కరకట్ట పరిరక్షణకు చర్యలు షురూ!

  • రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ శాఖల సర్వే
  • బఫర్ జోన్​లో ఆక్రమణలపై కలెక్టర్​కు నివేదిక

భద్రాచలం, వెలుగు : ఏటపాక నుంచి సుభాష్​నగర్ వరకు నిర్మించిన కరకట్టను పరిరక్షించేందుకు ఇరిగేషన్ శాఖ రంగంలోకి దిగింది. అయ్యప్ప కాలనీ నుంచి ఏటపాక వైపు వెళ్లే కరకట్ట ప్రాంతాన్ని కొందరు ఆక్రమించుకున్నారు. కబ్జాకు గురౌతోంది. ఈ నేపథ్యంలో వరదల సమయంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వరదల సమయంలో కలెక్టర్ దృష్టికి ఈ విషయం వచ్చింది.

దీనితో ఆయన ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లతో చర్చించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇటీవల ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీ ఆఫీసర్లతో సర్వే నిర్వహించారు. దాదాపు 40 ఇళ్లు కరకట్ట లొకేషన్లో ఉన్నట్లుగా గుర్తించి నివేదికను కలెక్టర్​కు అందజేశారు. కరకట్టకు 50 మీటర్ల బఫర్ జోన్ ఉంది. ఈ జోన్​లో అయ్యప్పకాలనీ, అశోక్​నగర్ కొత్తకాలనీకి చెందిన ఇళ్లు ఉన్నట్లుగా ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. 

కట్టకు ప్రమాదం..

ఆక్రమణ వల్ల కరకట్టకు ప్రమాదం పొంచి ఉంది. 2022 జులై 16న అత్యధికంగా 71.3 అడుగుల మేర గోదావరి వరదలు వచ్చాయి. 1986 వరదల తర్వాత ఇదే అత్యధికం. ఈ సమయంలో అయ్యప్పకాలనీ వద్ద కట్టకు బుంగ ఏర్పడింది. దీనితో భద్రాచలం వణికిపోయింది. సకాలంలో ఇసుక బస్తాలతో బుంగను పూడ్చారు. కరకట్ట సమీపంలోని భూమిని  ఆక్రమించి పక్కా భవనాలు నిర్మించే సమయంలో కట్ట కింద ఉన్న ఫిల్టర్లు దెబ్బతింటున్నాయి. దీని వల్లనే కట్టకు బుంగలు ఏర్పడానికి ప్రధాన కారణంగా ఇరిగేషన్ ఇంజినీర్లు చెబుతున్నారు.

 అక్రమణలు అరికట్టకపోతే భవిష్యత్​లో కరకట్ట కోతకు గురవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు దశాబ్ధాల కింద ఏటపాక నుంచి సుభాష్​నగర్ కాలనీ వరకు 10 కిలోమీటర్ల మేర భద్రాచలం టౌన్​ను వరదల నుంచి రక్షించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హయాంలో కరకట్టను రూ.53కోట్లతో నిర్మించారు. అప్పటి నుంచి కట్ట నిర్వహణ సరిగా లేదు. ఏటా వచ్చే వరదలకు కట్ట కొన్ని ప్రదేశాల్లో కోతకు గురైంది. దీనితో ఇరిగేషన్ ఇంజినీర్లు తాత్కాలికంగా వాటికి రిపేర్లు చేసి, ఇసుక బస్తాలతో కాపాడుకుంటూ వస్తున్నారు.

 కానీ ఆక్రమణల వల్ల అసలుకే ఎసరు వచ్చేలా ఉందని అలర్ట్​ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే వచ్చే బ్యాక్​ వాటర్​తో నిత్యం గోదావరి భద్రాచలం వద్ద నిలకడగా ఉంటుంది. ఈ తరుణంలో కరకట్ట పరిరక్షణ అత్యవసరంగా జిల్లా యంత్రాంగం భావిస్తోంది. బఫర్ జోన్​లో ఉన్న ఆక్రమణలపై దృష్టిసారించింది. ఏటా వరదల సమయంలో బఫర్ జోన్​లో ఉన్నవారిని పునరావాస కేంద్రాలకు తరలించడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. వ్యయ, ప్రయాసలు ఎదుర్కోవాల్సి వస్తోంది. 

సర్వే చేశాం

కరకట్ట ఆక్రమణకు గురవుతోంది. అందుకే కలెక్టర్ ఆదేశాల ప్రకారం మాతో పాటు రెవెన్యూ, పంచాయతీ ఆఫీసర్లతో కలిసి సర్వే చేశాం. ఆక్రమణలు గుర్తించి కలెక్టర్​కు నివేదించాం. భవిష్యత్​లో కరకట్ట ఎంతో ముఖ్యం. అందుకే దాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. బఫర్ జోన్​లో ఉన్న ఆక్రమణలు మాత్రమే గుర్తించాం.– వెంకటేశ్, ఏఈఈ, భద్రాచలం