ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ ​క్షిపణి వ్యవస్థ ధ్వంసం

  • టెహ్రాన్, దాని చుట్టుపక్కల ఎయిర్​ స్ట్రైక్​
  • పార్చిన్, ఖోజీర్​ మిలిటరీ బేస్​ల​లో దెబ్బతిన్న భవనాలు, కాంప్లెక్స్​లు
  • మిసైల్​ ప్రోగ్రామ్​కు కోలుకోలేని దెబ్బ

దుబాయ్: పశ్చిమాసియాలో ఉద్రిక్తత కొనసాగుతున్నది. అక్టోబర్​1న జరిగిన దాడికి ఇరాన్​పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడికి దిగిన విషయం తెలిసిందే. టెహ్రాన్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా ఎయిర్​స్ట్రైక్స్​తో ఇజ్రాయెల్​ విరుచుకుపడింది. శనివారం తెల్లవారుజాము నుంచి  దాదాపు 100 ఫైటర్​జెట్స్​తో మిసైల్, డ్రోన్​ ఫెసిలిటీ సెంటర్లపై దాడికి దిగగా, ఇరాన్​కు కోలుకోలేని దెబ్బ తగిలింది. టెహ్రాన్​కు ఆగ్నేయాన ఉన్న రహస్య సైనిక స్థావరంలోని ఫెసిలిటీస్ ​దెబ్బతిన్నట్టు శాటిలైట్​ చిత్రాల్లో కనిపించింది. 

అలాగే, పర్చిన్​ మిలిటరీ బేస్​లో బిల్డింగ్​లు ధ్వంసమైనట్టు ఉప గ్రహ చిత్రాలను విశ్లేషించిన  యూఎన్​ నిపుణులు పేర్కొన్నారు.  ఇక్కడే గతంలో ఇరాన్​ అణ్వాయుధ పరీక్షలు నిర్వహించినట్టు ఇంటర్నేషనల్​ అటామిక్  ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) భావిస్తున్నది. 

అలాగే, ఇజ్రాయెల్​ దాడితో ఖోజీర్​ మిలిటరీ బేస్​సమీపంలోనూ భారీ విధ్వంసం సంభవించినట్టు తెలుస్తున్నది. ఇక్కడ బాలిస్టిక్​ మిసైల్​ కాంప్లెక్సులు దెబ్బతిన్నట్టు నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఇరాన్​క్షిపణి తయారీ సామర్థ్యంపై భారీ దెబ్బపడినట్టు చెబుతున్నారు.  ఈ దాడితో ఇలాం, ఖుజెస్తాన్,  టెహ్రాన్ ప్రావిన్స్​లు ఎక్కువగా ప్రభావితమైనట్టు అధికారులు గుర్తించారు. ఇలాం ప్రావిన్స్​లోని టాంగే బిజర్​ నేచురల్​ గ్యాస్​ ప్రొడక్షన్​ సైట్​చుట్టూ పంట క్షేత్రాలు కాలిపోయినట్టు కనిపించాయి.

స్పందించని ఇరాన్​, ఇజ్రాయెల్​

పార్చిన్, ఖోజీర్​లో జరిగిన నష్టాన్ని ఇరాన్ మిలిటరీ​ ధ్రువీకరించలేదు. ఎయిర్​ డిఫెన్స్​ సిస్టమ్​లో పనిచేస్తున్న  నలుగురు సైనికులు మృతిచెందినట్టు తెలిపింది. అదే సమయంలో ఈ విధ్వంసంపై  యునైటెడ్ నేషన్స్​ఇరాన్​ మిషన్​గానీ, ఇజ్రాయెల్​ మిలిటరీగానీ స్పందించలేదు. ఇరాన్ చమురు పరిశ్రమ, అణువిద్యుత్​ ప్లాంట్లపై ఇజ్రాయెల్ దాడి చేయలేదు. 

మా లక్ష్యాలన్నీ సాధించాం: నెతన్యాహు

ఇరాన్​పై జరిపిన దాడితో తమ లక్ష్యాలన్నీ సాధించామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. ‘‘ఇరాన్ ​దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని మేం ప్రతిజ్ఞ చేశాం. అందులో భాగంగానే శనివారం దాడి చేశాం. అత్యంత కచ్చితత్వం, శక్తివంతమైన దాడులతో మా లక్ష్యాలన్నీ సాధించాం”  అని తెలిపారు.