పరిచయం..ఓపిక ఇచ్చిన రిజల్ట్​ ఇది

కొందరు నటన మీద ఇష్టంతో ఎక్కడెక్కడి నుంచో ఇండస్ట్రీకి వస్తుంటారు.  ఇంకొందరు ఇండస్ట్రీ ఉన్నచోటే వాళ్లూ ఉంటారు. అయినా అవకాశాల కోసం ఎదురుచూసే ఈ ఇద్దరి కష్టం ఒకేలా ఉంటుంది. ఇందులో రెండో కోవకు చెందుతుంది ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్​ కూడా. పేరు నమ్రతా షేత్​. ప్రస్తుతం ‘కర్మ కాలింగ్​’ పేరుతో ఓటీటీ ఆడియెన్స్​కు కనెక్ట్ అవుతోంది. ‘బాలీవుడ్​ అడ్డా అయిన ముంబై నా సొంతూరు. కానీ, ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవడానికి పదేండ్లు పట్టింది’ అంటోంది నమ్రత.

‘‘మాది ముంబై. అక్కడే జమ్నాబాయి నర్సీ స్కూల్లో చదువుకున్నా. తర్వాత సెయింట్ జేవియర్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశా. కాలేజీ చదివే రోజుల్లో అందాల పోటీల్లో పాల్గొనేదాన్ని. చదువు పూర్తయ్యాక మోడల్​గా కెరీర్ స్టార్ట్​ చేశా. ‘ఫ్యాబ్ ఇండియా, బాబీ బ్రౌన్, హావెల్స్, క్లోజ్–అప్, హెడ్ అండ్ షోల్డర్, వెస్ట్ సైడ్’ వంటి బ్రాండ్స్​తో పాటు రీతు కుమార్, అనితా డోంగ్రే, సబ్యసాచి ముఖర్జీల డిజైన్స్​కు నేను మోడల్​​గా ఉన్నా.

2012లో ‘మిస్ క్లీన్ అండ్ క్లియర్ టైమ్స్ ఫ్రెష్ ఫేస్​’ టైటిల్​కి సెలక్ట్ అయ్యా. ఇవన్నీ అయితే చేస్తున్నా కానీ వెంటనే యాక్టింగ్​ వైపుకి రాలేదు. మా అమ్మానాన్న ‘చదువు పూర్తయ్యాక ఇండస్ట్రీలో ట్రై చేయమ’న్నారు. దాంతో మాస్ కమ్యూనికేషన్​లో మాస్టర్స్ చేశా. ఆ తర్వాత పూర్తి​గా నటన మీదే కాన్సన్​ట్రేట్ చేశా.

కెరీర్ అప్పుడే మొదలైంది

ముంబైలో ఉండడం ఒకరకంగా అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే నా ప్యాషన్​ కోసం ఉన్న ఊరిని వదిలి పెట్టాల్సిన అవసరం రాలేదు! ఇన్నేండ్లు మా పేరెంట్స్ నాకు చాలా సపోర్ట్​ చేశారు. పదహారేండ్ల వయసులోనే మోడలింగ్ రంగంలో​కి వచ్చా. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదేండ్లు అవుతోంది. అందులో కొన్ని సంతోషాన్నిచ్చే రోజులు ఉన్నాయి. 2019లో ‘భులా దియా’ అనే మ్యూజిక్ ఆల్బమ్​లో కనిపించా. ఇందులో సింగర్​ దర్శన్​ రావల్​తో స్క్రీన్ షేర్ చేసుకున్నా. ఈ పాట రిలీజ్​ అయ్యాక చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఆ తర్వాత నుంచి నాక్కూడా గుర్తింపు దక్కింది. ఆ తర్వాత కొవిడ్ వల్ల ఒక్క ప్రాజెక్ట్​ కూడా పట్టాలెక్కలేదు. 2022లో ఒక వెబ్​ సిరీస్ అవకాశం వచ్చింది. దాని పేరు ‘గిల్టీ మైండ్స్’. అందులో నాది లాయర్ శుభాంగి ఖన్నా రోల్. ఆ రోల్ కోసం నాకున్న లాయర్ ఫ్రెండ్స్​తో కలిసి హైకోర్ట్​కి వెళ్లి లాయర్లను గమనించేదాన్ని. నటి షెఫాలీ నాకు కొన్ని ఇన్​పుట్స్ ఇచ్చారు. అవన్నీ నాకు చాలా హెల్ప్​ అయ్యాయి.

నేను నేర్చుకున్నవి ఇవే...

ఇండస్ట్రీకి వచ్చాక మొదట నేర్చుకున్నది ఓపికగా ఉండడం. అవకాశాల కోసం దాదాపు రెండేండ్లు ఆడిషన్స్ ఇచ్చి వాటి కోసం ఎదురుచూశా. ఒక్కమాటలో చెప్పాలంటే ఆడిషన్స్​ ఇవ్వడం సమాధానం కోసం ఎదురు చూడడం అలవాటైపోయింది. ఆడిషన్స్​ ఇస్తున్న మొదట్లో అవకాశం రాకపోతే బాధపడేదాన్ని. చాలా దిగులుగా అనిపించేది. ఇప్పుడు అది లేదు.

