పరిచయం : బాధ్యతలు చూపిన దారి యాక్టింగ్​

‘‘సక్సెస్​కి ఒక మంత్రం అనేదేమీ ఉండదు అంటాను నేను. ఎందుకంటే ఆడిషన్స్​కి వెళ్లినప్పుడు రిజెక్షన్స్ ఫేస్ చేశాను. అవి పదుల సంఖ్యలో కాదు.. వందల్లో. అయినా నేనెప్పుడూ ఒకేలా ఉన్నా. కంటిన్యూగా హార్డ్​ వర్క్​ చేస్తూనే ఉన్నా” అంటోంది ‘‘షో టైం” వెబ్​ సిరీస్​ నటి ‘మహిమ మక్వానా.  పాతికేండ్ల ఈ అమ్మాయి మాటల్లో ఇంత మెచ్యూరిటీ కనిపించడం వెనక ఎన్నో కారణాలు ఉన్నాయి. మహిమ బాల్యంలో మిగతా పిల్లల్లా స్కూల్​కి వెళ్లి, సరదాగా ఫ్రెండ్స్​తో ఆడుకోలేదు. కానీ, పదేండ్లకే ఇంటి బాధ్యతను భుజాన వేసుకుని ఒక వైపు చదువుతూనే, మరోవైపు యాక్టింగ్​ చేస్తూ ఫ్యామిలీకి అండగా నిలిచింది. పద్నాలుగేండ్లకే సొంత ఇల్లు, కారు కొనేసింది. అలా మహిమ జీవితం​లో స్ఫూర్తినిచ్చే మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే... 

‘‘మాది ముంబై. చదువుకున్నా... కానీ, రోజూ స్కూల్​కి వెళ్లలేదు. ఎగ్జామ్స్ మాత్రమే రాశా. అందుకే అప్పుడప్పుడు స్కూల్​కి వెళ్లి చదువుకుని, ఫ్రెండ్స్​తో ఆడుకోవాలి అనిపించేది. ఆ విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా నా లైఫ్​లో గోల్డెన్​ డేస్ మిస్‌ అయ్యా అనిపించేది. నా ఐదేండ్ల వయసులో మా నాన్న చనిపోయాడు. అప్పుడు మా అన్నకి తొమ్మిదేండ్లు. మా ఇద్దర్నీ పెంచడానికి మా అమ్మ చాలా కష్టపడింది. అమ్మ సోషల్ వర్కర్​. ఒకవైపు అన్నయ్యని చదివిస్తూ ఇంటిని చూసుకునేది. అమ్మకి యాక్టింగ్​ అంటే చాలా ఇష్టం. అందుకని నన్ను యాక్టర్​ని చేయాలి అనేది అమ్మ కోరిక. అందుకని నా చిన్నప్పటి నుంచే నన్ను ఆడిషన్స్​కి తీసుకెళ్లేది. అలా నేను తొమ్మిదేండ్లకే ఆడిషన్స్​ ఇవ్వడం మొదలుపెట్టా. ఆ వయసు​లో నేను అందరిలా స్కూల్​కి వెళ్లకుండా అమ్మతో కలిసి బస్సుల్లో వెళ్లి ​ ఆడిషన్స్​ చేసేదాన్ని. 

అప్పుడసలు అదంతా ఎందుకు చేయాలో? ఆ ప్రపంచం ఏంటనేది అర్థం చేసుకునే వయసు కాదు అది. అందుకే కాబోలు అమ్మతో ‘నేను ఇది చేయను’ అని చాలాసార్లు చెప్పా. అప్పుడు అమ్మ నాతో ఒక మాట చెప్పింది... ‘నాకేమైనా కాకముందే నువ్వు ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలి’ అని. ఆ మాట నా మైండ్​లో చాలా బలంగా నాటుకుపోయింది. నా కుటుంబం కోసం నేనేం చేయగలనో అది చేసి తీరాలి. అది కూడా నా ఇష్టంతోనే చేస్తున్నా కదా అనిపించింది. 

అందుకే ఇప్పుడు నాకు ఎలాంటి రిగ్రెట్స్ లేవు. ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి నేను చేసిన కొన్ని త్యాగాల ఫలితమే. యాక్టింగ్ చేసి సంపాదించిన డబ్బుతో ఒక ఇల్లు, కారు కొన్నా. అవి కొనేటప్పటికి నా వయసు పద్నాలుగేండ్లు. ఆ వయసులో నేను ఆ స్థాయిలో ఉన్నానంటే కారణం మా అమ్మ. అప్పట్లో సక్సెస్ వచ్చాక కూడా నాది చిన్న ప్రపంచమే. మేం కష్టాల్లో ఉన్నప్పుడు మా చుట్టూ ఉన్నవాళ్లెవరూ మాకు సపోర్ట్ చేయలేదు. అప్పుడు నా ఫ్యామిలీకి సపోర్ట్​ చేసేందుకు యాక్టింగ్ చేశా. ఇప్పుడు మాత్రం ఒక ప్యాషన్​తో చేస్తున్నా. 

‘బాలికా వధు’తో బిగ్ బ్రేక్​!

