పరిచయం : యాంకర్​ నుంచి యాక్టర్​గా..

చూడ్డానికి పక్కింటి కుర్రోడిలా ఉంటాడు. చలాకీగా, హుషారుగా మాట్లాడతాడు. టీవీ షోలో ఈ అబ్బాయి కనిపిస్తే.. ఆడియెన్స్​కి పండగే. అంత పాపులారిటీ సంపాదించుకున్నా.. ఎక్కడో ఒక మూల నటన మీద ఆసక్తి ఉంది. దాంతో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకెళ్తున్నాడు ఈ యంగ్​ హీరో. లేటెస్ట్​గా ‘మరక్కుమ్​ నెంజం’ అనే సినిమాతో తమిళ ఆడియెన్స్​ని పలకరించిన రక్షణ్​ .. తమిళ సూపర్ స్టార్​ రజినీకాంత్​ రాబోయే సినిమాలో కనిపించబోతున్నాడు!  అతని మాటల్లోనే యాంకర్​ నుంచి యాక్టర్​ వరకు జరిగిన జర్నీ గురించి.. 


‘‘మాది తమిళనాడులోని చెన్నయ్​. నేను కాలేజీ చదువుతున్నప్పుడు నాన్న చనిపోయాడు. దాంతో ఇంటి బాధ్యంతా అమ్మ ఒక్కతే తీసుకుంది. చదువుకునే రోజుల్లో ఫార్మసీలో జాబ్ చేయాలనుకున్నా. తర్వాత డాక్టర్ అయితే బెటర్​ అనిపించింది. అప్పటికి ఇంగ్లిష్ అంతగా రాదు నాకు. దాంతో అది కూడా వద్దనుకున్నా. ఎంబీఏ పూర్తి చేశా. కానీ, అందులో జాబ్​ వెతుక్కోలేదు. కొత్తగా ఏదైనా చేయాలనిపించేది. అందుకే కాల్​ సెంటర్​లో కొన్నాళ్లు పనిచేశా. కాల్ సెంటర్​లో పనిచేసేటప్పుడు.. ఫ్యూచర్​లో నేను ఇంత పెద్ద బిల్డింగ్​ కట్టాలి. సీఈఓ కావాలి అనిపించేది. అలా ఎప్పుడూ పెద్ద పెద్ద కలలు కనేవాడిని. నా ఆలోచనలు తెలిసిన మా టీం లీడర్​ ‘‘ఎంబీఏ చదివి ఈ జాబ్​కి వచ్చావేంటి? మంచి జాబ్ చూసుకో” అనేవాడు. అలాంటి నాకు సినిమాల మీద ఇష్టం ఎలా వచ్చిందో తెలియదు. 

నా ఆలోచనలకు తగ్గట్టే ఇంట్లో కూడా నన్ను చాలా సపోర్ట్ చేస్తారు. ఒకసారి మెస్​లో ఫుడ్​ పడలేదు.  అక్కడ ఉండాలి అనిపించలేదు. ఇంటికి ఫోన్ చేసి ఏడ్చా. ‘‘మేం ఉన్నాం కదా. నువ్వు నిశ్చింతగా కూర్చున్నా పర్వాలేదు’’ అని ధైర్యమిచ్చారు. ఇంటికొచ్చాక ఏం చేయాలా? అనే ఆలోచన మళ్లీ మొదలు. అప్పుడు ‘రియల్​ ఎస్టేట్ చెయ్’ అన్నారు ఇంట్లో వాళ్లు. ‘‘హౌస్​ బ్రోకర్​గా చేయమంటారా? నేను చేయను’’ అని చెప్పా. ఆ తర్వాత బాగా ఆలోచిస్తే... నాకు పెట్స్ అంటే చాలా ఇష్టం. అందుకని పెట్ బిజినెస్ పెట్టాలనుకున్నా. కానీ, ఆ బిజినెస్​కి ఫ్యూచర్​ కనిపించలేదు. ఏది చేసినా గొప్పగా చేయాలనుకున్నా. అమ్మ దగ్గరకి వెళ్లి ‘‘నాకు నటించాలని ఉంది’’ అని చెప్పా. అప్పుడు తెలిసిన వాళ్ల దగ్గరకి పంపించారు. అలా 2011లో ‘ఎన్ కాదల్ దేవతై’ ప్రాజెక్ట్​ పట్టాలెక్కింది. మొదటిసారి నేను నటించిన సినిమా అదే. కానీ అది రిలీజ్ కాలేదు.  

యాంకర్​గా..

