యాక్టర్ అంటే ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకూడదు. అన్నిరకాల పాత్రలు చేయాలి అంటుంటారు చాలామంది. అందుకే అన్ని రకాల పాత్రలు చేసి, మెప్పించే వాళ్లని వర్సటైల్ యాక్టర్స్ అంటారు. బాలీవుడ్ నటి దివ్యాంక త్రిపాఠి దహియా కూడా ఆ కోవకే చెందుతుంది. ఎందుకంటే ఆమె చేసే పాత్రలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. వర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆమె అసలు నటి అవ్వాలనుకోలేదట! మరి నటిగా ఎలా మారింది? అందుకు కారణమేంటి? ఆమె మాటల్లోనే...
‘‘మాది మధ్యప్రదేశ్‌లోని భోపాల్. గ్రాడ్యుయేషన్ వరకు అక్కడే చదివా. నాకు మౌంటెనీరింగ్ అంటే... పర్వతాలు ఎక్కడం, ట్రెక్కింగ్ చేయడం చాలా ఇష్టం. ఆ ఇంట్రెస్ట్‌తోనే ఉత్తర్‌కాశీలో ‘నెహ్రూ మౌంటెనీరింగ్ ఇనిస్టిట్యూట్’లో మౌంటెనీరింగ్ కోర్స్ పూర్తి చేశా. మోడలింగ్, రియాలిటీ షోలు, టెలివిజన్ సీరియల్స్ చేస్తూ ఇక్కడివరకు చేరుకున్నా. నా జీవితంలో ఆర్ధికపరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటా. సేవింగ్స్ చేస్తుంటా. ఇదంతా నా పర్సనాలిటీ. నా కెరీర్ జర్నీ విషయానికొస్తే.. 2005లో ‘మిస్ భోపాల్’ విన్నర్‌ని.
అదే ఏట ‘యే దిల్ చాహె మోర్’ అనే టీవీ సిరీస్‌లో పాయల్ అనే క్యారెక్టర్ చేశా. 2006లో జీ టీవీలో ‘బనూ మై తేరి దుల్హన్’ అనే సీరియల్లో విద్య, దివ్య అనే రెండు పాత్రలు చేశా. అందులో విద్య రోల్‌కి ప్రశంసలతోపాటు చాలా అవార్డులు కూడా వచ్చాయి. ఆ సీరియల్ మూడేండ్లు టెలికాస్ట్ అయ్యింది. ఆ తర్వాత ‘ఖానా ఖజానా’ షోలో కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేశా. సీరియల్ మధ్యలో కూడా అప్పుడప్పుడు కొన్ని షోలు చేశా. అలా కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంటిన్యూ చేస్తున్నా.
యాక్టర్ అవ్వాలనుకోలేదు
భోపాల్‌లో ఆల్ ఇండియా రేడియోలో యాంకర్‌గా చేశా. తర్వాత కొత్త నటీనటుల్ని సెలక్ట్ చేసేందుకు పెట్టిన రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేశా. అప్పట్లో దూరదర్శన్‌లో టెలీ ఫిల్మ్స్ వచ్చేవి. వాటిలో చేయడం వల్ల యాక్టింగ్ గురించిన అవగాహన వచ్చింది. కానీ జర్నలిస్ట్ నుంచి యాక్టర్ కావడానికి చాలా కాలం పట్టింది. ఎవరైనా యాక్టర్‌ని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్లలా యాక్టర్ కావాలి అనిపిస్తే... యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చేదేమో.
కానీ నాకు అలా జరగలేదు. ఎప్పుడూ ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి అనిపించేది. దాంతో యాక్టింగ్, యాంకరింగ్.. ఏ అవకాశం వస్తే అది చేస్తూ పోయా. పలు రకాల అవకాశాలు వస్తుంటే మల్టీ టాస్కింగ్ చేయాలి అనుకునేదాన్ని. నిజానికి యాక్టర్ కావాలని, ముంబయి వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదు. అలాగని నటన అంటే భయం లేదు. కానీ, కాస్త కన్ఫ్యూజన్ ఉండేది. ముంబయికి వెళ్లి... అక్కడ నేనేం చేయాలి? అనిపించేది.
ముంబై అలవాటై...