నాకు పదేండ్ల వయసులో ‘బాలికా వధు’ (చిన్నారి పెళ్లికూతురు)లో నటించా. షూటింగ్​లో మూడో రోజు నాకు ఒక మోనొలాగ్​ డైలాగ్​ ఇచ్చారు. నేను అప్పుడప్పుడే జూనియర్ ఆర్టిస్ట్​ నుంచి యాక్టర్​ అయ్యా. ఒకరకంగా చెప్పాలంటే యాక్టింగ్​లో మొదటి స్టేజ్​లో ఉన్నా. దానివల్ల నేను చాలా భయపడ్డా. ‘‘ఇవాళ పూర్తి డైలాగ్ చెప్పలేను. సగం రేపు చెప్తా’’ అని చెప్పా. అప్పుడు కో–ఆర్డినేటర్​ వచ్చి ‘‘నీ యాక్టింగ్​కి పది రూపాయలు ఇస్తారు. 

జూనియర్​ ఆర్టిస్ట్​గా ఉంటే రెండు రూపాయలే ఇస్తారు’’ అన్నారు. అక్కడున్న పెద్ద యాక్టర్స్ అందరూ నా షాట్​ కోసం ఎదురుచూస్తున్నారు. నేను ఎంతకీ వెళ్లకపోవడంతో డైరెక్టర్ నా దగ్గరకి వచ్చి ‘‘యాక్టింగ్​ చేయనప్పుడు. ఏం చేయడానికి ఇక్కడికి వచ్చావ్​?’’ అన్నారు. అందరూ నన్నలా అంటుంటే చాలా బాధగా అనిపించింది. ఇంటికెళ్లి ఏడ్చాను. కష్టపడి పూర్తి డైలాగ్​ నేర్చుకున్నా. అలా నా కెరీర్​లో మొదటి బ్రేక్ ‘బాలికా వధు’తో వచ్చింది. 

‘శుభారంభ్​’ నుంచి ‘అంతిమ్​’ వరకు

‘శుభారంభ్​’ అనే సీరియల్ లో 2019లో చేశా. ఆ సీరియల్​ ప్రమోషన్స్ కోసం బిగ్​బాస్​ షోకి రెండు మూడుసార్లు వెళ్లా. ఆ తర్వాత ప్రొడక్షన్ నుంచి ‘‘సల్మాన్​ ఖాన్​ సినిమాలో ఒక క్యారెక్టర్​ ఉంది. ఆ పాత్ర కోసం నువ్వు ఒకసారి డైరెక్టర్​ని కలిస్తే బాగుంటుంది’’ అని ఫోన్​ కాల్ వచ్చింది. ఆ టైంలో ‘శుభారంభ్’​ ప్యాచ్​వర్క్ జరుగుతోంది. సరిగ్గా ఆ టైంలోనే మా అన్న కొవిడ్​తో ఇబ్బంది పడుతున్నాడు. దాంతో అప్పుడు నేను చాలా బిజీగా ఉన్నా. 

అప్పుడు ఈ ఫోన్​ రావడంతో ‘‘ఇప్పుడు నేను కొత్త ప్రాజెక్ట్ చేసే సిచ్యుయేషన్​లో లేను. తర్వాత చెప్తా’’ అని వాళ్లకు చెప్పా. ఆ తర్వాత ఒక మీటింగ్​ పెడితే అక్కడ అందరం కలిశాం. అప్పుడు ఆడిషన్​ ఇస్తే వెంటనే ‘‘నువ్వు ఈ సినిమాలో నటించబోతున్నావ్​’’ అని చెప్పారు డైరెక్టర్ మహేశ్ మంజ్రేకర్. ఆ మాట విని నేను షాక్​ అయ్యా. ఎందుకంత షాక్​ అయ్యానంటే ‘శుభారంభ్’​కి ముందు కూడా నేను సినిమాల కోసం కొన్ని పదుల ఆడిషన్స్​ ఇచ్చా. కానీ, ఒక్కటి కూడా వర్కవుట్​ కాలేదు. అందుకే ఆ షాక్​ అన్నమాట. 
చాలామంది ‘‘వరుసగా సీరియల్స్ చేస్తున్నావ్.  

మంచి పేరు తెచ్చుకున్నావ్​. ఇంక సినిమాలు ఎందుకు? ఇవే చేసుకోవచ్చు కదా’’ అని సలహా ఇచ్చేవాళ్లు. కానీ ‘‘రిస్క్​ చేయకపోతే లైఫ్​ చాలా బోర్​ కొడుతుంది’’ అనిపిస్తుంది. అందుకే నేను టెలివిజన్​ షోలు చేస్తున్నప్పటికీ అడ్వర్టైజ్​మెంట్స్​, సినిమాల​కి ఆడిషన్స్ ఇచ్చా. దానివల్ల నేను సీరియల్​కి ఎలా నటించాలి? సినిమాకి ఎలా నటించాలి? అనేవి నేర్చుకోగలిగా. నేర్చుకునే ఆ ప్రాసెస్ నాకు ఛాలెంజింగ్​గా అనిపించింది. 

