IRE vs SA 3rd ODI: సఫారీలకు ఏమైంది.. చివరి వన్డేలో ఐర్లాండ్‌పై ఓడిన దక్షిణాఫ్రికా

దక్షిణాఫ్రికా క్రికెట్ పతన స్థాయికి చేరుకుంటుంది. ఆ జట్టు పసికూనలపై ఓటమి పాలవుతుంది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు చేరి రన్నరప్ గా నిలిచిన దక్షిణాఫ్రికాకు ఆ తర్వాత ఏదీ కలిసి రావడం లేదు. ఆఫ్ఘనిస్తాన్ పై 1-2 తేడాతో వన్డే సిరీస్ ఓడిపోయారు. ఆ తర్వాత ఐర్లాండ్ పై టీ20 మ్యాచ్ లోనూ పరాజయం పాలయ్యారు. తాజాగా మూడు వన్డేల సిరీస్ లో ఐర్లాండ్ పై చివరి వన్డేలోనూ సఫారీలకు ఓటమి తప్పలేదు. సోమవారం (అక్టోబర్ 7) అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై ఐర్లాండ్ 69 పరుగుల భారీ విజయం సాధించింది. 

మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 284 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ స్టిర్లింగ్ 88 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అతను తొలి వికెట్ కు బాల్ బిర్నీ (45) తో కలిసి 101 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.  మిడిల్ ఆర్డర్ లో హ్యారీ టెక్టార్ 60 పరుగులు చేసి రాణించాడు. చివర్లో దక్షిణాఫ్రికా బౌలర్లు విజృంభించడంతో లోయర్ ఆర్డర్ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. లిజార్డ్ విలియమ్స్ 4 వికెట్లు పడగొట్టాడు. బార్ట్ మాన్,పెహ్లుక్వాయో తలో రెండు వికెట్లు తీశారు. 

285 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 215 పరుగులకు ఆలౌట్టయింది. ఐర్లాండ్ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో సఫారీలు ఏ దశలోనూ లక్ష్యం దిశగా వెళ్ళలేదు. 91 పరుగులు చేసి జేసన్ స్మిత్ ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ మ్యాచ్ ఓడిపోయినా దక్షిణాఫ్రికా 2-1 తేడాతో సిరీస్ గెలుచుకుంది. పాల్ స్టిర్లింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. లిజార్డ్ విలియమ్స్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.