‘బనూ మై తేరి దుల్హన్’ అనే సీరియల్లో మొదటి అవకాశం వచ్చింది. ఆ అవకాశం నన్ను వెతుక్కుంటూ రాలేదు. నేనే ఆడిషన్‌కి వెళ్లి, అందులో సెలక్ట్ అయ్యా. ఆరు నెలలు ప్రాజెక్ట్ చేయాలని కాంట్రాక్ట్ పేపర్ మీద సంతకం చేయమన్నారు. ఆరు నెలలు చేసి వెనక్కి వెళ్లిపోదాం అనుకున్నా. ఆ తర్వాత ఆర్మీ లేదా ఐ.ఎ.ఎస్. వంటి ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా. నటించడానికి రాకముందే వాటికోసం అప్లయ్ చేశా. ఆ ఎగ్జామ్స్ ఆరు నెలల తర్వాతే ఉంటాయి. ఆ టైం ఉందని సీరియల్లో చేసేందుకు అక్కడికి వెళ్లా. నేను ముంబైకి వెళ్లినప్పుడు అమ్మ ధైర్యంగానే ఉంది.
కానీ నాన్న మాత్రం ‘ఒక్కదాన్నే అక్కడ ఎలా వదిలేసి వస్తాం’ అని భయపడేవాళ్లు. ఆయనకి భోపాల్‌లో మెడికల్ స్టోర్ ఉంది. ఒక్కరోజు కూడా దాన్ని క్లోజ్ చేయరు. అందుకని ఆయన ముంబై రాలేదు. నాకు చాలా జాగ్రత్తలు చెప్పేవాళ్లు. నా తల్లిదండ్రులు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. వాళ్లకు మంచి పేరు తీసుకురావాలి అనుకున్నా. చదువుకునే రోజుల్లో ఎన్సీసీ క్యాంప్‌లకు వెళ్లేదాన్ని. టీచర్స్ చెప్పిన మాట వినేదాన్ని. ఇంటి నుంచి బయటకు వస్తే ఎలా ఉంటుందో? ఇండిపెండెంట్‌గా ఎలా బతకాలో చిన్నప్పుడే నేర్చుకున్నా. అందుకని ముంబయి వచ్చాక ఒంటరిగా ఉండడం అంత కష్టంగా అనిపించలేదు.
ఫస్ట్ టైం షూటింగ్లో...
కెమెరా ఎలా ఫేస్ చేయాలో కూడా తెలియదు నాకు మొదట్లో. మొదటి రోజు షూటింగ్ జరిగేటప్పుడు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. డైరెక్టర్ నాకు డైలాగ్స్ ఇచ్చి.. అవి చదువుకుని రెడీగా ఉండమన్నారు. నేను అలానే రెడీ అయ్యా. తర్వాత డైరెక్టర్ వచ్చి ఒక ప్లేస్ చూపించి అక్కడ నిల్చొని డైలాగ్ చెప్పమన్నారు. సరే అని బుర్ర ఊపి అక్కడికి వెళ్లి నిల్చొన్నా. అప్పుడు కెమెరామెన్ ‘బేబీ లెఫ్ట్.. బేబీ రైట్..’ అంటుంటే నేను అటు ఇటు జరుగుతున్నా.
అది గమనించిన డైరెక్టర్ నన్ను పిలిచి ‘మీరెందుకు కదులుతున్నారు?’ అని అడిగారు. ‘బేబీ... లెఫ్ట్, రైట్’ అని చెప్తున్నారు కదా అన్నా. ‘మీ పేరు బేబీ కాదు కదా’ అన్నారు. నాకేం తెలుసు? ఇండస్ట్రీలో అలా పిలుచుకోవడం మామూలే కదా అనుకున్నా. ఆ తర్వాత వాళ్లు ‘‘బేబీ అనేది లైట్ పేరు. కరెక్ట్ లైటింగ్ కోసం బేబీ లైట్‌ను అటు ఇటు జరపమని చెప్తున్నారు’’ అని చెప్పారు.
