వనపర్తిలో హైడ్రా బుగులు

  • జిల్లాలో  గతంలో గుర్తించిన ఆక్రమణదారుల్లో దడ 

వనపర్తి, వెలుగు : చెరువులు, కుంటలు, వాగుల్లో అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటిని కూలదోస్తున్న నేపథ్యంలో వనపర్తిలో ఆక్రమణదారులకు హైడ్రా బుగులు పట్టుకుంది. ఒక్క జిల్లా కేంద్రంలోనే మూడు చెరువుల పరిధిలో గతంలో రియల్​ ఎస్టేట్​ వ్యాపారులు వెంచర్లు వేసి ప్లాట్లు విక్రయించారు. జిల్లాలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్​ కాలువ ద్వారా చెరువులు నింపుతుండడంతో చాలా ఏళ్ల తరువాత చెరువులు, కుంటలు నిండుగా మారుతున్నాయి.  నిరుడు కురిసిన వర్షానికి జిల్లా కేంద్రంలోని నల్వచెరువు, ఈదుల చెరువు, తాళ్లచెరువు, మర్రికుంట చెరువులు నీటితో నిండి పోయాయి. 

వాటి ఎఫ్​టీఎల్​, బఫర్​జోన్​ పరిధిలో నిర్మించిన ఇళ్లు, ప్లాట్లు మునిగిపోయాయి. ముఖ్యంగా నల్లచెరువును మినీ ట్యాంక్​ బండ్​గా మార్చారు.  పెబ్బేరు రోడ్డులోని మర్రకుంట చెరువు, తాళ్లచెరువులను అభివృద్ధి చేయడానికి మాజీ మంత్రి చొరవ చూపారు. ఆయన ఆదేశాల మేరకు మర్రికుంట చెరువు లోపల, వెలుపల నీటిపారుదల అధికారులు సర్వే నిర్వహించారు.  

చెరువు మొత్తం17 ఎకరాలలో ఉండగా ఎఫ్టీఎల్ పరిధిలో అయిదు ఇళ్లు, బఫర్​ జోన్​ పరిధిలో అయిదు ఇళ్లు నిర్మించారని ఇరిగేషన్​ ఇంజినీర్లు గుర్తించారు. ఎవరైతే ఇళ్లు నిర్మించారో వాటిని వెంటనే తొలగించాలంటూ ఇరిగేషన్​ అధికారులు నోటీసులూ ఇచ్చారు. ఏయే ఇళ్లు అక్రమంగా నిర్మించారో వాటి ఇంటి నంబర్లతో సహా నోటీసులిచ్చారు. చెరువు పరిధిలో వెంచర్లు వేసిన వారి నుంచే తాము ప్లాట్లు కొని ఇళ్లు నిర్మించుకున్నామని, ఇప్పుడు ఆక్రమణ అంటే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. వెంచర్​ వారి నుంచి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 

 2023, ఫిబ్రవరిలో మర్రికుంట చెరువు అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఎఫ్​టీఎల్​, బఫర్​ జోన్​ల పరిధిలో ఉన్న ప్లాట్లనూ చదును చేసి అభివృద్ధి పనులు చేపట్టారు.  చెరువు కట్టను విశాలం చేయడంలో భాగంగా చెరువులోని పూడిక తీత, ఇతర పిచ్చి చెట్లను తొలగించారు. కట్టమీద పార్కును ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ఆ దిశగా ఇప్పుడు ప్రయత్నాలు జరిగే 
అవకాశం ఉంది. 

 హైడ్రాతో ఆందోళన

ప్రస్తుతం హైడ్రా తెరపైకి రావడంతో చెరువుల పరిధిలో ప్లాట్లు కొన్న వారు ఆందోళనకు లోనవుతున్నారు. జిల్లా కేంద్రంలోని నల్లచెరువు ఎఫ్​టీఎల్​, బఫర్​ జోన్​ పరిధిలోనే కొన్ని వందల ప్లాట్లు విక్రయించినట్లుగా ఇరిగేషన్​ ఆఫీసర్లు గుర్తించారు. ప్రస్తుతం వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాళ్ల చెరువు వద్ద, మర్రికుంట చెరువు పరిధిలో అక్రమంగా వేసిన వెంచర్ల నుంచి ప్లాట్లు కొన్నవారున్నారు. గతంలో గుర్తించిన నిర్మాణాలను కూల్చకుండా ఎలాగోలా చూసుకోగలిన వారు ఇప్పుడు హైడ్రా వనపర్తి జిల్లాకు వస్తే తమ పరిస్థితి ఏమిటని తలలు పట్టుకుంటున్నారు.