ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి సరదాగా ఓ బోట్‌లో వెళ్తూ ఫిషింగ్ చేస్తున్నారు. సడెన్‌గా వాళ్లలో ఒకరికి ఐడియా వచ్చింది. అది వాళ్ల జీవితాలనే కాదు.. ప్రపంచంలో పాదరక్షల ఫ్యాషన్ ట్రెండ్‌నే మార్చేసింది. అదే ‘క్రాక్స్ షూ’ ఐడియా. నిజానికి ఇవి ముదురు రంగుల్లో ఉండి, చూడ్డానికి అంత బాగా అనిపించవు. కానీ.. వాటి క్వాలిటీ, ప్రయోజనాల వల్ల ప్రపంచమంతా పాపులర్ అయ్యాయి. ధర ఎక్కువైనా వాటి మన్నిక వల్ల మధ్య తరగతి ప్రజలకు కూడా దగ్గరై ఐకానిక్ షూగా పేరు తెచ్చుకున్నాయి.
ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఒక ట్రెండ్ వస్తూనే ఉంటుంది. వాటన్నింటికీ ఒక చిన్న ఐడియానే కారణమవుతుంది. అలాగే 2000వ దశకం మొదట్లో స్కాట్ సీమన్స్, లిండన్ డ్యూక్ హాన్సన్, జార్జ్ బొడెకెర్ జూనియర్‌లకు వచ్చిన ఒక ఆలోచన ఫ్యాషన్ మార్కెట్‌ను పూర్తిగా మార్చేసింది. ఈ ముగ్గురూ సముద్రంలో బోట్ షికారుకు వెళ్లినప్పుడు స్కాట్ సీమన్స్ మిగతా ఇద్దరికీ కెనడియన్ కంపెనీ ‘ఫోమ్ క్రియేషన్స్’ తయారుచేసిన ఒక బోట్ షూని చూపించాడు.
అవి చూడ్డానికి అస్సలంటే అస్సలు బాగా లేవు. కానీ.. వేసుకుంటే చాలా కంఫర్ట్‌గా అనిపించాయి. కంఫర్ట్‌గా అయితే ఉన్నాయి కానీ పదే పదే కాలు నుంచి ఊడిపోతున్నాయి. ఆ షూని రబ్బరు, ప్లాస్టిక్‌తో కాకుండా క్రాస్లైట్ అనే ఒక ప్రత్యేకమైన పదార్థంతో తయారుచేశారు. అది చాలా తేలికగా ఉంటుంది. సౌకర్యంగా ఉంటుంది. బోటింగ్ చేసేవాళ్లకు సూటవుతుంది. డిజైన్ కొంచెం మారిస్తే రోడ్డు మీద నడిచేందుకు కూడా బాగుంటుంది. అందుకే ఆ మెటీరియల్‌తో షూ తయారుచేసి అమెరికాలో అమ్మాలి అనుకున్నారు. అందుకోసం గవర్నమెంట్ నుంచి క్రాస్లైట్ మెటీరియల్‌తో బూట్లు తయారుచేసే రైట్స్ కూడా తీసుకున్నారు.
మొట్టమొదటి క్రాక్స్
ఈ ముగ్గురు కలిసి 2002లో క్రాక్స్ షూ కంపెనీ పెట్టారు. ఫోమ్ క్రియేషన్స్ తయారుచేసిన షూకి వెనుక భాగంలో స్ట్రాప్ ఉండదు. కానీ.. వీళ్లు ఆ డిజైన్‌ని ఫోమ్ క్రియేషన్స్ నుంచి కొని, కొన్ని మార్పులు చేశారు. షూ కాలి నుంచి ఊడిపోకుండా ఒక స్ట్రాప్ పెట్టారు. ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్‌డేల్ బోట్ షోలో క్రాక్స్ మొదటి మోడల్ ‘ది బీచ్’ను రిలీజ్ చేశారు. కానీ.. వాటిని కొనడానికి ఎవరూ ఇష్టపడలేదు. దాంతో.. ‘‘మా షూ ఒక్కసారి తొడిగి చూడండి. మీకు నచ్చకపోతే.. వెంటనే సముద్రంలోకి విసిరేయండి’’ అంటూ పబ్లిసిటీ చేశారు. అంత గట్టిగా చెప్పారంటే ఆ డిజైన్ మీద వాళ్లకు ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. అది చూసి చాలామంది వాటిని వేసుకుని ట్రై చేశారు. వాళ్లలో ఎక్కువమంది షూ కొన్నారు. అలా మొదటి రోజే 200 జతల క్రాక్స్ సేల్ అయ్యాయి. ఆ తర్వాత వాటి కంఫర్ట్ గురించి ఆ నోటా ఈ నోటా ఆ ఏరియా అంతటా తెలిసి సేల్స్ బాగా పెరిగాయి.
ఆడవాళ్ల కోసం..
