క్యారెక్టర్ పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా తనదైన స్టయిల్లో సీన్ పండించగల నటుడు. ఏ క్యారెక్టర్ చేసినా తన మార్క్ కనపడేలా నటించడం ఆయన బలం. తనది కాని ఇండస్ట్రీలో కూడా తనకంటూ కొత్త పేజీ క్రియేట్ చేసుకున్న నటుడు... రవీంద్ర విజయ్. ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన యాక్టర్. తమిళ, హిందీ, తెలుగు భాషల్లో నటించడమే కాదు సొంతంగా డబ్బింగ్ కూడా చెప్తున్నాడు. లేటెస్ట్గా రిలీజ్ అయిన ‘కీడా కోలా, మంగళవారం’ సినిమాలతోపాటు ‘దూత’ వెబ్‌సిరీస్‌లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ‘వ్యూహం’ అనే వెబ్‌సిరీస్‌తో మరోసారి తెలుగు ఆడియెన్స్ ముందుకొచ్చాడు. డాక్టర్ ప్రొఫెషన్ వదిలి యాక్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్న ఈయన సినీ జర్నీతో పాటు పర్సనల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ సంగతులివే.
మాది బెంగళూరు. నా మాతృభాష తమిళం. నేను పుట్టి పెరిగింది కర్నాటకలో. మా చుట్టూ రకరకాల భాషల వాళ్లు ఉండేవాళ్లు. అలా నేను తెలుగు నేర్చుకున్నా. కన్నడ, తెలుగు, తమిళ, ఇంగ్లిష్, హిందీ భాషలు మాట్లాడగలను. తెలుగు ఇండస్ట్రీకి వచ్చాక ఇక్కడి ఆడియెన్స్‌కి సినిమాల మీద ఉన్న ప్రేమ, క్రేజ్ మిగతా ఇండస్ట్రీల్లో నాకు కనిపించలేదు. అలాంటి ఇండస్ట్రీలో నేను భాగమవ్వడం చాలా సంతోషంగా అనిపిస్తుంది.
డాక్టర్ చదివి...
చిన్నప్పుడు సినిమాలు ఎక్కువ చూసేవాడిని కాదు. పెద్ద సినిమాలు వస్తేనే తీసుకెళ్లేవారు. అందుకని పుస్తకాలు చదివేవాడిని. మ్యూజిక్ కూడా వినేవాడిని కాదు. నాన్న పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసేవాడు. అమ్మ గవర్నమెంట్ టీచర్. నన్ను ఇంజినీర్ అవ్వమనేవాళ్లు నాన్న. అమెరికా వెళ్లి సెటిలవ్వాలని చెప్తుండేవాళ్లు. కానీ, నాకేమో డాక్టర్ అవ్వాలని ఉండేది. అందుకే బెంగళూరు మెడికల్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో ఎం.బి.బి.ఎస్. చదివా. డాక్టర్ అయ్యాక కొన్ని హాస్పిటల్స్‌లో పనిచేశా. ఆ తర్వాత ఒక తొమ్మిది నెలలు ‘షిప్, ఆయిల్ రిడ్జెస్’లో వర్క్ కూడా చేశా. ‘మరి డాక్టర్ ప్రొఫెషన్ ఎంచుకున్న వాడివి. యాక్టర్ ఎందుకు అయ్యావు?’ అని అడిగితే... దానికి సమాధానం చెప్పలేను.
స్టూడెంట్‌గా ఉన్న టైంలోనే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ కలిగింది. యాక్టింగ్‌ని హాబీగా తీసుకుని బెంగళూరుకు చెందిన ‘రఫీకి’ అనే థియేటర్ గ్రూప్‌లో చేరా. వాళ్లతో కలిసి నాటకాలు వేసేవాడ్ని. కొంతకాలం తర్వాత ఫుల్ టైం యాక్టింగ్ ఎందుకు ఎంచుకోకూడదు అనిపించింది. అలా 2011లో ఫుల్ టైం థియేటర్ యాక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టా. చెన్నయ్ వెళ్లాక ‘పెర్చ్’ అనే గ్రూప్‌లో చేరా. అక్కడ నాటకాలు చేస్తున్నప్పుడు ‘ఒడు రాజ ఒడు’ నాజర్ సినిమాలో అవకాశం వచ్చి, అందులో చేశా. ప్యాండెమిక్ ముందు వరకు కూడా నాటకాల్లో చేస్తూనే ఉన్నా.