ఒక యాక్టర్​గా ఆ ఛాలెంజెస్​ ఫేస్ చేయాలి. ఇక ‘అంతిమ్​’ విషయానికొస్తే సల్మాన్​ ఖాన్​తో స్క్రీన్ షేర్ చేసుకోవడం మర్చిపోలేను. అలాంటి మూవీ టీంతో మళ్లీ ఎప్పుడు కలిసి పనిచేస్తానా? అని ఎదురుచూస్తున్నా. ఆ సినిమాలో నన్ను తీసుకున్నప్పుడు సల్మాన్​ ఖాన్​ ఒక మాట అన్నారు నాతో ‘‘నీ లైఫ్​లో న్యూ బిగినింగ్స్ స్టార్ట్ అయ్యాయి” అని. అది నిజమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. 

నేను చైల్డ్ లేబర్ ను కాదు

నా చుట్టూ ఉన్న సిచ్యుయేషన్స్ నన్ను యాక్టింగ్​లోకి తీసుకొచ్చాయి. కానీ ఇప్పుడు అది నాకు ప్యాషన్​గా మారింది. చాలామంది నా బ్యాక్​ స్టోరీ తెలిసి నన్ను ‘చైల్డ్ లేబర్’ అంటారు. అది కరెక్ట్ కాదు. నా ఫ్యామిలీకి సపోర్ట్ చేయడానికి పనిచేయడంలో తప్పేముంది? నా చిన్నప్పుడు మా నాన్న చనిపోయారు. నాన్న ఒక్కడిమీదే ఇంటి బాధ్యత ఉండేది. అలాంటిది నాన్న లేకుండా ఒక ఫ్యామిలీ బతకడం ఎంత కష్టమో నాకు తెలుసు. అదీకాక మా అమ్మ పెద్దగా చదువుకోలేదు. కాబట్టి ఫ్యామిలీని చూసుకోవాలంటే ఇంట్లో ఎవరో ఒకరు సపోర్ట్​ చేయాల్సిందే.’’
- ప్రజ్ఞ

‘షో టైం’కి.. రెడీగా ఉండాలి

వెబ్​ సిరీస్​లో చేయడమంటే ప్రతిరోజు సవాలే. షూటింగ్​కి ఎప్పుడైనా రెడీగా ఉండాలి. రోజులో మొత్తం ఏడు సీన్లు తీస్తారు. వాటికి ప్రిపేర్​ అయ్యే టైం కూడా ఉండదు. పైగా నా పాత్ర ప్రతి సీన్​లో ఉంటుంది. అలాగే షో సిరీస్​లో నాది ఇంపార్టెంట్​ రోల్. కాబట్టి నాపై ఒక బాధ్యత ఉందని ఫీలయ్యా.  

తెలుగులో..

హిందీలో నాకు బ్రేక్ వచ్చాక దక్షిణాది నుంచి చాలా ఆఫర్లు వచ్చాయి. అయితే, తెలుగులో ‘వెంకటాపురం’ అనే సినిమా ఆఫర్ నాకు చాలా నచ్చింది. దాంతో వెంటనే ‘ఓకే’ చెప్పా. ఆ తర్వాత మంచు విష్ణు, కాజల్ నటించిన ‘మోసగాళ్లు’ సినిమాలో ఒక క్యారెక్టర్ చేశా. స్క్రిప్ట్స్ నచ్చితే తెలుగులో ఇక మీదట నటిస్తా.

సీరియల్ యాక్టరే కదా అనేవాళ్లు

 ‘అంతిమ్’​కి ముందువరకు నేను హిందీ సీరియల్స్​, తెలుగు సినిమాల్లో చేశా. నేను ఎంచుకునే ప్రాజెక్ట్స్​ కేవలం నా కెరీర్​ గ్రోత్ కోసమే కాదు. నా వెనక ఒక ఫ్యామిలీ ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు ఎందులో ఎంత సంపాదన? అనేది కూడా చూడాలి. కాబట్టి కంటిన్యూగా పనిచేస్తుండాలి. ఎప్పుడూ నిరాశపడకూడదు. 

-    మేరీ ఇమ్మాక్యులేట్ గర్ల్స్ హై స్కూల్లో చదివా. తర్వాత ముంబైలోని ఠాకూర్ కాలేజ్​ ఆఫ్​ సైన్స్​ అండ్ కామర్స్​లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశా. 
    2012లో ‘సప్నే సుహానే లడక్​పన్ కె’ సీరియల్​తో గుర్తింపు వచ్చింది. అప్పటికి నా వయసు పదమూడేండ్లు. 
    ఒకప్పుడు నా చుట్టూ ఉండేవాళ్లతో కనెక్ట్​ కాలేకపోయా. ఎందుకంటే ఇతరులతో ఎలా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? అనేది తెలిసేది కాదు. ఇప్పుడు అలా కాదు. 
    2019లో ‘టేక్​ 2’ అనే షార్ట్​ ఫిల్మ్​లో నటించా. ఆ ఏడాది నుంచి వరుసగా 2‌022 వరకు మ్యూజిక్​ వీడియోల్లో కూడా చేశా.