అవి రిజెక్షన్స్ కాదు
నా కెరీర్లో కూడా రిజెక్షన్స్ ఉన్నాయి. కానీ, వాటిని నేను రిజెక్షన్స్ అనుకోను. ఆ స్క్రిప్ట్‌కి నేను సరిపోలేదు అనుకునేదాన్ని. ఒక్కోసారి నా మీద నాకే కోపం వచ్చేది. అప్పుడు నన్ను నేను సమర్థించుకునేదాన్ని. ఆరు నెలలు ఉండి తిరిగి భోపాల్ వెళ్లిపోవాలి అనుకున్న నేను... ఇంకా ఇండస్ట్రీలో ఉన్నాను అంటే నేను ఇక్కడ ఏదో చేయడానికే ఉన్నా. నా లైఫ్ ఇక్కడే ఉంది అనిపించేది. సరిగ్గా అదే టైంలో ఒక సీరియల్ స్క్రిప్ట్ చెప్పారు. అది బాగా నచ్చి వెంటనే ‘ఓకే’ చెప్పా. ఆ సీరియల్ అన్ని ఏర్పాట్లు జరిగి షూటింగ్ మొదలయ్యేసరికి కొన్ని నెలలు పట్టింది.
ఆ తర్వాత కూడా స్టార్ ప్లస్ వాళ్లే మరో ఛానెల్ కొత్తగా మొదలుపెట్టారు. ఈ సీరియల్ స్లాట్ రాత్రి పదకొండు గంటలకు వచ్చేది. అదంతా ఎందుకు జరుగుతుందో నాకేం అర్థం కాలేదు. కాకపోతే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? అనిపించేది. అయితే, ఊహించని విధంగా అది స్టార్ ప్లస్‌కి షిఫ్ట్ అయ్యి అందులో టెలికాస్ట్ అయ్యింది. అది కూడా అదే టైంకి వచ్చేది. కానీ, ఆ టైంలో కూడా టీఆర్పి బాగుండేది ఆ సీరియల్‌కి. టైం ఏదైతేనేం టీఆర్పీ బాగున్నందుకు హ్యాపీగా అనిపించింది. అప్పుడు అర్ధమైంది మన చేతిలో ఏం లేదు. అంతా డెస్టినీ అని.
బాడీ షేమింగ్ ఎదురైంది
నా మీద బాడీ షేమింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. నేను సన్నగా ఉన్నప్పుడు ‘కాస్త బొద్దుగా ఉంటే బాగుంటావ్’ అనేవాళ్లు. లావయ్యాక ‘ఫిట్నెస్ ఇంపార్టెంట్. బరువు తగ్గు’ అనేవాళ్లు. ఒకానొక టైంలో ఇలాంటి కామెంట్స్ నాకు చాలా ఇబ్బందిగా అనిపించాయి. అసలు ఆ మాటలు నేను ఎందుకు పట్టించుకోవాలి. నా బాడీ నా ఇష్టం. ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజ్లు చేయడం, చేయకపోవడం నా ఛాయిస్. నా మైండ్ రిలాక్స్ అవ్వడం కోసం ఎక్సర్సైజ్లు చేస్తా.
అది చేయడం వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లావవుతానా? సన్నబడతానా? అది నా ఇష్టం. ఎవరైనా నా ఎదురుగా బాడీ షేమింగ్ చేస్తే.. ‘నేను ఫిట్‌గా ఉన్నా అది చాలు నాకు’ అని చెప్తా. సోషల్ మీడియాలో ఎవరైనా బాడీ షేమింగ్ కామెంట్స్ పెడితే .. రెండో ఆలోచన లేకుండా వాళ్లని బ్లాక్ చేస్తా.
భర్త సపోర్ట్‌తో...
రియాలిటీ షోలు ఎక్కువమందే చూస్తారు. నా కోసం నా ఫ్యాన్స్ నేను పార్టిసిపేట్ చేసిన షో చూశారు. ఒక షోలో చివరి వరకు వచ్చి గెలవలేకపోయా. అప్పుడు కూడా చాలామంది పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారు. సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారు. మా ఆయన నాకంటే ఎక్కువ డిసప్పాయింట్ అయ్యాడు. ‘నువ్వు ఏ పని అయినా మనసు పెట్టి, నూటికి నూరు శాతం ట్రై చేస్తావ్. అయినా నిన్ను విన్నర్‌గా ప్రకటించలేదు ఎందుకు’ అని బాధపడ్డాడు.