సంపాదన కోసం కార్ డీలింగ్స్ చేశా. ఆ టైంలో ‘రాజ్​ మ్యూజిక్​’లో యాంకర్​గా ఛాన్స్ ఉందని తెలిసింది. ఆడిషన్​ ఇస్తే వెంటనే ‘ఓకే’ చేశారు. వీడియో జాకీగా కొన్నాళ్లు వర్క్ చేశా. అలా 2014లో నా కెరీర్ స్టార్ట్ చేశా. తర్వాత రాజ్ డిజిటల్ ఛానెల్​లో న్యూస్​ చదవమన్నారు. న్యూస్ యాంకర్​గా కూడా చేశా. నాకు మొదటి నుంచి ‘విజయ్ టీవీ’లో  పని చేయాలనే ఆశ ఉండేది. దాంతో అక్కడికి వెళ్తానని చెప్పా.

 ‘‘అందులో అవకాశం లేదు. కలైగ్నర్​ ఛానెల్​ ఉంది అక్కడ ట్రై చేయమ’’ని చెప్పారు. ఆ ఛానెల్​లో మూవీ ఇంటర్వ్యూలు చేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత నేను కోరుకున్న విజయ్​ టీవీలో ఛాన్స్​వచ్చింది. ఆ టీవీలో కామెడీ షోకి హోస్ట్​గా చేశా. ఆ షో డైరెక్టర్ థామ్సన్. ఆయనతోపాటు ఆ షోకి వచ్చిన సెలబ్రిటీలు కూడా నన్ను మెచ్చుకునే
వారు. ఒకసారి డైరెక్టర్ థామ్సన్​ దగ్గర అసిస్టెంట్​ డైరెక్టర్​గా చేరతానని అడిగా. ఆయన వెంటనే ఒప్పుకున్నారు. అలా ఆయనతో ట్రావెల్ చేస్తూ.. చిన్న చిన్న క్యారెక్టర్స్​ చేస్తూ యాక్టింగ్​లోకి వచ్చా. 

 కన్నుమ్ కన్నుమ్...

2020లో ‘కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడితాల్’ సినిమా ఛాన్స్​ వచ్చింది. దుల్కర్​ సల్మాన్​తో మంచి స్నేహం ఉంది. మొదటి రోజు నుంచి ఇప్పటివరకు అలానే ఉంది. ఆ సినిమా టీంతో వర్క్​ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సెట్స్​లో అంత ఫన్ ఉంటుందని ఊహించలేదు. ప్రతిసారీ షెడ్యూల్​ అయిపోయే టైంకి ఫేర్​వెల్ పార్టీలా ఉండేది. ఎందుకంటే నెక్స్ట్షెషెడ్యూల్​కి వెళ్లే ముందు బ్రేక్ ఉంటుంది. దుల్కర్​తో కలిసి పనిచేయడం చాలా కంఫర్టబుల్​గా ఉండేది. ఆయన ఫ్రెండ్​​లా కలిసిపోతాడు. డైరెక్టర్ చెప్పినట్టు చేసేవాడిని. ఆయన మధ్యలో ఇంప్రవైజేషన్​ చేసేవారు. 

స్కూల్ బ్యాక్​ డ్రాప్​లో..

లాక్​ డౌన్​ టైంలో సినిమా అనేది ఉంటుందా? లేదా? అర్థం కాని పరిస్థితి. ఆ తర్వాత ఓటీటీ వచ్చింది. దాంతో ఎక్కడైనా నటించొచ్చు అనే ధైర్యం వచ్చింది. ‘మరక్కుమ నెంజం’ కథ వచ్చినప్పుడు ఏదో ఒక ప్లాట్​ఫామ్​లో  రిలీజ్ అవుతుంది అనే ధీమా వచ్చింది.  స్క్రిప్ట్ కూడా నచ్చింది. పైగా లీడ్​ రోల్. ఫస్ట్​ టైం మెయిన్​ లీడ్​గా చేయడం అంటే.. ఆడియెన్స్​కి నన్ను ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి ఈ సినిమా సరిపోతుంది 

అనిపించింది. అప్పటికే రెండు మూడు స్క్రిప్ట్​లు విన్నా. వాటిలో ఇదే బెస్ట్​. మళ్లీ వెనక్కి వెళ్లి స్కూల్​ లైఫ్ ఎంజాయ్ చేయడం థ్రిల్లింగ్​గా అనిపించింది. నా రోల్​ చాలా ఇంట్రెస్టింగ్​గా ఉంటుంది. 

ఫస్ట్​ డే షూటింగ్​​ స్కూల్లో  జరిగింది. అక్కడ అందరూ నన్ను చూసి ‘‘పెద్దవాడిలా కనిపిస్తున్నావు. కొంచెం అప్పియరెన్స్ మారాలి’’ అని చెప్పారు. నెల రోజులు టైం ఇచ్చారు. నేను కష్టపడి స్టూడెంట్​లుక్​ తెచ్చుకున్నా. అయితే ఏజ్​ డిఫరెన్స్ తెలియడం కోసం​ ఈ సినిమాలో గడ్డం లేకుండా, గడ్డంతో కొన్ని సీన్స్​లో కనిపిస్తా.

అది అదృష్టం!