యాక్టర్‌గా టర్న్ అయిందప్పుడే
యాక్టింగ్ వైపు వెళ్లాలని నేను తీసుకున్న నిర్ణయం గురించి మా ఇంట్లో చెప్పగానే అందరూ షాకయ్యారు. ‘మెడిసిన్ వదిలేసి యాక్టర్ అవుతానంటావేంటి?’ అని ఆశ్చర్యపోయారు. నాటకాల్లో పార్టిసిపేట్ చేస్తానంటే మా నాన్న ఒప్పుకోలేదు. అప్పుడు ఇద్దరి మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. ‘‘నెల రోజులు గ్యాప్ తీసుకుని నాటకాలు వేస్తా. నచ్చితే ఉంటా. లేకపోతే మీరు చెప్పినట్టే వింటా’’ అని చెప్పా. దాంతో ‘సరే’ అన్నారు. నాకు సినిమాలో మొదటి అవకాశం వచ్చినప్పుడు షూటింగ్ కోసం నేను చెన్నయ్‌కి వెళ్లాలి.
అందుకు అన్నీ సర్దుకుంటున్న టైంలో కారు యాక్సిడెంట్ జరిగి నాన్న చనిపోయారు. ఆయన నేను నటించేందుకు ఒప్పుకున్న తర్వాత నేను వేసిన ఒక్క నాటకం లేదా నటించిన ఒక్క సినిమా కూడా ఆయన చూడలేదే అనే బాధ మిగిలిపోయింది. ఇప్పుడు నా యాక్టింగ్ కెరీర్ చూసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. మా అమ్మకి కూడా నేను నాటకాల్లోకి వెళ్లడం ఇష్టం లేదు. కానీ నా కోసం మా నాన్నకి సర్దిచెప్పేది. ఇప్పుడు నా సినిమాలు రిలీజ్ అయితే, చుట్టుపక్కల వాళ్లకు చూడమని చెప్తుంటుంది. ఒక్కోసారి మాత్రం ‘మళ్లీ డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తావా?’ అని అడుగుతుంటుంది.
కన్నడలో తప్ప..
స్కూల్స్‌కి వెళ్లి నాటకాలు వేసేవాళ్లం. అందులో స్కిట్ పూర్తిగా ఉండదు. సగం స్కిట్ వేశాక ఒక క్యారెక్టర్ని ఆడియెన్స్ నుంచే పిలుస్తాం. వాళ్లు ఆ క్యారెక్టర్లో ఉంటే ఏం చేస్తారు? అనేది చూపిస్తాం. అలా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్‌లా నాటకాన్ని చేస్తాం. ఇలాచేయడాన్ని ‘ఫోరమ్ థియేటర్ ప్లే’ అంటారు. అది థియేటర్లో ఒక భాగం. నాటకాల్లో నా మొదటి సంపాదన 2,500 రూపాయలు.
మొదట కన్నడ సినిమాల్లోనే ట్రై చేశా. కానీ, అవకాశాలు రాలేదు. ఇప్పుడిప్పుడు వస్తున్నాయి. చెన్నయ్‌లో ఉన్నప్పుడు సినిమా అవకాశాల కోసం అసిస్టెంట్ డైరెక్టర్స్‌కి కాల్స్ చేసేవాడిని. ఫ్రెండ్స్ చెప్పడం వల్ల ఆడిషన్స్‌కి వెళ్లేవాడ్ని. అయితే, ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమా కోసం డైరెక్టర్ చెన్నయ్ వచ్చినప్పుడు నేను ఆయన్ని కలిశా. అప్పటికి ‘ఉమా మహేశ్వర..’ ఆలోచన ఉందో లేదో కూడా తెలియదు. స్క్రిప్ట్ అయ్యాక, నన్ను పిలిచి ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’లో అవకాశం ఇచ్చారు.
ఫ్యామిలీ మ్యాన్ తర్వాత..
నాకు తెలిసిన రైటర్ సుమన్ కుమార్ ద్వారా ‘ది ఫ్యామిలీ మ్యాన్ –2’ ఆడిషన్‌కి వెళ్లే ఛాన్స్ వచ్చింది. అతను కాలేజీలో నా సీనియర్ వాళ్ల హజ్బెండ్. అప్పుడు ఆయన ఐటీ ఎంప్లాయి. నేను డాక్టర్. మా ఇద్దరి పరిచయం ఫ్రెండ్షిప్గా మారింది. అప్పుడు మేం ఇద్దరం సినిమా ఇండస్ట్రీలో ఉంటామని అనుకోలేదు. ఇప్పుడు ఆయన రాసి, డైరెక్ట్ చేయబోతున్న సినిమాలో నేను నటిస్తున్నా. ఫ్యామిలీ మ్యాన్ ఆడిషన్ అయ్యాక నాకు పోలీస్ క్యారెక్టర్ ఇచ్చారు.
