ్యక్తమవుతున్న అభిప్రాయమేంటి?  అనే  ప్రశ్నలకు  సమాధానాలు  తెలియాల్సి ఉంది.  ఏదేమైనా  ప్రస్తుతం జమిలి  ఎన్నికల  సాధ్యాసాధ్యాలపై  దేశవ్యాప్తంగా రకరకాలుగా రాజకీయంగా చర్చలైతే  నడుస్తున్న మాట వాస్తవమని చెప్పొచ్చు. 

సగానికిపైగా రాష్ట్రాలు ఓకే అంటేనే..  

గత  ఆగస్టు 15న ఎర్రకోట  నుంచి ప్రధాని మోదీ  జమిలి  ఎన్నికలపై  ప్రసంగించి దేశప్రజల్లో మరోసారి చర్చకు  తెరతీశారు.  జమిలి  ఎన్నికల  సాధ్యాసాధ్యాలపై  గతేడాది  మాజీ  రాష్ట్రపతి  రామ్ నాథ్  కోవింద్ నేతృత్వంలో  ఏర్పాటైన  కమిటీ  ఇచ్చిన  సిఫారసులకు గత సెప్టెంబర్ లో  కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. దీంతో,  జమిలిపై  దేశ రాజకీయాల్లో విస్తృత చర్చను పెట్టింది. అంతేకాదు.. ప్రస్తుత  శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును  పార్లమెంటులో  ప్రవేశపెట్టే చాన్స్ కూడా ఉంది.  అయితే, కోవింద్ కమిటీ సూచనల మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 83,  85, 172,  174, 356 లను  సవరించాల్సి ఉంటుంది. అదేవిధంగా పార్లమెంట్ ఉభయ సభల్లో 2/3 వంతు  ఎంపీలు  మద్దతు  తెలపాలి. ఆపై  కనీసం14 రాష్ట్రాలు ఓకే చెప్పాలి. ప్రస్తుతం లోక్‌‌సభలో  ఎన్డీయే కూటమి  ప్రభుత్వానికి బలం ఉంది. కానీ,  రాజ్యసభలో  లేకపోవడంతో అదనంగా మరికొంతమంది ఎంపీల మద్దతు కూడగట్టాలి.  అప్పుడే  జమిలి  బిల్లుకు  మార్గం  సుగమం అవుతుంది. ఇలాంటి సవాళ్లు ప్రధాని మోదీ సర్కార్ ముందున్నాయి.  

ఎన్డీయే సర్కార్ వాదన ఇలా..

జమిలి ఎన్నికల ద్వారా  దేశ ఎన్నికల ప్రక్రియ సులభతరం అవుతుందని, తద్వారా వేగవంతమైన దేశ ఆర్థికాభివృద్ధికి దారితీస్తుందని కేంద్రంలోని ఎన్టీయే సర్కార్ పేర్కొంటుంది. ఇప్పటికే  లోక్ సభ, రాష్ట్ర, స్థానిక సంస్థలకు.. ఇలా మూడు స్థాయిల్లో  ఎన్నికలతో  దేశవ్యాప్తంగా వలస కార్మికులు పలుమార్లు ఓటు వేసేందుకు సొంతూళ్లకు వెళ్తుండగా శ్రామిక ఉత్పత్తిలో అంతరాయం కలుగుతుందని అంటోంది.  దీన్ని నివారించాలంటే  జమిలి ఎన్నికలే ఏకైక పరిష్కార  మార్గమని కూడా వాదిస్తోంది. అదేవిధంగా ఎన్నికల ఖర్చు,  సిబ్బంది  వినియోగం,  నిర్వహణ  భారం  భారీగా  తగ్గుతుందని  కూడా స్పష్టం చేస్తోంది. దేశంలో ప్రతి మూడు నెలలకోసారి ఏదో ఒక రాష్ట్రంలో ఏవో ఒక ఎన్నికలు ఉంటున్నాయి కూడా. 

బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలి

2004 సార్వత్రిక  ఎన్నికల నుంచి  ఈవీఎంలను  ప్రవేశపెట్టారు.  అంతకుముందు వరకు  బ్యాలెట్ పద్ధతిలోనే  ఎన్నికలు  జరిగాయి. ఇక  ఈవీఎం ఓటింగ్ విధానంపై  దేశవ్యా ప్తంగా ప్రతిపక్ష పార్టీలు ఎప్పటి నుంచో నిరసనలు, ఆందోళనలు  తెలుపుతున్నాయి.  ఎన్నికల  ఫలితాలు  వెల్లడి  తర్వాత  ఓటర్లు కూడా ఈవీఎంలపై  అనుమానాలు వ్యక్తం చేస్తున్న  ఘటనలు తాజాగా  మహారాష్ట్ర  ఎన్నికల్లోనూ  కనిపించాయి.  మళ్లీ బ్యాలెట్ పద్ధతిని అమల్లోకి తీసుకురావాలంటూ ప్రతిపక్షాలు కోరుతున్నాయి.100కు పైగా దేశాల్లో బ్యాలెట్ ద్వారానే  నేడు  ఎన్నికలు  జరుగుతుండగా..భారత్  కూడా  పాత పద్ధతినే  కొనసాగిస్తే  బాగుంటుందని  గుర్తు చేస్తున్నాయి.  ఈవీఎంలను ట్యాంపరింగ్  చేసేందుకు  ఆస్కారం  ఎక్కువగా ఉందని  రాజకీయ పార్టీలతోపాటు  రాజకీయ నిపుణులు, విశ్లేషకులు ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు   కేంద్ర ఎన్నికల సంఘం అలాంటి ఆరోపణలను ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తున్నది. తాజాగా,  దేశంలో  బ్యాలెట్  ద్వారా ఎన్నికలు  జరపాలని  ప్రజాశాంతి  పార్టీ  అధ్యక్షుడు  కేఏ పాల్  సుప్రీంకోర్టులో  దాఖలు చేసిన పిటిషన్ పై  వాదోపవాదాలు జరిగాయి.  పిటిషనర్ పై  సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేస్తూ ‘మీరు గెలిస్తే  ఈవీఎంల  ట్యాంపరింగ్ ఉండదు.  ఓడిపోతే  ట్యాంపరింగ్ జరిగింది’ అనడం సబబు కాదని పిటిషన్ ను కొట్టివేసింది. 