మొదటి డిజైన్‌ని ఎక్కువగా మగవాళ్లే కొన్నారు. అది గమనించిన కంపెనీ యాజమాన్యం 2003లో ఆడవాళ్ల కోసం ప్రత్యేకంగా ‘ది నైలు’ పేరుతో ఒక మోడల్ తీసుకొచ్చింది. ఆ తర్వాత క్రాక్స్‌కు డిమాండ్ పెరగడంతో జనాల్లోకి మరింతగా వెళ్లేందుకు రీబ్రాండింగ్ చేసింది. 2005లో ‘క్రాక్స్’ లోగో మార్చారు. ‘‘అగ్లీ కెన్ బి బ్యూటిఫుల్” అని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం మొదలైంది. 2006 నాటికి కంపెనీ లాభాలు పెరిగాయి.
దాంతో బూట్ల కోసం ఫన్ యాక్ససరీస్ తయారు చేసే ‘జిబిట్జ్’ అనే కంపెనీని క్రాక్స్ కొనేసింది. ఈ కంపెనీలో తయారుచేసే ప్రొడక్ట్స్‌తో క్రాక్స్‌ని కస్టమైజ్ చేసుకోవడం చాలా తేలికైపోయింది. క్రాక్స్‌కి డిమాండ్ మళ్లీ పెరిగింది. ఆ తర్వాత కంపెనీ ఐపీవోలో లిస్ట్ అయింది. దాంతో కంపెనీ విలువ మరింత పెరిగింది. అయితే... 2007లో అంచనా వేసినంత లాభాలు రాలేదు. స్టాక్ వ్యాల్యూ తగ్గడం మొదలైంది. దానివల్ల కంపెనీ చాలా ఆర్థికపరమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది.
సంక్షోభం
2007–2008 ఆర్థిక సంక్షోభం వల్ల కంపెనీకి చాలావరకు నష్టాలు వచ్చాయి. 2008 ఏప్రిల్14న మొదటి త్రైమాసికంలో కంపెనీ ఆదాయ అంచనాలు బాగా తగ్గాయని ప్రెస్ నోట్ విడుదల చేసింది. దాంతో కంపెనీ స్టాక్ వ్యాల్యూ కొన్ని గంటల్లోనే 30 శాతం వరకు పడిపోయింది. అదే ప్రకటనలో రిటైలర్లు ఆర్డర్స్ తగ్గిస్తున్నందున 600 మంది ఉద్యోగులను తీసేస్తామని చెప్పారు. దాంతో కంపెనీ మూతపడుతుంది అనుకున్నారంతా. రిటైల్ మార్కెట్‌లో అమ్మకాలు విపరీతంగా తగ్గాయి. ఆ నష్టాలు కొన్నేళ్లు కొనసాగాయి.
2010 జులై 21న మరికొంత మంది ఉద్యోగులను తొలగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 624 స్టోర్లలో 75 నుండి 100 వరకు మూసేశారు. నష్టాల నుంచి బయటపడేందుకు యాజమాన్యం చాలా చర్యలు తీసుకుంది. ముఖ్యంగా స్కిల్స్ లేని స్టాఫ్‌ని తొలగించింది. అయినా.. ఫలితం లేకుండా పోయింది. 2011 అక్టోబరు18న తగ్గిన ఆదాయం వల్ల ఒక్కరోజులోనే ‘క్రాక్స్ స్టాక్స్ వ్యాల్యూ’ దాదాపు 39.4 శాతం పడిపోయింది. 2013 జూన్‌లో గత ఏడాది కంటే 42.5 శాతం తక్కువ లాభాలు వచ్చాయి.
మళ్లీ షేర్ వ్యాల్యూ 20.2 శాతం పడిపోయింది. కానీ.. నష్టాల నుంచి తప్పించుకోవడానికి కంపెనీ తీసుకున్న నిర్ణయాల వల్ల మళ్లీ లాభాలు పుంజుకున్నాయి. 2017 నాటికి 300 మిలియన్ జతల బూట్లు అమ్మింది. అయినా.. నష్టాలను తగ్గించుకునేందుకు 2018 ఆగస్టులో మెక్సికో, ఇటలీల్లోని కంపెనీ ఆపరేటెడ్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్స్‌ని మూసేశారు. ఖర్చులు తగ్గడంతో అప్పటినుంచి కంపెనీ మళ్లీ లాభాల బాట పట్టింది.
కరోనా వల్ల...
కంపెనీ అప్పుడప్పుడే లాభాలు సాధిస్తున్న టైంలో కరోనా వచ్చింది. దాంతో ఇక కంపెనీ మూసేసే పరిస్థితి ఎదురవుతుంది అనుకున్నారు. కానీ.. పరిస్థితి తారుమారైంది. కరోనా వల్ల అందరికీ నష్టాలు మిగిలితే.. ఈ కంపెనీ మాత్రం లాభాలు గడించింది. కారణం.. కరోనా టైంలో అంతా ఇండ్లలోనే ఉన్నారు. జనాలు బయటికి వెళ్లాల్సిన పనిలేదు. కాబట్టి చూసేందుకు ఎలా ఉన్నా కంఫర్ట్‌గా ఉండే షూ వేసుకోవడాన్ని ప్రిఫర్ చేశారు.
