ఇరిగేషన్ పద్దులో అప్పులకే ఎక్కువ

  •  బడ్జెట్​లో ఈ శాఖకు రూ.22,301 కోట్లు కేటాయింపు 
  • ఇందులో రుణ చెల్లింపులకే రూ.9,877 కోట్లు 
  • ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.10,828 కోట్లు 
  • కాళేశ్వరం, మిషన్ కాకతీయకూ నిధులు
  • మంచిర్యాల సిటీ చుట్టూ రక్షణ గోడ కోసం 100 కోట్లు 

హైదరాబాద్, వెలుగు: బడ్జెట్​లో ఇరిగేషన్​శాఖకు కేటాయించిన నిధుల్లో ఎక్కువ శాతం అప్పులకే పోనున్నాయి. ఈ శాఖ పద్దులో దాదాపు 44 శాతం నిధులను ప్రాజెక్టుల కోసం సేకరించిన రుణ చెల్లింపులకు కేటాయించారు. బడ్జెట్​లో ఇరిగేషన్​డిపార్ట్​మెంట్​కు మొత్తం రూ.22,301.53 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో వివిధ ప్రాజెక్టుల కోసం తీసుకున్న రుణాల చెల్లింపులకే రూ.9,877.01 కోట్లు అవసరమవుతాయని పేర్కొంది.

 వాటర్​రీసోర్స్​ఇన్​ఫ్రాస్ట్రక్చర్​డెవలప్​మెంట్ కార్పొరేషన్ రుణాలకు రూ.2,978.92 కోట్లు, కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలకు రూ.6,914.54 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపింది. మొత్తంగా రెవెన్యూ డిమాండ్, రుణాలు, వివిధ ప్రాజెక్టుల మెయింటెనెన్స్, నిర్వాసితులకు పునరావాసం వంటి వాటికి కలిపి రూ.11,472.64 కోట్లు అవసరమవుతాయని చెప్పింది. ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన వారికి పునరావాసం కోసం రూ.795.83 కోట్లను బడ్జెట్​లో కేటాయించింది. 

ప్రాణహిత - చేవెళ్లకు నిధులు.. 

ప్రగతి పద్దు కింద వివిధ ప్రాజెక్టుల అభివృద్ధి, నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. మేజర్​ఇరిగేషన్​ప్రాజెక్టులకు రూ.8,476.49 కోట్లు, మీడియం ఇరిగేషన్​  ప్రాజెక్టులకు రూ.1,203.21 కోట్లు, మైనర్​ ఇరిగేషన్​కు రూ.1,149.14 కోట్లు కేటాయించింది. పెండింగ్​లో ఉన్న కీలక ప్రాజెక్టులు, చివరి దశలో ఉన్న ప్రాజెక్టుల పనులు పూర్తి చేసేందుకు బడ్జెట్​లో ఎక్కువ కేటాయింపులను చేసింది.

 ఇందుకోసం మొత్తం రూ.10,828.84 కోట్లు కేటాయించింది. పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, కాళేశ్వరం, ఎస్ఎల్​బీసీ, సీతారామ వంటి ప్రాజెక్టులకు ఎక్కువ నిధులు ఇచ్చింది. ప్రాణహిత–చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుకూ బడ్జెట్​లో కేటాయింపులు చేసింది. దీనికి  రూ.249 కోట్లు ప్రతిపాదించింది. 

మంచిర్యాల మునగకుండా గోడ.. 

వర్షాలు కురిసినప్పుడల్లా మంచిర్యాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతికే పరిస్థితి తలెత్తింది. ఎల్లంపల్లి నుంచి వచ్చే వరద, కాళేశ్వరంలోని సుందిళ్ల బ్యారేజీ బ్యాక్​వాటర్​తో రాళ్లవాగు వెనక్కి తన్ని ఆ పట్టణం మొత్తం మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతున్నది. ఆ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపనుంది. మంచిర్యాల పట్టణం చుట్టూ రక్షణ గోడను నిర్మించాలని నిర్ణయించింది. అందుకోసం బడ్జెట్​లో రూ.100 కోట్లు ప్రతిపాదించింది. 

మెయింటెనెన్స్​కు రూ.350 కోట్లు.. 

రాష్ట్రంలోని డ్యాములు, బ్యారేజీల మెయింటెనెన్స్​పై సర్కారు దృష్టి సారించింది. అందుకోసం రూ.350 కోట్లు కేటాయించింది. మేజర్, మైనర్ డ్యాములు, బ్యారేజీల మెయింటెనెన్స్​కోసం రూ.200 కోట్లు కేటాయించగా.. మైనర్ ఇరిగేషన్​లో భాగంగా కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల మెయింటెనెన్స్​కోసం రూ.150 కోట్లు ప్రతిపాదించింది. కృష్ణా, గోదావరి బోర్డులకూ కేటాయింపులు చేసింది. 

కృష్ణా బోర్డుకు రూ.11.75 కోట్లు, గోదావరి బోర్డుకు రూ.10 కోట్ల మేర బడ్జెట్​లో కేటాయించింది. ఇక మ్యాచింగ్​స్టేట్​షేర్​కింద దేవాదుల లిఫ్ట్​స్కీమ్​కు రూ.43.50 కోట్లు, శ్రీరాంసాగర్​స్టేజ్​2కి రూ.25 కోట్లు, రాజీవ్​భీమ లిఫ్ట్​స్కీమ్​కు రూ.32 కోట్లు కేటాయించింది. సెంట్రల్​స్పాన్సర్డ్​స్కీమ్స్​కింద దేవాదులకు రూ.14.50 కోట్లు, శ్రీరాంసాగర్​స్టేజ్​2కు రూ.9 కోట్లు, భీమాకు రూ.3 కోట్ల మేర కేటాయింపులు చేసింది. 

కాళేశ్వరానికి 1,676 కోట్లు.. 

గత సర్కార్ నిర్లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడికక్కడ దెబ్బతిన్నది. పంప్​హౌస్​లు మునిగిపోవడం, మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం వంటి వాటితో ప్రభుత్వంపై ఆర్థికంగా భారం పడుతున్నది. ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు కూడా బడ్జెట్ లో రూ.1,676.46 కోట్లు కేటాయించింది. గత సర్కార్ నిర్లక్ష్యం చేసిన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకూ రూ.200 కోట్ల మేర కేటాయింపులు చేసింది. 

బీఆర్ఎస్ హయాంలో​చిన్న కాళేశ్వరానికి గత బడ్జెట్​లో రూపాయి కూడా కేటాయించలేదు. ఇక మైనర్ ఇరిగేషన్​లో భాగంగా చెరువుల పునరుద్ధరణ, వరదల నియంత్రణకూ సర్కార్ ప్రాధాన్యం ఇచ్చింది. ఇందులో భాగంగా మిషన్​ కాకతీయకు రూ.273.45 కోట్లు కేటాయించింది. దీనికి నిరుటి బడ్జెట్​లో గత సర్కార్ రూ.82.21 కోట్లు మాత్రమే కేటాయించగా, ఈసారి బడ్జెట్ మూడింతలు పెంచారు.