అప్పుడు మా అత్తమామలు కూడా ఇంటికి వచ్చారు. మాతోపాటు కొన్ని రోజులు ఉన్నారు. నా విషయంలో నా భర్త చాలా కేరింగ్. టైం దొరికితే ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్తుంటాం. మా బాండింగ్ చాలా బాగుంటుంది. ఇండస్ట్రీలో తనకంటే నాకే ఎక్కువ పేరుంది. దానివల్ల మా మధ్య ఎప్పుడూ గొడవలు కాలేదు. తన సపోర్ట్ వల్లే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నా.
ప్రొఫెషన్ అంటే ఉద్యోగం లేదా వ్యాపారం చేయడమే కాదు. ఇంటినుంచి బయటకి అడుగుపెట్టి చేసేవి మాత్రమే పనులు కాదు. ఇంట్లో ఉండేవాళ్లు కూడా చాలా పనులు చేస్తారు. ఇంటిని మేనేజ్ చేయడం ఒక ప్రొఫెషన్. ఎవరికి వాళ్లు వ్యాల్యూ ఇచ్చుకోవాలి. అప్పుడే సొసైటీ మనకు వ్యాల్యూ ఇస్తుంది. అలాగే కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా రిలేటివ్స్, ఫ్రెండ్స్‌ని కలుస్తుండాలి. అందరూ కలిసి అప్పుడప్పుడు బయటకు వెళ్తుండాలి.
‘అదృశ్యం’ ముందే అనుకున్నాం
‘అదృశ్యం: ది ఇన్విజిబుల్ హీరోస్’ సిరీస్ చేయకముందే ఇలాంటి ఒక సబ్జెక్ట్ చేయాలి అని నేను, వివేక్ అనుకున్నాం. ఒక అండర్ కవర్ ఆపరేషన్ చేస్తున్న ఆఫీసర్, తల్లిగా తన బిడ్డని, ఇంటిని చూసుకుంటూ డ్యూటీ చేయడం అనే సబ్జెక్ట్ బాగుంటుంది అనుకున్నాం. పోలీస్ ఆఫీసర్ అనగానే యాక్షన్ సీన్స్, రఫ్‌గా ఉండే క్యారెక్టర్.. చూపిస్తారు. నిజానికి అది ఒకవైపు మాత్రమే. దానికి రెండోవైపు కూడా ఉంటుంది. ఆఫీసర్ పర్సనల్ లైఫ్, సాఫ్ట్ నేచర్ వంటివి ప్రెజెంట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. వాళ్లు కూడా మామూలు మనుషులే కదా! ఈ స్ర్కిప్ట్ వినగానే ఎగ్జయిట్ అయ్యా. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కోసం కాస్త కష్టపడ్డా. ఫిజికల్ ఫిట్నెస్ మీద దృష్టి పెట్టా. యాక్షన్ సీన్స్ ప్రాక్టీస్ చేశా.
ఆ టైంలో నా కాలికి ఫ్రాక్చర్ అయ్యి లిగమెంట్ సర్జరీ చేయాల్సి వచ్చింది. అప్పుడు అదృశ్యం టీం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ‘సర్జరీ చేయించుకోండి. మీరు వచ్చేవరకు వెయిట్ చేస్తాం’ అన్నారు. వాళ్లలా అనడంతో నేను త్వరగా రికవర్ అవ్వడం ఛాలెంజ్‌గా తీసుకున్నా. ‘అదృశ్యం’ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అందులో నేను చేసిన రోల్‌ని చాలామంది మెచ్చుకుంటున్నారు.
ఎమోషన్ ఏదైనా ఎక్స్‌ప్రెస్ చేయడం అనేది ముఖ్యం. ఎవరైనా బాధ పడుతుంటే వాళ్లకు సపోర్ట్ ఇవ్వాలి. షేర్ చేసుకున్నప్పుడే బాధ తగ్గుతుంది. నాకు, మా ఆయన ఒకరినొకరం చాలా బాగా అర్ధం చేసుకుంటాం. ఎదుటి వ్యక్తి చెప్పేది వినడం మా ఇద్దరికీ అలవాటు. ఒకరి అభిప్రాయాలను ఒకరం గౌరవించుకుంటాం. ప్రతి రోజు నిద్రపోయే ముందు ఆ రోజు మా ఇద్దరి జీవితాల్లో జరిగిన మంచి విషయాలు చెప్పుకుంటాం. అన్నిటికీ మించి ఒకరినొకరం అప్రిషియేట్ చేసుకుంటాం.
ప్రజ్ఞ