అలాంటి వాటి కోసం వెతికితే మొదటి ప్లేస్‌లో క్రాక్స్ కనిపించాయి. దాంతో క్రాక్స్‌కి మళ్లీ డిమాండ్ పెరిగింది. కంపెనీ ఆన్‌లైన్ అమ్మకాల మీద ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా కంపెనీల్లో పనిచేసేవాళ్లు, హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసేవాళ్లు వీటిని ఎక్కువగా ఇష్టపడ్డారు. ఎందుకంటే వీటిని ఎన్నిసార్లు కడిగినా పాడవ్వవు. దాన్ని అవకాశంగా తీసుకున్న కంపెనీ హాస్పిటల్స్‌లో పనిచేస్తున్నవాళ్ల కోసం దాదాపు లక్ష జతల బూట్లు ప్రత్యేకంగా హాస్పిటల్స్‌కి సప్లై చేసింది. 2020 నుండి 2022ల మధ్య సేల్స్ విపరీతంగా పెరిగాయి. వర్క్ ఫ్రం హోం చేసేవాళ్లు కూడా ఎక్కువగా వీటినే కొన్నారు. దాంతో కంపెనీ మార్కెటింగ్ మొదలుపెట్టింది. సెలబ్రిటీలతో అడ్వర్టైజ్మెంట్స్ చేయించింది. కొత్త మోడల్స్‌ని లాంచ్ చేసింది. దాంతో మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇప్పటికీ మార్కెట్‌లో క్రాక్స్ సేల్స్‌లో దూసుకుపోతున్నాయి.
సెలబ్రిటీలకు ఇష్టం
టైమ్ మ్యాగజైన్ 2010లో క్రాక్స్‌ను టాప్ 50 చెత్త ఆవిష్కరణల్లో(వరెస్ట్ ఇన్వెన్షన్స్) ఒకటిగా గుర్తించింది. కానీ.. తర్వాత అదే క్రాక్స్ టాప్ 50 కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. నిక్కీ మినాజ్, అరియానా గ్రాండే, కెండల్ జెన్నర్ లాంటి ప్రముఖులు ఎందరో క్రాక్స్‌ని వాడుతున్నారు. అంతెందుకు జస్టిన్ బీబర్ కూడా క్రాక్స్ వాడతాడు. అందుకే ఇది యూత్‌కి ఇష్టమైన బ్రాండ్ అయింది. ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్, క్రీడాకారులు, క్లబ్స్‌లో పాల్గొనే వాళ్లు వీటిని ఎక్కువగా వాడుతున్నారు.
ప్రత్యేకత ఏంటి?
మిగతా షూలతో పోలిస్తే క్రాక్స్ చాలా స్పెషల్. వీటిని తయారు చేయడానికి వాడే మెటీరియల్ సాఫ్ట్‌గా ఉంటుంది. అందువల్ల కాలికి చాలా కంఫర్ట్. డిజైన్‌లో అతుకులు, కుట్లు ఉండవు. పైగా ఈ మెటీరియల్ చాలా కాలం మన్నుతుంది. అందువల్ల క్రాక్స్‌ను జాగ్రత్తగా వాడితే ఐదేండ్ల వరకు మరో జత కొనే అవసరం రాదు. ఈ షూ చాలా తేలికగా ఉంటాయి. నీటితో కడగడం కాదు.. చాలాసేపు నీటిలోనే ఉంచినా పాడవుతాయనే సమస్య ఉండదు. కాబట్టి శుభ్రం చేయడం చాలా ఈజీ. పాదాలను చల్లగా, పొడిగా ఉంచడానికి షూ పైభాగంలో ఉన్న రంధ్రాలు వెంటిలేషన్ అందిస్తాయి. మొదట్లో బోటర్స్, బీచ్‌కి వెళ్లేవాళ్లే వీటిని ఎక్కువగా వాడేవాళ్లు. కానీ.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల వృత్తుల్లో ఉన్నవాళ్లు వాడుతున్నారు. వీటి పేరుకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. క్రొకొడైల్స్ పేరు నుంచి ఇన్‌స్పైర్ అయ్యి వీటికి ‘క్రాక్స్’ అని పేరు పెట్టారు. క్రొకొడైల్స్ ఎలాగైతే నీళ్లలో, భూమ్మీద ఉంటాయో... అలానే వీటిని కూడా రెండు రకాలుగా వాడొచ్చు అనే ఉద్దేశంతో ఆ పేరు పెట్టారు.