మంచి క్యారెక్టర్ కోసం ఎదురుచూడడంలో తప్పు లేదు అనిపిస్తుంది. అందుకే అంటున్నా ఓపిక అవసరం అని.

నేను నేర్చుకున్న రెండో విషయం.. ఇతరులతో మంచిగా ఉండడం. ఎందుకంటే ఒక క్యారెక్టర్​ చేస్తున్నాం అంటే అందులో ఎన్నో రకాల ఎమోషన్స్ ఉంటాయి. నాది కాని ఆ పాత్రలో లీనమై పోవాల్సి ఉంటుంది. అలా కావాలంటే ఆయా క్యారెక్టర్స్​ని బాగా అర్థం చేసుకోవాలి. అప్పుడే సరిగ్గా ప్రజెంట్ చేయగలను. అలా ఇతరులతో సెన్సిటివ్​గా ఉండాలనే విషయం తెలుసుకున్నా.  

ఎప్పుడూ అనిపించలేదు

రెండేండ్ల పాటు యాక్టింగ్, డాన్స్, డైలాగ్స్ వంటివి నేర్చుకోవడానికి పగలు రాత్రి చాలా కష్టపడ్డా. ఆడిషన్స్​కి వెళ్లి పర్ఫార్మ్ చేసి, అలసిపోయి ఇంటికొచ్చేదాన్ని. తర్వాతి రోజు ఆడిషన్ లేకపోతే పొద్దున లేవగానే ఏం చేయాలో అర్థం అయ్యేది కాదు. ఒకపక్క ట్రైనింగ్ తీసుకుంటూ, ఆడిషన్స్ ఇస్తున్నా.. ‘ఇంకా ఏం చేయాలి?’ అనే ప్రశ్న నా ముందుండేది. కొన్నిసార్లు నిరాశగా, నిస్సహాయంగా అనిపించేది.

జీవితం మన కంట్రోల్​లో ఉండదు కదా. కొందరు నిర్ణయాలు తీసుకోవడానికి ఇండస్ట్రీలో తెలిసిన వాళ్లపై ఆధారపడేవాళ్లు. అది చూసినప్పుడు నాకు భయం వేసేది. ఏం జరుగుతోంది? అనేది అర్థమయ్యేది కాదు. కానీ మనసులో మాత్రం నేను ఫలానాది చేయాలనుకుంటున్నా. కాబట్టి ఇదే చేస్తా అని గట్టిగా నిర్ణయించుకుంటే మనకు అనుకూలంగా జరుగుతుంది’ అనేదాన్ని గట్టిగా నమ్మేదాన్ని. అంతేకానీ ‘నేను ఇది చేయలేను’ అని అనుకోలేదు. ఒకవేళ మొదట్లోనే నాకు మంచి అవకాశాలు వచ్చినా .. అప్పుడు రెడీగా ఉండేదాన్ని కాదేమోనని ఒక్కోసారి అనిపిస్తుంటుంది. అవకాశాలు రావడానికి టైం పట్టినందుకు నాకు సంతోషంగానే ఉంది. ఇప్పుడు వస్తున్న ప్రతి అవకాశం నాకు చాలా నచ్చింది. 

ఎదురు చూపులో..

ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు దాన్నే పట్టుకుని కూర్చోకూడదు. దాని గురించే ఆలోచిస్తూ కూర్చుంటే కెరీర్​లో ముందుకు వెళ్లలేం. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎత్తుపల్లాలు సహజం. అన్నీ అనుకున్న వెంటనే జరగవు. కొన్నింటికి చాలా టైం పట్టొచ్చు. అయినా మనం అనుకున్నదానికోసం ఎంతకాలమైనాఎదురుచూడాలి. ఈ విషయాలన్నీ తెలియకపోయినా ఫర్వాలేదు.

ఇండస్ట్రీనే మనకు చాలా నేర్పిస్తుంది. మంచి జరిగినా తీసుకోవాలి. చెడు జరిగినా యాక్సెప్ట్ చేయాలి. తర్వాత నెమ్మదిగా పని చేసుకుంటూ పోవాలంతే. అందుకు ఉదాహరణ ‘యానిమల్​’లో బాబీ డియోల్ క్యారెక్టర్​. చాలాకాలం తర్వాత ఒక్కసారిగా లైమ్​లైట్​లోకి వచ్చిన బాబీ డియోల్​ బెస్ట్​ ఎగ్జాంపుల్​. అలా ఓపికగా ఎదురుచూస్తే ఒకరోజు వస్తుంది. ఆ రోజున ఎలాంటి సాహసాలు చేసినా వర్క్​ అవుతాయి.

ముందే ఊహించలేం!