ఆ తర్వాత నుంచి వరుసగా అవే క్యారెక్టర్స్‌తో చాలా ఆఫర్లు వచ్చాయి. ఇంకా కూడా వస్తూనే ఉన్నాయి. వాటిలోకూడా చాలావరకు ఎస్సై క్యారెక్టరే. ఈ సిరీస్ చేసేటప్పుడే ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’, తమిళంలో ఒక సినిమాలో కూడా నటించా. మనోజ్ బాజ్‌పాయ్‌తో నటించడానికి కాస్త టైం పట్టింది. ఎందుకంటే ఫస్ట్ టైం హిందీలో, పైగా బిగ్ స్క్రీన్‌లో చూసిన యాక్టర్ పక్కన నటించాలంటే కాస్త తడబాటు ఉంటుంది కదా. రెండ్రోజుల తర్వాత అంతా సెట్ అయిపోయింది.
ఇక ‘మంగళవారం’ సినిమాకి వస్తే.. ఆ మూవీ షూటింగ్ అంతా కోనసీమలోనే జరిగింది. ఆ టైంలో గోదావరి ప్రాంతాన్ని బాగా ఎంజాయ్ చేశాం. లాండ్ స్కేప్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఫుడ్ కూడా చాలా బాగా నచ్చింది. అజయ్ భూపతితో వర్క్ చేయడం మంచి ఎక్స్‌పీరియెన్స్. ఈ సినిమా విషయానికొస్తే.. ఇందులో నా క్యారెక్టర్‌కి పలు షేడ్స్ ఉంటాయి. ఒకరకంగా అది నా ఏజ్‌కి మించిన పాత్ర.
ఐడియా షేర్ చేసుకుంటా
క్యారెక్టర్ చేసేటప్పుడు ఏదైనా మార్పు చేస్తే బాగుండు అనిపిస్తే డైరెక్టర్‌కి చెప్తా. వాళ్లకు నచ్చితే ‘ట్రై చేద్దాం’ అంటారు. కొన్నిసార్లు డైరెక్టర్ ‘వద్దు’ అని కూడా అంటారు. అలా చెప్పడం కూడా మంచిదే. ఎందుకంటే అది డైరెక్టర్ విజన్. కథ రాసి, తీయకముందే ఎలా ఉంటుందో ఊహించి ఉంటారు. అందుకని వాళ్ల డెసిషన్కి రెస్పెక్ట్ ఇస్తా. అలాగని నాకు అనిపించినప్పుడు వాళ్లతో చెప్పకుండా కూడా ఉండలేను” అని చెప్పారు.
- మా నాన్న వేలూరులో పుట్టారు. ఆ టైంలో తమిళనాడులో ఇంటి పేరు పెట్టుకునే అవకాశం లేదు. అందువల్లే నా పేరు రవీంద్ర విజయ్ అని రెండు పేర్లుగా ఉంటుంది.
- ఒకేలాంటి పాత్రలు చేయాలని అనుకోలేదు. వెరైటీ రోల్స్ చేయాలనుంది.
- హీరోయిజం ఉన్న రోల్స్ కూడా వచ్చాయి. కానీ, అవి నాకు ఫిట్ కావు అనిపించింది. ప్రస్తుతం కొన్ని లీడ్ రోల్స్ కూడా చేస్తున్నా.
- మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ నేర్చుకోవాలనుంది.
- నా సినిమాలు నేను చూడలేను. చూస్తే.. ఇంకా బెటర్‌గా చేసి ఉండొచ్చనే ఫీలింగ్ వస్తుంటుంది.
- హిందీలో ‘శ్యాం బహద్దూర్’, తమిళంలో ‘రఘుతాత’, తెలుగులో ‘బృంద’ వంటి ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి.
సక్సెస్ అనేది డబ్బులు ఎక్కువ సంపాదించడంలో ఉండదు. నచ్చింది చేయడమే సక్సెస్. ఇప్పటికీ నాతో పాటు థియేటర్ చేసినవాళ్లు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కొందరు సినిమాలు చేస్తున్నారు. నా దృష్టిలో వాళ్లంతా కూడా సక్సెస్ ఫుల్.
ప్రజ్ఞ