దేశానికి ఎంత మేలు?

పార్లమెంటుతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం భారత్ కు కొత్తేం కాదు. స్వాతంత్య్రం అనంతరం  దేశవ్యాప్తంగా  ఒకేసారి సార్వత్రిక, రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి.  ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో  ప్రభుత్వాలు కూలిపోవడంతో జమిలి ఎన్నికలకు అంతరాయం ఏర్పడింది.  1980  దశకంలో  ప్రధాని ఇందిరా గాంధీ కూడా జమిలి ఎన్నికల నిర్వహణపై  ఆసక్తి చూపారు. కానీ,  నిర్వహణపై  మాత్రం  దృష్టి  సారించలేకపోయారు.  అనంతరం 1999లో  ప్రధాని వాజ్​పేయి  హయాంలోనూ  జమిలి  నిర్వహణపై  లా కమిషన్  కూడా  ఏర్పరిచారు. ఎందుకోగానీ  అది కూడా  మధ్యలోనే  నిలిచిపోయింది. రాబోయే రోజుల్లో  జమిలి నిర్వహిస్తే,  సార్వత్రిక ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువును పెంచడమో, మరికొన్నింటిని తగ్గించడమో  చేయాల్సి ఉంటుంది.  లోక్‌‌సభ  ముందస్తు  ఎన్నికలకు వెళ్లినా ఇవి తప్పవు. మొత్తంగా జమిలి, బ్యాలెట్ పద్ధతిలో  ఎన్నికలు  ప్రజాస్వామ్య  భారత్ దేశానికి  ఎంతవరకు మేలు చేస్తాయని ఇప్పటికిప్పుడైతే  చెప్పడం కష్టమే. జమిలిపై  కేంద్రం  ముందుగా విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా నిర్ణయం తీసుకోవాలని,  అలా కాకుండా  సొంత  ఎజెండాతో  ముందుకెళ్తే  ప్రజాస్వామ్యం విఫలమై సంక్షోభ పరిస్థితులు తలెత్తవచ్చని ఆందోళన  కూడా ఉన్నది. 

విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత 

జమిలి  ఆమోదం, ఆచరణాత్మకం కాదని, కాంగ్రెస్ తో సహ ఇండియా కూటమి పార్టీలు  తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది కేవలం దేశ ప్రజల దృష్టిని మళ్లించే  ప్రయత్నమని కొట్టిపారేస్తున్నాయి.  భారత్‌‌ వంటి అధిక జనాభా కలిగిన దేశానికి ఒకేసారి ఎన్నికల నిర్వహణ చాలా కష్టతరంగా ఉంటుందని వాదిస్తున్నాయి.  జమిలిపై  రాజ్యాంగంలోనూ ఎలాంటి ప్రస్తావన లేదని, అది రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేస్తున్నాయి.  ఎన్నికల  నిర్వహణకు భారీగా సిబ్బంది,  ఈవీఎంలు, వీవీ ప్యాట్లు  అవసరం అవుతాయని,  ఒకవేళ  ఐదేండ్ల కంటే  ముందుగానే  కేంద్ర,  రాష్ట్ర  ప్రభుత్వాలు కూలిపోతే  జమిలి లక్ష్యం దెబ్బతింటుందంటున్నాయి.  ఇప్పటికే లోక్​సభ సార్వత్రిక ఎన్నికలను  రెండు నెలల పాటు 7, 8  విడతల్లో నిర్వహిస్తున్న పరిస్థితి చూస్తున్నామని,  ఒకేసారి ఎన్నికలంటే  ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకుని ఉంటుందని గుర్తు చేస్తున్నాయి. జాతీయ  ప్రాధాన్యత అంశాల ఆధారంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే  ప్రాంతీయ పార్టీల మనుగడ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇది ప్రజాతీర్పునకు,  సమాఖ్య స్ఫూర్తికి,  ప్రజాస్వామ్య విలువలకు గొడ్డలిపెట్టులాంటిదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.    

- వేల్పుల సురేష్,
సీనియర్ జర్నలిస్టు