వైద్య విధాన పరిషత్ లో నిధుల గోల్​మాల్​

  • డిస్ట్రిక్ట్ రెసిడెన్సియల్ ప్రోగ్రామ్ పేరిట దోపిడీ
  • విజిలెన్స్ దాడులతో బయటపడ్డ ఉద్యోగి బాగోతం 
  • సూర్యాపేట కేంద్రంగానే అక్రమాలు  
  • డ్రాయింగ్ ఆఫీసర్ తోపాటు మరికొంతమందిపై అనుమానాలు 

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా వైద్య విధాన పరిషత్ లో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పీజీ కోర్సు చేసిన డాక్టర్లు ఏడాదిపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో  వైద్య సేవలందించాల్సి ఉండగా, డ్యూటీ చేయకుండానే రిజిస్టర్స్​లో అటెండెన్స్ వేస్తూ నిధులను పక్కదారి పట్టించారు. నాలుగేండ్ల నుంచి సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పెద్ద ఎత్తున ఈ వ్యవహారం జరుగుతోంది. 

డిస్ట్రిక్ట్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ పేరిట దోపిడీ..

పీజీ కోర్సు పూర్తి చేసిన అనంతరం రూల్స్ ప్రకారం సీనియర్ రెసిడెంట్ డాక్టర్ గా ఏడాదిపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. ఇందుకు నెలకు రూ.90 వేల వేతనం అందిస్తారు. ఏడాదిపాటు పని చేసిన తర్వాత సర్టిఫికెట్ కోసం డ్యూటీ చేసిన పీజీ డాక్టర్లు రిజిస్టర్, మాస్టర్, డ్యూటీ జాబ్ చార్ట్ సమర్పించాల్సి ఉంటుంది. కానీ డ్యూటీకి రాకుండా హైదరాబాద్ లో ప్రైవేట్ హాస్పిటల్స్​లో జాబ్ చేస్తూ  జిల్లా రెసిడెన్షియల్ ప్రోగ్రాం చేయకుండా ఇక్కడ పనిచేసినట్లు మాన్యువల్ అటెండెన్స్ సర్టిఫికెట్ పొందారు.

 ఇందుకు వారికి వచ్చే వేతనాన్ని డీసీహెచ్ఎస్ ఆఫీస్ లోని జూనియర్ అసిస్టెంట్ తన ఖాతాలోకి మళ్లించారు. ఇలా నాలుగేండ్ల నుంచి ఈ తతంగం నడుస్తుండగా ఇటీవల ఫిర్యాదులు రావడంతో స్టేట్ విజిలెన్స్ అధికారులు డీసీహెచ్ఎస్ ఆఫీస్ లోని ఆడిట్ నిర్వహించారు. నాలుగేండ్లలో దాదాపు రూ.80 లక్షలకు పైగా దారి మళ్లించినట్లు తేలింది. ఒక్క ఏడాదికి సంబంధించి ఆడిట్ చేయగా, వీటిలో రూ.13 లక్షలకు పైగా నిధులు దారి మళ్లించినట్లు ఆఫీసర్లు తేల్చారు. 

సూర్యాపేట కేంద్రంగానే అక్రమాలు..

సూర్యాపేట ఆఫీస్​లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ సుభద్రపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల నియామకపత్రాలు పొందిన ల్యాబ్ టెక్నీషియన్లు, స్టాఫ్ నర్స్ పోస్టులను జిల్లాలో కేటాయించే విషయంలో ఆమె భారీగా డబ్బులు వసూళ్లు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాకు కేటాయించిన 52 మంది మూమెంట్ ఆర్డర్లు, ఎంప్లాయ్ ఐడీతోపాటు పోస్టింగ్ కేటాయించడం కోసం భారీగా వసూళ్లు చేశారు. వీటితోపాటు కొంతమంది ఉద్యోగుల సరెండర్ లీవ్స్ కోసం అప్లయ్ చేసుకుంటే అవి మంజూరైన కూడా ఉద్యోగులకు తెలియకుండా ఆమె అకౌంట్ లోకి మళ్లించినట్లు తేల్చారు. 

ఈ వ్యవహారంలో డ్రాయింగ్ ఆఫీసర్ తోపాటు మరికొంతమంది సిబ్బందిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆడిట్ చేయకుండానే సదురు ఉద్యోగిని రూ.8 లక్షలు ముందస్తుగా చెల్లించేందుకు సిద్ధమైంది. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో ఇందుకు నిరాకరించారు. అయితే ఆడిట్ చేస్తారని తెలిసి రికార్డులను ఓవర్ రైట్ చేసి తప్పులు దాచేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 

ఇంతకుముందు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో పని చేసే సిబ్బంది నాలుగేండ్ల నుంచి డ్యూటీకి రాకున్న కూడా రిజిస్టర్ లో సంతకాలు పెట్టి మేనేజ్ చేశారు. ఇంత జరుగుతున్నా నేటికీ డ్రాయింగ్ ఆఫీసర్, సదరు జూనియర్ ఆఫీసర్ పై పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై అనుమానాలకు దారి తీస్తుంది.  

లక్షల్లో జీతాలు..

సూర్యాపేట డీసీహెచ్ఎస్ ఆఫీస్ లోనే కాకుండా కోదాడ, హుజూర్ నగర్, నకిరేకల్ ఏరియా ఆస్పత్రుల్లో సైతం ఇదే వ్యవహారం నడిచినట్లు సమాచారం. నకిరేకల్ ఏరియా ఆస్పత్రిలో కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉండగా, దీని వెనుక సూర్యాపేట డీసీహెచ్ఎస్ జూనియర్ అసిస్టెంట్ హస్తం ఉన్నట్లు తెలుస్తుంది. ఒక్కొక్క జూనియర్ అసిస్టెంట్ అకౌంట్ లో నెలకు రూ.లక్షల్లో జీతాలు పడుతున్నట్లు తెలిసింది. అన్ని ఆస్పత్రుల్లో పని చేసినవారి వివరాలను పరిశీలిస్తే మరికొన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయి. 

విచారణ చేస్తున్నాం..

సూర్యాపేట డీసీహెచ్ఎస్ ఆఫీస్ లో జరిగిన అక్రమాలపై విచారణ కొనసాగుతోంది. నాలుగేండ్ల నుంచి అక్రమాలు జరిగినట్లు తేలింది. వీటిలో ఒక్క ఏడాది ఆడిట్ చేస్తే రూ.13 లక్షలు పక్కదారి పట్టినట్లు తెలిసింది. మూడేండ్ల ఆడిట్ చేస్తే ఇంకా ఎన్ని అక్రమాలు జరిగాయో బయటపడతాయి. మొత్తం విచారణ పూర్తయిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – వెంకటేశ్వర్లు, డీసీహెచ్ఎస్, సూర్యాపేట