- నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హుజూర్ నగర్, వెలుగు : పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం హుజూర్ నగర్ లోని రామస్వామిగుట్ట వద్ద నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క, రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ రూ.74.80 కోట్లతో 2,160 ఇందిరమ్మ ఇండ్ల నిర్మిస్తున్నామని తెలిపారు.
గతంలో తాను గృహనిర్మాణశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఇండ్ల సముదాయాలను బీఆర్ఎస్ పాలకులు డంపింగ్ యార్డుగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి తాను మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత నిధులు మంజూరు చేయించి ఇండ్ల నిర్మాణాలను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు.
డిసెంబర్ నాటికి ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యే అవకాశం ఉందని, అర్హులైనవారికి ఇండ్లు పంపిణీ చేస్తామని చెప్పారు. నాణ్యతతో ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అర్చనారవి, వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.