ప్రత్యక్ష సాక్షులు లేరు.. దోషులు లేరు!

 

  • టెక్నికల్​ ఎవిడెన్స్​తోనే కేసు దర్యాప్తు
  • ఎస్సై, మహిళా కానిస్టేబుల్, యువకుడి మృతి కేసులో కొనసాగుతున్న సస్పెన్స్

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో చెరువులో పడి చనిపోయిన ఎస్సై, మహిళా కానిస్టేబుల్, మరో యువకుడి మృతి కేసు దర్యాప్తు పోలీస్​ శాఖకు సవాల్​గా మారింది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు,  దోషులు ఎవరు లేరు.  కేసు దర్యాప్తు ముందుకెళ్లేందుకు టెక్నికల్  ఎవిడెన్స్​ కీలకం కానుంది. ఈ నెల 25న సదాశివనగర్​ మండలం అడ్లూర్​ ఎల్లారెడ్డి చెరువులో భిక్కనూరు ఎస్సై సాయికుమార్, బీబీపేట స్టేషన్​లో పని చేసే మహిళా కానిస్టేబుల్​ శృతి, కంప్యూటర్​ ఆపరేటర్​ తోట నిఖిల్​ చనిపోయారు. ముగ్గురు చెరువులో మునిగి చనిపోగా, చెరువు వద్ద ఏం జరిగిందనే విషయం చెప్పేందుకు ఎలాంటి ఆధారం లేదు.

ఫోరెనిక్స్​ ల్యాబ్, పోస్టుమార్టం రిపోర్ట్, సెల్​ఫోన్లకు సంబంధించి టెక్నికల్  ఎవిడెన్స్​తోనే  కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ముగ్గురికి సంబంధించిన 5 సెల్​ఫోన్లను సీజ్​ చేసి ఫోరెనిక్స్​ ల్యాబ్​కు పంపారు. పోస్టుమార్టంకు సంబంధించిన ఫైనల్​ రిపోర్టు కోసం ల్యాబ్​కు నమూనాలు పంపించారు. ఈ రిపోర్ట్​లు వచ్చేందుకు కొంత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. వీరి బాడీలో ఉన్న నీళ్లు, చెరువులోని నీళ్లు ఒకటేనా? కాదా? అని తేల్చేందుకు నీటి శాంపిల్స్​ సేకరించి టెస్టింగ్​కు పంపారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఈ ముగ్గురి మృతికి సంబంధించి కేసు దర్యాప్తులో టెక్నికల్​ ఎవిడెన్స్​ కీలకం కానుంది.

గంటల తరబడి ఫోన్​ సంభాషణలు

ముగ్గురు వ్యక్తులు ఈ నెల 25న చెరువులో పడి చనిపోవడానికి వారం రోజుల ముందు నుంచి వీరు గంటల తరబడి సెల్​ఫోన్లలో మాట్లాడినట్లు తెలుస్తోంది. ముగ్గురు వ్యక్తుల మధ్య వివాదాలకు సంబంధించిన ఆంశాలపై వీరు మాట్లాడుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం కాల్​ డేటాను విశ్లేషిస్తున్నారు.