ఈడీ ముందుకు  ఐఏఎస్ అమోయ్ కుమార్..భూదాన్ భూవివాదంపై విచారణ

  • మహేశ్వరం మండలంలో 50 ఎకరాల భూ వ్యవహారం
  • ఏడు గంటల పాటు ప్రశ్నించిన అధికారులు
  • నేడు మళ్లీ విచారణకు రావాలని ఆదేశం

హైదరాబాద్‌‌, వెలుగు : బీఆర్‌‌‌‌ఎస్ హయాంలో జరిగిన భూ కేటాయింపుల కేసులో రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్‌‌‌‌ అమోయ్‌‌ కుమార్‌‌ బుధవారం‌‌ ఈడీ ముందు విచారణకు హాజయ్యారు. తన అడ్వొకేట్​తో కలిసి బషీర్‌‌‌‌బాగ్‌‌లోని ఈడీ ఆఫీస్​కు వెళ్లారు. 10.30 గంటల నుంచి సాయంత్రం ఐదున్నర దాకా ఈడీ జాయింట్‌‌ డైరెక్టర్ రోహిత్‌‌ ఆనంద్‌‌ నేతృత్వంలోని స్పెషల్ టీమ్ అమోయ్ కుమార్​ను విచారించింది. రంగారెడ్డి, మేడ్చల్‌‌ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో గతంలో జరిగిన భూ కేటాయింపులపై అధికారులు ఆరా తీశారు.

ప్రధానంగా మహేశ్వరం మండలం నాగారం గ్రామ పంచాయతీ పరిధిలోని 50 ఎకరాల భూదాన్‌‌ భూ వివాదం కేసుపై ప్రశ్నించారు. ల్యాండ్ రికార్డుల ఆధారంగా అమోయ్‌‌ కుమార్ స్టేట్‌‌మెంట్​ను రికార్డు చేశారు. ‌‌మళ్లీ గురువారం విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.

రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్​గా పని చేసిన అమోయ్​కుమార్

రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్‌‌‌‌గా పనిచేసిన టైమ్​లో అమోయ్‌‌ కుమార్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని సర్వే నంబర్ 181లో భూదాన్‌‌కు చెందిన 50 ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉంది. ఈ భూమికి వారసురాలినంటూ ఖాదురున్నీసా బేగం అనే మహిళ గతంలో సక్సేషన్‌‌కు దరఖాస్తు చేసుకున్నది. దీంతో 2021లో ఆమె పేరున వివాదాస్పద భూమి రిజిస్టర్ అయ్యింది.

ఆ తర్వాత ఆ భూమి ఈఐపీఎల్ కన్ స్ట్రక్షన్‌‌కు విక్రయించారు. ఈ మొత్తం వ్యవహారంపై దస్తగిరి షరీఫ్‌‌ అనే వ్యక్తి రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు గతేడాది మహేశ్వరం పోలీస్ స్టేషన్​లో మహేశ్వరం మండల మాజీ తహసీల్దార్, సబ్‌‌ రిజిస్ట్రార్ ఆర్పీ జ్యోతితో పాటు ఈఐపీఎల్ కన్ స్ట్రక్షన్ ఓనర్ కొండపల్లి శ్రీధర్ రెడ్డిపై కేసు నమోదైంది.

పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు  మారినట్లు ఆరోపణలు

ఈ వ్యవహారంలో తహసీల్దార్‌‌‌‌ సహా స్థానిక ప్రజా ప్రతినిధులకు పెద్ద మొత్తంలో డబ్బు ముట్టినట్లు తెలిసింది. మహేశ్వరం పీఎస్‌‌లో రిజిస్టర్ అయిన ఎఫ్‌‌ఐఆర్ ఆధారంగా విజిలెన్స్‌‌ అధికారులు దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే ఈడీ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ కేస్ ఇన్‌‌ఫర్మేషన్ రిపోర్ట్‌‌ ‌‌(ఈసీఐఆర్‌‌) రిజిస్టర్‌‌‌‌ చేసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అబ్దుల్లాపూర్​మెట్, ఇబ్రహీంపట్నం మండలాలతో పాటు శేరిలింగంపల్లి మండలం గోపన్ పల్లి

నానక్ రామ్‌‌గూడ్‌‌ ఔటర్ రింగు రోడ్డుకు ఆనుకొని 5 ఎకరాల ప్రభుత్వ స్థలం రెగ్యులరైజేషన్‌‌ విషయంలోనూ అక్రమాలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తున్నది. ఆయా కేసుల్లో పేర్కొన్న భూముల వివరాలను సేకరించింది. భూ కేటాయింపుల ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలు, కేటాయింపుల్లో జరిగిన అవకతవకలకు సంబంధించి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నది. వీటికి సంబంధించిన పూర్తి వివరాల‌‌ను అమోయ్‌‌ కుమార్‌‌ను అడిగి ఈడీ అధికారులు తెలుసుకున్నారు.