‘వెట్టైయాన్​​’లో అమితాబ్​ బచ్చన్, రజినీకాంత్, ఫహద్ ఫాజిల్ వంటి గొప్ప నటులు ఉన్నారు. అలాంటి సినిమాలో నాకు అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఒకరోజు ‘వెట్టైయార్​’ టీం నుంచి ఫోన్​ కాల్​ వచ్చింది. ‘‘రజినీకాంత్​ సినిమాలో ఒక రోల్ ఉంది. ఇలా ఉంటుంది. రెమ్యునరేషన్​ ఇంత’’ అని చెప్పారు. రజినీకాంత్​ అనగానే నాకు మాటలు రాలేదు. ఒకటే రిప్లయ్ అన్నింటికీ ‘‘సరే సర్. ఓకే సర్’’ అంతే. ఆ సినిమా గురించి చాలా ఎగ్జయిటింగ్​గా ఉన్నా. ఈ సినిమా కోసం అంతకుముందు రెండు సినిమాలకు తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశా. ఆ రెండు సినిమాల్లో నేను హీరోగా చేయాలనుకున్నవే. కానీ ‘వెట్టైయాన్’​ లాంటి అవకాశం మళ్లీ రాదనిపించింది. అందుకే రోల్​ చిన్నదా, పెద్దగా అని చూడకుండా ఒప్పుకున్నా. నిజానికి ఇందులో చేయడంతో నటుడిగా నా కల నెరవేరినట్టే. 

అది మర్చిపోలేను..

షూటింగ్​కి వెళ్లేటప్పుడు రజినీకాంత్​ సర్ పక్కనే నా సీటు. పక్కన కూర్చున్నాననే కానీ, దాదాపు ముప్పావుగంట ఏం మాట్లాడలేదు. ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? తెలియలేదు. ఆ తర్వాత ఎయిర్​ హోస్టెస్ వచ్చి బాదం పప్పులు ఇస్తుంటే, అవి తీసుకుని ‘‘సార్.. తీసుకోండి’’ అని ఇచ్చా. ఆయన ‘‘థ్యాంక్యూ” అంటూ తీసుకున్నారు. అప్పుడు నేను ‘‘సర్ నేను మీ సినిమాలో నటిస్తున్నా” అని చెప్పా. ఆ తరువాత చాలాసేపు మాట్లాడుకున్నాం.
- ప్రజ్ఞ

టీవీ షోలు, సినిమా షూటింగ్​లు రెండూ బ్యాలెన్స్ చేస్తున్నా. మొదటి సినిమా ‘కన్నుమ్ కన్నుమ్ కాదలుమ్’​ కూడా అలాగే చేశా. రెండింటినీ చేయడం అంత ఇబ్బంది అనిపించలేదు. ఇండస్ట్రీని అర్థం చేసుకుని అడ్జస్ట్ అయితే సరిపోతుంది అనేది నా ఫీలింగ్​. అన్ని రకాల క్యారెక్టర్స్, మూవీస్ ట్రై చేయాలనుంది. 

ఒక్క సినిమాకే..

2021లో ‘‘కన్నుమ్ కన్నుమ్​ కొల్లయాడితాల్’’​ సినిమాకి బెస్ట్​ డెబ్యూ​ యాక్టర్​గా ‘‘సౌత్​ ఇండియన్ ఇంటర్నేషనల్​ మూవీ”అవార్డ్స్​కి నామినేట్​ అయ్యా. నిజానికి టీవీ నుంచి వెళ్లి సినిమాల్లో నటించడమే ఒక పెద్ద సక్సెస్. అలాంటిది స్టార్​ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడం గొప్ప విషయం. అది కాక సైమా అవార్డులకు నేను నామినేట్ అవ్వడం నా వరకు అదొక అచీవ్​మెంట్​.అదే సినిమాకి 2022లో బెస్ట్​ సపోర్టింగ్​ యాక్టర్​ – మేల్ కేటగిరీలో ‘‘ది గలాటా క్రౌన్ అవార్డ్’ దక్కింది. మొదటి సినిమాకే ఇంత గుర్తింపు రావడం నా లక్​. 

అవార్డ్​లు వచ్చాయ్​

     కుకు విత్ కోమాలి సీజన్​ 2కి ‘బిహైండ్ వుడ్స్ గోల్డెన్​ ఐకాన్’ అవార్డ్ వచ్చింది. 
     కలక్క పోవతు యారు? షోకి విజయ్ టెలివిజన్​ అవార్డ్​లో ‘ఫేవరెట్​ యాంకర్​ – మేల్’ అవార్డ్​ దక్కింది. 
     2022లో విజయ్ టెలివిజన్ ఏడో వార్షిక అవార్డ్స్​లో ‘కుకు విత్ కోమాలి సీజన్​3’కి బెస్ట్ యాంకర్ మేల్​ కేటగిరీలో అవార్డ్ గెలిచా.