ఒక ప్రాజెక్ట్ చేస్తే అది బ్రేక్ ఇవ్వొచ్చు. లేదంటే ఫెయిల్​ కావచ్చు. మేం చాలా మంచి ప్రాజెక్ట్స్ అనుకుని చేసినవి ఆడియెన్స్​ ముందుకు వస్తాయో... లేదో తెలియదు. ఒకవేళ రిలీజ్​ అయినా వాటికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఊహించలేం. అంతెందుకు.. కొవిడ్ ప్యాండెమిక్​ లాంటి పరిస్థితులు వస్తే? మన చేతుల్లో ఏం ఉండదు. ఆ టైంలో థియేటర్స్ అన్నీ బంద్​ అయిపోయాయి.

రిలీజ్​ కావాల్సిన ప్రాజెక్ట్స్ ఆగిపోయాయి. నేను కూడా అప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నా. కానీ, వాటి గురించి బయటకు చెప్పుకునే పరిస్థితి లేదు. అలాగే ఆ టైంలో కొన్ని స్క్రిప్ట్స్ విన్నా. ఆడిషన్స్ ఇచ్చా. కానీ, అవేవి వర్కవుట్ కాలేదు. దానికి కారణాలు తెలిసినా బయటకు చెప్పలేను. ఇండస్ట్రీలో పరిస్థితి ఎప్పుడు? ఎలా ఉంటుందో తెలియదు. అందుకని బయటకు చెప్పకపోవడం బెటర్. రిలీజ్​ అయ్యాక మాట్లాడుకుంటే చాలు.

నేను నమ్మేది...

నిజానికి ఎక్కడికైనా వెళ్తే... వెంటనే ఫొటోలు తీసి వాటిని పోస్ట్ చేసే అలవాటు లేదు నాకు. కానీ నాకు ఫిట్​నెస్​ అంటే చాలా ఇష్టం. అందుకే నా ఫిట్​నెస్​ వీడియోలను మాత్రం సోషల్​ మీడియాలో షేర్ చేస్తుంటా. ప్రతి అమ్మాయికి తనకంటూ ఏవో ఆశలు ఉంటాయి. నాకు అలానే ఉండేవి. కాకపోతే.. ఏదైనా సాధించాలంటే ఎవరినో కాపీ కొట్టడం సరికాదు. వాళ్లలా ఉండాలని పోల్చుకోకూడదు. నీకంటూ ఒక స్పెషాలిటీ ఉండాలి. దానికోసం కష్టపడాలి. మన మీద మనకు ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. అప్పుడే నిన్ను నిన్నుగా గుర్తిస్తారు అనే విషయాన్ని నేను బాగా నమ్ముతా’’ అని ముగించింది నమ్రత.

ప్రేమంటే..

నా దృష్టిలో ప్రేమంటే నిస్వార్థంగా ఉండడం. ఏమీ ఆశించకుండా ప్రేమిస్తేనే... అది నిజమైన ప్రేమ. అలాగే అందరూ కలిసి ఉంటేనే రిలేషన్స్ బాగుంటాయి. భాగస్వాములు ఇద్దరూ ఒకరితో ఒకరు నిజాయితీగా ఉండాలి. అప్పుడే బాండింగ్ స్ట్రాంగ్​గా ఉంటుంది. 

    ‘నన్హికాళి’ అనే స్వచ్ఛంద సంస్థతో అసోసియేట్ అయి ఉన్నా. ఈ సంస్థ ప్రతి అమ్మాయికి చదువుకునే హక్కు, గౌరవం కల్పించడానికి పనిచేస్తుంది. 
    ఖాళీ టైం దొరికితే డాన్స్​ ప్రాక్టీస్ చేస్తా. 
    నేను నార్త్​ ఇండియన్​ను​ అయినా... నాకు సౌత్​ ఇండియన్​ ఫుడ్ అంటే చాలా ఇష్టం. 
    ఇప్పుడిప్పుడే వెబ్​ సిరీస్​లతో కెరీర్ మొదలైంది. బిగ్​ స్క్రీన్​పై కనిపించాలనేది నా డ్రీమ్. 


కర్మ కాలింగ్​

‘కర్మ కాలింగ్’ వెబ్​ సిరీస్​ ఓటీటీలో స్ట్రీమింగ్​ అవుతోంది. అందులో నేను చేసిన కర్మ తల్వార్​ (అంబిక)క్యారెక్టర్ కోసం చాలా రౌండ్స్ ఆడిషన్ చేశారు. ఆ రోల్ నాకు చాలా కనెక్ట్​ అయింది. ఈ కథ ఇంద్రాణి కొఠారి (రవీనా టండన్) చుట్టూ తిరుగుతుంది. ఆమె అలీబాగ్​కి రాణి. ఆమెని స్మార్ట్​గా ఎదుర్కొనే క్యారెక్టర్​ నాది. దీన్ని యూఎస్ వెబ్​ సిరీస్​ ‘రివెంజ్’ ఆధారంగా తీశారు.